2028లో మళ్లీ పోటీ చేస్తాను…రెండున్నరేళ్ల తరువాతే విస్తరణ : సిద్ధరామయ్య

కర్నాటక అసెంబ్లీకి 2028 లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. పార్టీ మరింతగా పటిష్టం చేసేందుకు పోటీ చేయాలని స్నేహితులు చేసిన సూచనతో 2028 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు

  • By: Tech |    national |    Published on : Oct 27, 2025 9:30 PM IST
2028లో మళ్లీ పోటీ చేస్తాను…రెండున్నరేళ్ల తరువాతే విస్తరణ : సిద్ధరామయ్య

హైదరాబాద్, విధాత : కర్నాటక అసెంబ్లీకి 2028 లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. పార్టీ మరింతగా పటిష్టం చేసేందుకు పోటీ చేయాలని స్నేహితులు చేసిన సూచనతో 2028 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
మూడు నాలుగు నెలల క్రితం కర్నాటకలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఢిల్లీ పెద్దలు సూచించారని, అయితే ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి రెండున్నర ఏళ్ల సందర్బం పురస్కరించుకుని విస్తరించనున్నట్లు వారికి తెలియచేశానన్నారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు ఆదేశిస్తే అమలు చేయడం తన బాధ్యత అన్నారు. పార్టీ నాయకత్వం సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశిస్తే మరొకరికి బాధ్యతలు అప్పగించి తప్పుకుంటానని కూడా ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయనని, శిరోధార్యంగా భావిస్తానని అన్నారు. జాతీయ రాజకీయాల్లో తనకు ఏమాత్రం ఆసక్తి లేదని, కన్నడిగులకు రాష్ట్రంలోనే ఉండి సేవలు చేస్తానన్నారు. రెండు మూడు రోజుల క్రితం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ చరమాంకంలో ఉన్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. తన తండ్రి సైద్ధాంతిక వారసుడిగా పబ్లిక్ వర్క్స్ మినిష్టర్ సతీష్ జర్కిహోలి ఎంపిక కావచ్చునని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ట్విస్టు చేశారని, రాజకీయ వారసుడు అని చెప్పలేదని సైద్ధాంతిక వారసుడు అని మాత్రమే చెప్పారని సిద్ధరామయ్య వివరించారు.

తెలంగాణ లోనూ విస్తరణ తప్పదా?
తెలంగాణ లోనూ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల తరువాత అంటే 2026 మే లేదా జూన్ నెలలో మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పటికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తవుతాయి. ప్రస్తుత మంత్రి వర్గంలో మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులకు రెండున్నర ఏళ్లు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. సమర్థులను మంత్రివర్గంలోకి తీసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేదు. ప్రతి ప్రభుత్వం లో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేది. కుల సమీకరణలు, రాజకీయ సమీకరణల కారణంగా ఈ మూడు జిల్లాలు భారీగా నష్టపోయాయి.