ఒక్కడే మూడు కోట్లతో వంద దరఖాస్తులు.. దక్కింది మూడు వైన్ షాపులు
వైన్‌షాపులకు ఎంత పోటీ నెలకొన్నదో ఈయనే ఉదాహరణ. స్నేహితులతో కలిసి.. మూడు కోట్లు ఖర్చు పెట్టి.. వంద దరఖాస్తులు కొంటే.. డ్రాలో ఆయనకు మూడు వైన్‌షాపులు దక్కాయి. పటాన్‌చెరులో ఈ చిత్రం చోటు చేసుకున్నది.
(హైదరాబాద్, విధాత ప్రతినిధి)
వైన్ షాపుల కోసం ఒక వ్యక్తి వంద దరఖాస్తులు కొనుగోలు చేశారు. ఒక్కో దరఖాస్తు కోసం రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.3 కోట్లు వెచ్చించారు. అయితే ఆయనకు సోమవారం నిర్వహించిన లక్కీ డ్రా లో మూడు షాపులు మాత్రమే దక్కాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైన్ షాపులకు ఎక్సైజ్ అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. కే.వంశీధర్ రెడ్డి అనే వ్యక్తి తన స్నేహితులు హరీశ్, మురళీ తో కలిసి వంద దరఖాస్తులు కొనుగోలు చేశాడు. లక్కీ డ్రాలో ఆయనకు పటాన్ చెరు ప్రాంతంలో మూడు షాపులు దక్కాయి. 32, 34, 40 నెంబర్లతో ఉన్న వైన్ షాపులు దక్కడం పట్ల వంశీధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో అత్యధికంగా లిక్కర్ విక్రయాలు ఇక్కడే ఉంటాయి. ఈ విషయం తెలుసుకుని డ్రా కోసం వచ్చిన పలువురు ఆశ్చర్యపోయారు. దరఖాస్తుల కోసమే రూ.3 కోట్లు ఖర్చు చేశారా, ఏం జరుగుతోందంటూ చర్చించుకున్నారు.
గతేడాది 2,620 వైన్ షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 1.32 లక్షల దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు ధర రూ.2 లక్షలు నిర్ణయించారు. ఈసారి అంత డిమాండ్ ఉండదని ముందే అంచనాకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ధర ను రూ.2 నుంచి రూ.3 లక్షలకు పెంపుదల చేసింది. ధర పెంచడంతో పలువురు వెనక్కి తగ్గారు. తక్కువ ధర ఉండడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, డబ్బులున్న వారు కొనుగోలు చేసి పోటీలో ఉండేవారు. ఈ ఏడాది 2,620 షాపులకు 95,137 దరఖాస్తులు మాత్రమే అందాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 36,863 దరఖాస్తులు తగ్గగా, ఆదాయం మాత్రం తగ్గలేదు. చివరి నిమిషంలో 19 వైన్ షాపులకు డ్రా తీయడం నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తెలియచేస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. శంషాబాద్ పరిధిలో ఎస్.ఎస్.బీ 107, ఎస్.ఎస్.బీ 110, ఎస్.ఎస్.బీ 111 షాపులకు తక్కువ దరఖాస్తులు అందాయి. ఒక్కో షాపునకు 30 మాత్రమే రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోటీ పెంచేందుకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram