Maoist Party Letter | సోనూ, సతీష్ విప్లవ ద్రోహులు: మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

విప్లవద్రోహులుగా, పార్టీ విచ్చిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువుకు లొంగిపోయిన సోనూ, సతీష్లు, వారి అనుచరులకు తగిన శిక్ష విదించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నామని, సాను, సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పేర్కొంది. ఈ నెల 16వ తేదీన ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన ప్రకటన తాజా పరిస్థితుల్లో తీవ్ర సంచలనంగా మారింది.

Maoist Party Letter | సోనూ, సతీష్ విప్లవ ద్రోహులు: మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

వారు విప్లవ ప్రతిఘాతుకులు, పార్టీ విచ్చిన్నకులు
ఈ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం
తగిన శిక్ష విధించాలని ప్రజలకు పిలుపు
సోనూ పై తీవ్ర ఆరోపణలు,విమర్శలు
మహారాష్ట్ర సీఎంతో సొనూకు సంబంధాలు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

విప్లవద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువుకు లొంగిపోయిన సోనూ, సతీశ్, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నామని, సాను, సతీశ్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పేర్కొంది. ఈ నెల 16వ తేదీన ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన ప్రకటన తాజా పరిస్థితుల్లో తీవ్ర సంచలనంగా మారింది. ప్రకటన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

‘మా పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, డీకే ఎస్.జెడ్.సీ. ప్రత్యమ్నాయ సభ్యురాలు దీప, 10 మంది డివిజనల్ కమిటీ/కంపెనీ పార్టీ కమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులు మొత్తం 61 మంది అక్టోబర్ 14 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గడ్చిరోలిలో పోలీసులకు లొంగిపోయారు. మా పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన 50 తుపాకుల్ని శత్రువుకు అప్పగించారు. ఈ లొంగుబాటు విప్లవ ద్రోహం, పార్టీ విచ్ఛిన్నకర చర్య, విప్లవ ప్రతిఘాతకత‘ అని లేఖలో పేర్కొన్నారు.

దండకారణ్య ఉద్యమం గడ్డు స్థితిలో ఉంది

’2011 చివరి నుండి గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వచ్చిన దండకారణ్య విప్లవోద్యమం, దేశవ్యాప్త విప్లవోద్యమం 2018 నాటికి తాత్కాలిక వెనకంజకు గురయ్యాయి. అప్పటినుండి సోనులో రాజకీయ బలహీనతలు బయటపడ్తూ వచ్చాయి. 2020 డిసెంబర్ లో జరిగిన కేంద్రకమిటీ సమావేశంలో సోను దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై స్వీయాత్మక విశ్లేషణతో కూడిన నిర్ధారణలు చేస్తూ ఒక పత్రాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని కేంద్రకమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఎప్పటికపుడు జరుగుతూ వచ్చిన కేంద్రకమిటీ (సీసీ), పొలిట్ బ్యూరో (పీబీ) సమావేశాల్లో ఆయనలోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి సీసీ, పీబీలు కృషి చేశాయి. 2011లో జరిగిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్లీనం సోనులోని వ్యక్తివాదాన్ని, అహంభావాన్ని, తీవ్రమైన పెత్తందారీతనాన్ని (బ్యూరోక్రసీ) తీవ్రంగా విమర్శించి, వాటిని సరిదిద్దుకోవాలని కోరింది. ఆ తర్వాత జరుగుతూ వచ్చిన డీకే ఎస్.జెడ్.సీ. సమావేశాల్లో ఎస్.జెడ్.సీ. సభ్యులు ఆయనలోని అన్యవర్గధోరణులను సరిదిద్దడానికి విమర్శలు పెడుతూ వచ్చారు. అయితే, 2025 మే నెలలో జరిగిన కగార్ దాడిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరిల్లేలా చేసాయి.

కగార్ ప్రతిఘాతుక యుద్ధంతో మార్పులు

2024 జనవరి నుండి మొదలయిన విప్లవ ప్రతిఘాతక కగార్ యుద్ధంతో విప్లవకారులందరూ, విప్లవ ప్రజలందరూ ప్రతిరోజూ శత్రు దాడులను ఎదుర్కొంటూ పనిచేసే పరిస్థితి ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించడమంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న కగార్ యుద్ధాన్ని, ప్రాణాంతక చుట్టుముట్టి-మట్టుబెట్టే దాడులను ప్రతిఘటిస్తూ ప్రతిరోజూ ప్రాణ త్యాగానికి సిద్దపడి నిబ్బరంగా నిలబడే స్థితిగా మారింది. సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థం ఆ త్యాగానికి సిద్దపడని స్థితికి, ప్రాణభీతికి దారితీసింది. ఈ విషయాన్ని నిజాయతీతో అంగీకరించడానికి ఆయన సిద్ధపడలేదు. కానీ ఆయన తనలో దీర్ఘకాలంగా ఉన్న అహంభావాన్ని సరిదిద్దుకోని ఫలితంగా తన బలహీనతలకు, ప్రాణభీతికి ముసుగు కప్పి పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ- సైనిక పంథా (వ్యూహం) ఫలితంగా భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారి తీసిందని, ఈ స్థితిలో ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు పత్రికా ప్రకటనను విడుదల చేశాడు.

పార్టీ రాజకీయ, సైనిక పంథాపై దాడి

నిజాయితీ కలిగిన విప్లవకారులు ఎవరయినా, విప్లవతత్వం ఉన్న వారెవరయినా విప్లవోద్యమం తాత్కాలిక వెనకంజకు దారితీసిన కారణాలను మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టు (మా-లె-మా) విశ్లేషణ పద్ధతిని అనుసరించి విశ్లేషిస్తారు. అందుకోసం గత చరిత్రను, వర్తమాన స్థితిని, భవిష్యత్ అవకాశాలను విశ్లేషిస్తారు. వస్తుగత స్థితిని, స్వీయాత్మక స్థితిని, శత్రు బలాబలాలను, ఉద్యమ బలాబలాలను వాస్తవికంగా విశ్లేషిస్తారు. అందులో భాగంగా అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులను విశ్లేషిస్తారు. కానీ ఆయన ఈ మధ్య రాసిన వ్యాసాల్లో, ప్రజలకు విజ్ఞప్తి, కాడర్లకు విజ్ఞప్తి పత్రాల్లో, సెప్టెంబర్ 15 నాడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దీనికి భిన్నమైన పెటీబూర్జువా స్వీయాత్మక విశ్లేషణ పద్ధతి ఉంది.పార్టీ అనుసరిస్తున్న మౌలిక పంథా/రాజకీయ-సైనిక పంథా లేదా రాజకీయ-సైనిక వ్యూహాలు తప్పు అని నిర్ధారించడానికి ప్రధానంగా మూడు కారణాలను చెప్పాడు. అవి, మనకు విప్లవ పార్టీ లేదు, 2007 నాటి ఐక్యతా కాంగ్రెస్ రూపొందించిన కేంద్ర కర్తవ్యం ఉద్యమ బలానికి మించిన అతివాద నిర్ణయం, చట్టబద్ద పోరాటాలను తిరస్కరించాం అని చెప్పాడు. ఈ మూడు తప్పుడు నిర్ధారణలు. దీంతోపాటు దళారీ నిరంకుశ బూర్జువా వర్గానికీ దేశ ప్రజానీకానికీ మధ్యనున్న వైరుధ్యాన్ని ప్రధాన వైరుధ్యంగా గుర్తించి దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను మార్చుకోవాలని ప్రకటించాడు. పార్టీ మౌలిక పంథాను /వ్యూహాన్ని మార్చుకోవాలంటే దేశంలో నెలకొన్న ఉత్పత్తి సంబంధాలను వాటిని వెన్నంటి వర్గ సంబంధాలను, రాజ్య స్వభావాన్ని విశ్లేషించాలి, ఆ విశ్లేషణ ఆధారంగా ప్రస్తుత విప్లవ దశను నిర్ధారించి రాజకీయ పంథాను / రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకోవాలి. భారత విప్లవ యుద్ధపు స్వాభావిక లక్షణాల్లోని మార్పులను విశ్లేషించి, దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాల స్వభావంలో కలుగుతున్న మార్పులను విశ్లేషించుకుని సైనిక పంథాను రూపొందించుకోవాలి. ఈ మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టు విశ్లేషణ పద్ధతికి భిన్నమైన పెటీబూర్జువా, స్వీయాత్మక అధ్యయన-విశ్లేషణ పద్ధతిని ఆయన అనుసరించాడు. స్వీయాత్మక అధ్యయన – విశ్లేషణ పద్ధతి అంటేనే ఏకపక్షత, పాక్షికత / అసమగ్రత, పైపై విశ్లేషణ పద్ధతి. ఆయన ఈ మధ్య రాసిన వ్యాసాల్లో, ప్రజలకు విజ్ఞప్తిలో, కాడర్లకు విజ్ఞప్తిలో, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పత్రికా ప్రకటనలో ఈ పద్ధతితో కూడిన విశ్లేషణ, నిర్ధారణలున్నాయి. అందుకే ఆయన ఒకపక్క మా పార్టీ రూపొందించిన ‘భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు-మన రాజకీయ కార్యక్రమం’, ‘భారతదేశంలో కులసమస్య-మన దృక్పథం’, ‘భారతదేశంలో జాతుల సమస్య-మన పార్టీ వైఖరి’, ప్రస్తుతం సీసీకే పరిమితమైన ‘భారతదేశ దళారీ నిరంకుశ బూర్జువా వర్గంపై మన పార్టీ వైఖరి – రాజకీయ కార్యక్రమం’ డాక్యుమెంట్లను ఆమోదిస్తున్నాను అంటూనే, విప్లవోద్యమ వెనకంజకు దారితీసిన కారణాల గురించి సమీక్షించి కేంద్రకమిటీ డిసెంబర్ 2020లో విడుదల చేసిన ‘కేంద్ర, రాజకీయ-నిర్మాణ సమీక్ష’ను, ఆగస్టు 2024 నాటి ‘పీబీ సర్క్యులర్ ‘ను ఆమోదిస్తున్నాను అంటూనే ఈ డాక్యుమెంట్లకు భిన్నమైన నిర్ధారణలు చేస్తూ చివరకు మా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ-సైనిక పంథానే తప్పు అని నిర్ధారణ చేసాడు. అందుకే ఆయన విప్లవోద్యమ వెనకంజ స్థితికి పార్టీ చేసిన పొరపాట్లే కారణమని ఏకపక్ష విశ్లేషణ చేసాడు. పార్టీ చేసిన స్వీయాత్మక పొరపాట్లతో పాటు భారతదేశపు బలమైన, శక్తిశాలి రాజ్యం అనేక దశాబ్దాలుగా కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతక దాడులు, కగార్ యుద్ధం ఈ స్థితి తలెత్తడానికి కారణమని పార్టీ చేసిన నిర్ధారణను ఆయన తిరస్కరించాడు. దేశంలో భూస్వామ్యం అవశేషంగా మారనంతకాలం దళారీ నిరంకుశ బూర్జువా వర్గానికీ విశాల ప్రజలకు మధ్య వైరుధ్యం ప్రధాన వైరుధ్యంగా మారజాలదు. (పత్రికా ప్రకటనకున్న పరిమితి రీత్యా ఈ విషయంపై ప్రస్తుతానికి ఇంతకుమించి రాయడం లేదు.).

భిన్నాభిప్రాయాలను పార్టీలో ఉంటూ చర్చించాలి

నిజంగా సోనుకు తను రాసిన వాటిపై విశ్వాసం ఉంటే పార్టీలో ఉంటూ, కేంద్రకమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించడానికి సిద్ధపడాలి. ప్రాణత్యాగానికి సిద్దపడి విప్లవోద్యమానికి నాయకత్వం అందిస్తూనే తన అభిప్రాయాలను, తన వాదనలను కేంద్రకమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించి విప్లవోద్యమంలోని తప్పులను సరిదిద్దడానికి కృషి చేసి ఉంటే ఆయనలో తన వాదనల పట్ల తనకు విశ్వాసం ఉందని, నిజాయతీ ఉందని అంగీకరించే వాళ్లం. కానీ అందుకు సిద్దపడకుండా, పార్టీ నిర్మాణ పద్ధతిని పాటించకుండా, శత్రువు ముందు లొంగిపోయాడు అంటేనే ఆయనలో తన వాదనల పట్ల తనకే విశ్వాసం లేదని, నిజాయతీ లేదని, తన వాదనలు కేవలం తన ప్రాణభీతిని కప్పిపుచ్చుకునే అవకాశవాదం అని తేలిపోయింది. ఈ రకమైన తప్పుడు వాదనలతో విప్లవ శిబిరాన్ని, పార్టీ కాడర్లను, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులను మోసగించడం, శత్రువు ముందు లొంగిపోవడం విప్లవ ద్రోహమవుతుంది. తన తప్పుడు వాదనలను కేంద్రకమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించకుండా కేంద్రీకృత ప్రజాస్వామిక పద్ధతిని ఉల్లంఘించి, నిర్మాణ క్రమశిక్షణను ఉల్లంఘించి గత కొద్ది నెలలుగా వివిధ స్థాయిల పార్టీకమిటీ సభ్యులతో, పార్టీ సభ్యులతో, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులతో చర్చించే, పార్టీని చీలదీసే కుట్రకు పూనుకున్నాడు. పార్టీ రాజకీయ-సైనిక పంథాపై దృఢంగా నిలబడిన పార్టీకమిటీ సభ్యులను, పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులను పథకం ప్రకారం దూరం పెడ్తూ వచ్చాడు. ఇవి అరాచకవాద, పార్టీ విచ్చిన్నకర చర్యలే.

ద్రోహులను ప్రజలు శిక్షించాలి

సోను, ఆయన అనుచరులు శత్రువుకు లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని పార్టీకి అప్పగించాలని కేంద్రకమిటీ ఈ మధ్య విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసినప్పటికీ దాన్ని పాటించకుండా, 50 ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు. ఎందరో మంది కామ్రేడ్స్ శత్రు సాయుధ బలగాలతో పోరాడి ప్రాణాలర్పించి వారినుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని శత్రువుకు అప్పగించడమంటే విప్లవకారులను హత్య చేయడానికి/విప్లవకారులను హత్య చేయమని శత్రువుకు అందించడమే. ఇది విప్లవ ప్రతిఘాతుకత (కౌంటర్ రెవెల్యూషనరీ) అవుతుంది. విప్లవ తత్వాన్ని కోల్పోయి, విప్లవ ద్రోహిగా, పార్టీ విచ్చిన్నకుడిగా, విప్లవ ప్రతిఘాతకుడిగా మారిన సోనును, ఆయనతో కలిసి శత్రువులు లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకే ఎస్.జెడ్.సీ.) సభ్యుడు వివేక్ ను, డీకే ఎస్.జెడ్.సీ. ప్రత్యమ్నాయ సభ్యురాలు దీపను, 10 మంది డివిజనల్ కమిటీ/కంపెనీ పార్టీకమిటీ సభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నాం. విప్లవ ద్రోహం చేసిన ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. సోను చేస్తున్న వాదనలోని మోసాన్ని, అవకాశవాదాన్ని అర్థం చేసుకోకుండా మోసపోయి ఆయనతో కలిసి వెళ్లి శత్రువుకు లొంగిపోయిన పార్టీ సభ్యులు, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులు ఇకముందయినా అర్థం చేసుకుని ప్రజల పక్షానికి తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాం.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో సంబంధాలు

గత సంవత్సరం చివర్లో తన జీవిత సహచరిని, మరికొందరిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుండే సోను దేవేంద్ర ఫడ్నవీస్ తో, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాల్లో ఉన్నాడని ఈ మధ్యకాలపు పరిణామాల ద్వారా అర్థమవుతున్నది. ఇలా విప్లవ పార్టీలో ఉంటూనే శత్రువుతో సంబంధాలు కొనసాగించడం అంటే విప్లవ ద్రోహిగా (రెనగేడ్ గా), కోవర్టుగా మారడమని అర్థం. అలాంటి విప్లవ ద్రోహికి, కోవర్టుకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననడానికి నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాం.

లొంగుబాట్లతో శాశ్వత ఓటమికి గురికాదు

సోను, ఆయన అనుచరులు 61 మంది పోలీసులకు లొంగిపోవడం విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టమే. ప్రస్తుతం సోను, ఆయన అనుచరులు లొంగిపోయినా, ఆయన తప్పుడు వాదనలతో ప్రభావితులయి, ప్రాణత్యాగానికి సిద్ధంగాలేని మరికొంతమంది వివిధ స్థాయిల పార్టీకమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులు లొంగిపోయినా ఇవి తాత్కాలిక నష్టాలే. ఈ నష్టాల ప్రభావం సాపేక్షికంగా దీర్ఘకాలం ఉండవచ్చు. అయితే సోను లొంగిపోయిన, వివిధ స్థాయిల పార్టీ నాయకులు, పీ.ఎల్.జీ.ఏ. కమాండర్లు లొంగిపోయినా విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. కొందరు పార్టీ నాయకుల, కొందరు ప్రజాసైన్యం కమాండర్ల లొంగుబాట్లతో విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. సమాజంలో వర్గాలు ఏర్పడినప్పటినుండి వేల ఏండ్లుగా దోపిడీ, పీడక వర్గాలకు వ్యతిరేకంగా దోపిడీకి గురయ్యే వర్గాలు, పీడిత వర్గాలు వర్గపోరాటాలు చేస్తూనే వున్నాయి. ఈ వర్గపోరాటాల ఫలితంగానే సమాజం నేటిస్థితికి చేరుకుంది. ఈ వర్గపోరాటాల చరిత్ర క్రమమంతటా అనేక దేశాల్లో విప్లవవోద్యమాల్లో వాటి నాయకులు, యుద్ధ కమాండర్లు కొంతమంది లొంగిపోయి ద్రోహానికి పాల్పడ్డప్పటికీ, వాటి ఫలితంగా ఆయా విప్లవోద్యమాలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఓటములు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని దేశాల్లో విప్లవోద్యమాలు గెలుపొందాయి కూడా. ప్రపంచంలో విజయవంతమైన విప్లవోద్యమాలే కాదు, ఓడిపోయిన విప్లవోద్యమాలు కూడా పీడిత వర్గాలకు ప్రేరణగానే ఉంటూ వచ్చాయి. స్పార్టకస్ నాయకత్వంలో సాగిన బానిసల తిరుగుబాటు ఓడిపోయిన అది ఈనాటికి ప్రపంచవ్యాప్త ప్రజాపోరాటాలకు ప్రేరణగానే ఉంది, పారిస్ కమ్యూన్ ఓడిపోయినా ఆ ఓటమిని సమీక్షించి గుణపాఠాలు తీసుకుని రష్యా సోషలిస్టు విప్లవం విజయవంతమవడమే కాకుండా ఆ పోరాటం ఇప్పటికీ ప్రపంచ కార్మికవర్గానికి, పీడితులకు ప్రేరణగానే ఉంది. భగత్ సింగ్ తన జీవితకాలంలో తను స్థాపించిన పార్టీ ద్వారా దేశ స్వాతంత్ర్యాన్ని సాధించకపోయినా ఆయన అమరత్వం ఈ నాటికి దేశ ప్రజలందరికీ ప్రేరణగానే ఉంది. పోరాడి ఓడిపోయిన ప్రజలు, ప్రజా నాయకులు, పార్టీలు పోరాటాల పునర్నిర్మాణానికి, పురోగమనానికి ప్రేరణనందిస్తే, పోరాడకుండా శత్రువుకు లొంగిపోయిన ప్రజలు, ప్రజా నాయకులు, పార్టీలు నిరాశను, అవిశ్వాసాన్ని కలిగించి కాలగర్భంలో కలిసిపోతూ వచ్చాయి. ఎందుకంటే లొంగుబాట్లు ఎప్పటికీ ప్రజా పోరాటాల, విప్లవోద్యమాల, ప్రజాయుద్ధ పునర్నిర్మాణానికి, పురోగమనానికి ప్రేరణను అందించలేవు. అందుకే శత్రువుకు లొంగిపోయిన విప్లవ ద్రోహానికి పాల్పడిన సోను విప్లవోద్యమాన్ని నూతన పంథాలో నిర్మిస్తాననడం బూటకం.విప్లవోద్యమ నాయకులు శత్రువుకు లొంగిపోయినా, శత్రువుకు ఆయుధాలు అప్పగించినా ప్రజలు తిరిగి విప్లవిస్తారనడానికి ఇటీవలి నేపాల్ పరిణామాలే నిదర్శనం. ప్రచండ-బట్టారాయ్ ముఠా ఆ దేశ ప్రజావిముక్తి సైన్యానికి చెందిన మొత్తం ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి ద్రోహానికి పాల్పడినప్పటికీ దాదాపుగా 20 ఏళ్ల తర్వాత నిజాయితీ కలిగిన విప్లవశక్తులు రెవెల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నెపాల్ (ఆర్.సీ.పీ.ఎన్.)గా ఏర్పడడమే కాదు, ఇటీవలి నేపాల్ ప్రజా తిరుగుబాటులో పాల్గొని శత్రు ఆయుధగారాల నుండి కొన్ని ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.

ద్రోహాన్ని అంచనా వేయడంలో విఫలం

ఈ విప్లవద్రోహంలో సోనుతో భాగస్వామిగా ఉన్న డీకే ఎస్.జెడ్.సీ. ఉత్తర సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జి సతీష్, ముగ్గురు ఎస్.జెడ్.సీ.ఎంలు సంతూ, భాస్కర్ (రాజ్ మన్), రనీతలు 150 మందితో కలిసి, ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి లొంగిపోయారనే వార్త వచ్చింది. ఈ నలుగురు ఎస్.జెడ్.సీ.ఎంలు సోనులాగే పార్టీని చీలదీసి పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్చిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారిపోయారు. సతీష్ గత కొద్ది నెలలుగా పోలీసు ఉన్నతాధికారులతో, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసు మంత్రితో సంబంధాల్లో వుంటూ కోవర్టుగా వ్యవహరించినట్టుగా ఈ మధ్యకాలపు పరిణామాల ద్వారా అర్థమవుతోంది. సోను, సతీష్ ల్లో దశాబ్దకాలం నుండి కొనసాగుతున్న మితవాద భావాలు క్రమంగా మితవాదంగా మారి, కగార్ యుద్ధంతో అది మితవాద అవకాశవాదంగా మారి ఇపుడు అది విప్లవ ద్రోహంగా, విప్లవ ప్రతిఘాతక స్థాయికి చేరింది. ఈ పరిణామాన్ని సకాలంలో సరిగా అంచనా వేయడంలో మేము విఫలమయ్యాం. ఈ వైఫల్యత ఫలితంగా వాళ్లిద్దరు తమ నాయకత్వ స్థానాలను ఉపయోగించుకుని విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం కలిగించారు. ఈ వైఫల్యాన్ని మేము సమీక్షించుకుని తగిన గుణపాఠాలు తీసుకుంటామని విప్లవ శిబిరానికి తెలియజేస్తున్నాం.

సోనూ పునర్నిర్మాణం బూటకం

విప్లవానికి ద్రోహులుగా మారిన సోను, సతీష్ ల ముఠా సరైన మార్గంలో విప్లవోద్యమాన్ని పునర్నిర్మిస్తామనడం బూటకం. వాళ్లు కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నియంత్రణలో ఉంటూ చేసే ప్రజా పోరాటాలు, నిర్మించే విప్లవోద్యమం ప్రభుత్వ ప్రాయోజిత ప్రజా పోరాటాలుగా, విప్లవోద్యమంగానే ఉంటాయి. అందుకే ఈ విప్లవ ద్రోహులు ప్రజాపోరాటాల పేరుతో ప్రజల వద్దకు వస్తే వారిని తన్ని తరమాల్సిందిగా పిలుపునిస్తున్నాం. సోను, సతీష్ ల విప్లవ ద్రోహాన్ని ఇప్పటికయినా, ఇక ముందయినా అర్థం చేసుకుని ప్రజాపక్షానికి తిరిగి రావాల్సిందిగా ఆ ముఠాలోని పార్టీ సభ్యులకు, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి వారికి పార్టీ నుండి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీనిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి పార్టీని చీలదీసే విప్లవ ప్రతిఘాతక కార్యకలాపాలను ఇకనయినా ఆపివేయాలని సోను, సతీష్ లను హెచ్చరిస్తున్నాం.

లొంగిపోవచ్చు…ఆయుధాలు అప్పగించకూడదు

కగార్ యుద్ధ దాడులతో ప్రాణభీతి ఉన్నవారు ఎవరయినా లొంగిపోదలిస్తే లొంగిపోవచ్చు కానీ పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించకూడదని కోరుతున్నాం. అది విప్లవ ద్రోహమే కాకుండా విప్లవ ప్రతిఘాతకత అవుతుంది. విప్లవ ప్రతిఘాతకులను విప్లవ ప్రజలు శిక్షించక తప్పదు.

పరిస్థితులను విశ్లేషించుకుని ముందుకు సాగుదాం

‘భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు-మన రాజకీయ కార్యక్రమం’, ‘భారతదేశంలో కులసమస్య-మన దృక్పథం’,’భారతదేశంలో జాతుల సమస్య-మన పార్టీ వైఖరి’, ‘భారతదేశంలో దళారీ నిరంకుశ బూర్జువా వర్గంపై పార్టీ వైఖరి-రాజకీయ కార్యక్రమం’ డాక్యుమెంట్లను మరింతగా సంశ్లేషించి మారిన సామాజిక పరిస్థితులకు, మారుతున్న విప్లవయుద్ధ స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ-సైనిక పంథా మరింతగా సంపన్నం చేసుకుని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్తు దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. విప్లవోద్యమంలో వెనకంజలు, ఓటములు తాత్కాలికమే. సోను, సతీష్ ముఠా ద్వారా సృష్టించబడ్డ ఈ స్థితిని పార్టీలో ఏర్పడిన సంక్షోభంగా గుర్తించి ఈ సంక్షోభాన్ని అధిగమిద్దాం. ప్రస్తుతం మన స్వీయాత్మక శక్తులు నష్టపోయి, బలహీనపడ్డ స్థితిని అంగీకరిస్తూ, మన విప్లవోద్యమంపై శత్రువు ఆధిక్యత సంపాదించిన స్థితిని గమనంలో ఉంచుకుని పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, ఐక్య సంఘటనను మొత్తంగా విప్లవోద్యమాన్ని కాపాడుకుంటూ దేశవ్యాప్త విప్లవోద్యమ పునర్నిర్మాణానికి పూనుకుందాం. సోను, సతీష్ లు శత్రువుకు సరెండరయినా రేపు మరొకరు సరెండరయినా మనపార్టీ శత్రువుకు సరెండర్ కాదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం. వర్గాలున్నంతకాలం వర్గపోరాటాలు-వాటి ఉన్నత రూపాలుగా ప్రజాయుద్ధాలు కొనసాగడం తిరుగులేని చారిత్రక నియమం. ఈ నియమాన్ని లొంగుబాట్లు మార్చలేవు. కాబట్టి తాత్కాలిక వెనకంజలో సైతం విప్లవో పురోగమనం కోసం కృషి చేయడానికి గొప్ప ఆత్మవిశ్వాసంతో, ధైర్యసాహసాలతో ముందుకుసాగుదాం. అంతిమ విజయం ప్రజలదే’ అంటూ అభయ్ పేరుతో విడుదలైన ఈ ప్రకటనలో కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.