ads in Chat GPT | చాట్‌జీపీటీలో యాడ్స్ ఎవరి ఒత్తిడి? ఓపెన్‌ఏఐ మల్లగుల్లాలు!
ads in Chat GPT | చాట్‌జీపీటీ కూడా వినియోగదారులపైకి యాడ్స్ వదలనున్నది. చాట్‌జీపీటీని యూజర్ అడిగే ప్రశ్నలను ఆధారం చేసుకుని, అందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు.. హోం పేజీలో ఇక దర్శనమీయనున్నాయి.
సాధారణంగా మనం గుగుల్ చేసే అంశాలకు సంబంధించిన యాడ్స్ మనం ఉపయోగించే వెబ్‌సైట్ హోం పేజీలో కనిపిస్తూ ఉంటాయి. మనం తరచూ వెతికే అంశాలను గుర్తుపట్టి.. అందుకు సంబంధించిన యాడ్స్‌ను మనపైకి వదులుతాయి. ఇప్పుడు చాట్‌జీపీటీ కూడా వినియోగదారులపైకి యాడ్స్ వదలనున్నది. చాట్‌జీపీటీని యూజర్ అడిగే ప్రశ్నలను ఆధారం చేసుకుని, అందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు.. హోం పేజీలో ఇక దర్శనమీయనున్నాయి.
ఇందుకు సంబంధించిన ప్రణాళికలను చాట్‌జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్‌ఏఐ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. యూజర్‌లకు చాట్‌బాట్‌ను పర్సనలైజ్‌చేసేదిగా చెబుతున్నప్పటికీ.. యాడ్స్‌తో కొనసాగడమా? యాడ్స్ లేకుండా కొనసాగడమా? అన్న విషయంలో యూజర్లు తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది.
ఓపెన్‌ఏఐలో పనిచేస్తున్నవారిలో చాలా మంది గతంలో మెటా కంపెనీలో పనిచేసినవారే. వీరే చాట్‌బాట్‌లో వాణిజ్య ప్రకటనల కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. మెటాలో పనిచేసి, ఓపెన్‌ఏఐలో చేరినవారి పట్ల కంపెనీ కొంత సరళ వైఖరితో ఉన్నట్టు చెబుతున్నారు. ఓపెన్‌ఏఐలో సుమారు మూడు వేల మంది పనిచేస్తుండగా.. అందులో అప్లికేషన్స్ సీఈవో ఫిద్జీ సిమో సహా 630 మంది మెటా మాజీ ఉద్యోగులే. మెటాలో పదేళ్ల కాలం పనిచేసిన సిమో.. ఫేస్‌బుక్ యాప్‌లో యాడ్స్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. చాట్‌జీపీటీలో యాడ్స్ తీసుకొచ్చే టాస్క్ అప్పగించే టీమ్‌కు కొత్త సారథి కోసం కూడా ఆమె అన్వేషిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి.
నిజానికి గత 2024 డిసెంబర్‌లో ఫైనాన్షియల్ టైమ్స్‌తో ఓపెన్‌ఏఐ సీఎఫ్‌వో సారా ఫ్రియర్ మాట్లాడుతూ.. వాణిజ్య ప్రకటనల విషయంలో తమ వద్ద యాక్టివ్ ప్లాన్స్ ఏమీలేవని చెబుతూనే.. కొత్త టీమ్.. కొత్త ఆదాయ వనరులను అన్వేషించేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొనడం గమనార్హం. అయితే.. చాట్‌జీపీటీలో యాడ్స్ ఉంటే పేజీ అందవిహీనంగా మారిపోతుందనే కారణం చూపుతూ ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ అల్ట్‌మన్ ఈ ఆలోచనను పూర్తిగా వ్యతిరేకించారు. లెక్స్ ఫ్రిడ్మన్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆల్ట్‌మన్.. ‘యాడ్స్‌ను తాను ఒక ‘సౌందర్య ఎంపిక’గా మాత్రమే నేను వ్యతిరేకిస్తాను. ఇంటర్నెట్‌లో ప్రకటనలకు కొన్ని కారణాలుండాలి. అవి తాత్కాలికమే. ప్రపంచం ఇప్పుడు ధనికంగా మారింది. ప్రజలు చాట్‌జీపీటీని వినియోగించినందుకు మాత్రమే డబ్బు చెల్లించాలి. కానీ.. అడ్వర్టయిజర్ల ప్రభావానికి లోబడి వారికి కావాల్సిన సమాధానాలు పొందకూడదని యూజర్లు తెలుసుకోవాలని భావిస్తున్నాను’ అని చాలా స్పష్టంగా చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram