Maoist: రణ క్షేత్రం దండకారణ్యం.. శాంతి చర్చల కేంద్రం తెలంగాణ!

విధాత: చత్తీస్ గఢ్ సహా ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ పరిధిలోని దండకారణ్యం(అబూజ్ మడ్) అటవీ ప్రాంతాల పరిధిలో కొనసాగుతున్న మావోయిస్టుల ఏరివేత అపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీ విప్లవోద్యమానికి సవాల్ గా మారింది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ ను సాధిస్తామని హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేస్తున్నారు. దీనికి నిదర్శనమన్నట్లుగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర భద్రత బలగాలు చత్తీస్ గఢ్ సహా సరిహద్దుల రాష్ట్రాల పరిధిలోని దండకారణ్యంలో మావోయిస్టులను దాదాపుగా దిగ్భంధం చేశారు. సుమారు 4వేలకు పైగా సాయుధ భద్రతా బలగాలు మావోయిస్టు నేతల స్థావరంగా పిలిచే దండకారణ్యాన్ని చుట్టుముట్టారు. అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు..డ్రోన్లతో వరుస ఎన్ కౌంటర్లు చేస్తూ దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్న భద్రతా దళాలు మావోయిస్టు అగ్రనేతలు దాగిఉన్న ప్రాంతాలవైపు దూసుకెలుతున్నాయి. ప్రతి 3నుంచి 5కిలోమీటర్ల ఒక మిలటరీ క్యాంపులను ఏర్పాటు చేశారు. స్థానిక ఆదివాసి యువకులను సాయుధ భద్రతా దళాల్లో చేర్చుకోవడం ద్వారా స్థానికంగా పట్టు సాధించి కీకారణ్యంలోకి ముందడుగు వేశారు. గడిచిన రెండేళ్ల నుంచి ఏకంగా 400మందికి పైగా సాయుధ మావోయిస్టులను, మిలిటెంట్లను ఎన్ కౌంటర్లలో హతమార్చారు. గత ఏడాది 287మంది వరకు మృతి చెందారు. ఈ ఏడాది మూడు నెలల్లోనే 135మంది హతమయ్యారు. రెండేళ్లలో 1000మందికి పైగా లొంగిపోయారు. ఏడాది కాలంలోనే మావోయిస్టుల సంఖ్య వెయ్యికిపైగా తగ్గిపోయింది. ప్రస్తుతం వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది. చత్తీస్ గఢ్ లోని బీజాపూర్, సుక్మా, బస్తర్ ఎజన్సీ, కాంకేర్ జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు జోరుగా సాగుతున్నాయి.
తెరపైకి శాంతిచర్చల ప్రతిపాదన
మావోయిస్టుల పెట్టని కోటగా..అగ్రనేతలతో పాటు కేంద్ర..రాష్ట్రాల కమిటీల స్థావరంగా ఉన్న దండకారణ్యాన్ని భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ తో దిగ్భంధించి..ఇప్పటికే వందలాది మందిని మట్టుపెట్టాయి. ఇంతకాలం ఏ అడవులైతే మావోయిస్టులు బలంగా ఉన్నాయో..వారికి సేఫ్ జోన్ గా ఉన్నాయో.. అదే అబూజ్ మాడ్ దండకారణ్యం అడవుల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తూ భద్రతా బలగాలు మావోయిస్టుల చుట్టు పద్మవ్యూహాన్ని అమలు చేశాయి. ఛత్తీస్ గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్ఫీఎఫ్, కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, తెలంగాణ గ్రేహౌండ్స్ సహా అన్ని బలగాలు జాయింట్ ఆపరేషన్స్ తో అత్యాధునిక సాంకేతికత వినియోగంతో అడవులను జల్లెడపడుతున్నాయి. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేసి దండకారణ్యంలో సాయుధ భద్రతా బలగాలు చొచ్చుకెలుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లు.. లొంగుబాట్లతో అల్లాడిపోతున్న మావోయిస్టు పార్టీ ముందెన్నడు లేనంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోంటుంది. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో వెలువడిన శాంతి చర్చల ప్రతిపాదన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఇప్పుడే ఎందుకు చర్చల ప్రతిపాదనను ఆకస్మాత్తుగా తెరపైకి తెచ్చారు..దీని వెనుక వారి చిత్తశుద్ధి వ్యూహాలు ఏమిటన్నదానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. చిత్రంగా ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన శాంతిచర్చల ప్రతిపాదన మావోయిస్టు పార్టీ నుంచి వెలువడటమే కాకుండా కాల్పుల విరమణ ప్రతిపాదన కూడా చేశారు. దీంతో శాంతిచర్చల ప్రతిపాదన వెనుక మావోయిస్టుల వ్యూహాలు ఏమిటీ..ప్రభుత్వాలు శాంతిచర్చలకు అంగీకరిస్తాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ కేంద్రంగా ప్రతిపాదనలా..!?
మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన శాంతిచర్చల ప్రతిపాదనకు ప్రేరణ తెలంగాణలోని హైదరాబాద్ లో మార్చి 24న నిర్వహించిన శాంతిచర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశమని పేర్కొనడం ఆసక్తి రేపింది. మావోయిస్టులు, పౌరసంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ 2002, 2004లో హైదరాబాద్ వేదికగా శాంతిచర్చలకు చొరవ తీసుకోవడం గమనార్హం. అయితే అప్పట్లో మావోయిస్టు పార్టీ కార్యకలపాలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఉండేవి. ప్రస్తుతం వారి ఉనికి కేవలం దండకారణ్యం సరిహద్దు జిల్లా ఉమ్మడి వరంగల్ వంటి వాటికే పరిమితమైంది. రాష్ట్రంలో పెద్దగా మావోయిస్టుల కార్యకలాపాలు లేనప్పటికి దండకారణ్యం పరిధిలో సాగుతున్న మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్న యుద్ధాన్ని నివారించేందుకు హైదరాబాద్ నుంచి శాంతిచర్చల చొరవ..ప్రతిపాదనలు వెలువడటం కొంత ఆశ్చర్యకమైనప్పటికి స్వాగతించదగినదే. 2023డిసెంబర్ లో చత్తీస్ గఢ్ బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించడం..దండకారణ్య కమిటీ సానుకూలత వ్యక్తం చేయడం జరిగినా..ఆపరేషన్ కగార్ కొనసాగింపుతో చర్చల ప్రక్రియ తెరమరుగైంది.
54సంఘాలతో చర్చల కమిటీ
మావోయిస్టులు, ఆదివాసీల సంహారాన్ని ఆపాలని, శాంతి చర్చలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరడంతో దేశవ్యాప్తంగా ఉన్న 54 సంఘాలతో హైదరాబాద్ కేంద్రంగా శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. చర్చలకు ఛత్తీస్‌గఢ్ సర్కారు సానుకూలంగా స్పందించడాన్ని కమిటీ సభ్యులు అభినందించారు. కేంద్రం కూడా చర్చలకు ముందడుగు వేయాలని కోరారు. కేంద్రం చొరవ తీసుకుంటే సమస్య తప్పకుండా పరిష్కారమవుతుందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు పేర్కొన్నారు.
అందుకేనా చర్చల ప్రతిపాదన
దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు నాయకత్వం అంతా కూడా దండకారణ్యం..అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలోనే ఉంటూ ఇక్కడి నుంచే దేశంలో తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని పాతతరంతో పాటు కేంద్ర పార్టీ మావోయిస్టు నాయకత్వం కూడా ఇదే ప్రాంతంలోని ఉంది. మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ సహా ఇతర కమిటీలన్ని చత్తీస్ గఢ్ దండకారణ్యం కేంద్రంగా పనిచేస్తుండటం..పీఎల్ జీఏ దళాలు కూడా అక్కడే ఉండటంతో భద్రత బలగాల భారీ అపరేషన్ మావోయిస్టులకు సంకటంగా మారింది. తెలంగాణ మావోయిస్టుల కమిటీలు కూడా అక్కడే ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం వారికి చేరువగా భద్రతా బలగాలు ముందుకెలుతున్నాయి. అత్యాధునిక ఆయుధాలతో దూసుకొస్తున్న భద్రతాబలగాలను ఎదురించడం కష్టసాధ్యంగా మారడం..స్థావరాలను మార్చి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దారులను కూడా భద్రతా దళాలు మూసివేయడంతో మావోయిస్టులు ఆత్మరక్షణ వ్యూహంలో పడ్డారు. అటు తమ ఆచూకీ కోసం ఆదివాసీలను భద్రతా దళాలు బలి చేస్తుండం కూడా మావోయిస్టులను ఆలోచింప చేసింది. పెరిగిన నిర్భంధంతో తమతో పాటు తాము ఏ ప్రజల కోసం పోరాడుతున్నామో వారికి ప్రాణనష్టం వాటిల్లుతుండటంతో శాంతిచర్చల ప్రతిపాదనకు ఇది సమయమని మావోయిస్టు పార్టీ భావించిందని విశ్లేషిస్తున్నారు. అయితే భద్రతాదళాలు చుట్టుముట్టిన నేపథ్యంలో మిగిలిన కేడర్ ను రక్షించుకునేందుకు..శాంతి చర్చల సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే ఆలోచనలతోనే వ్యూహాత్మకంగా మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన చేశారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.
పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
మావోయిస్టులు చేసిన శాంతిచర్యల ప్రతిపాదనను కేంద్రంతో పాటు చత్తీస్ గఢ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకున్న తరుణంలో శాంతిచర్చలతో పెద్ధగా లాభముండదని..అదిగాక చర్చల మాటున మావోయిస్టుల సేఫ్ గేమ్ ప్లాన్ ఉందని అనుమానిస్తుంది. అదిగాక కాల్పుల విరమణ..శాంతి చర్చల ప్రతిపాదనకు మావోయిస్టు పార్టీ భద్రతా బలగాలను ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని. కొత్త క్యాంపులు పెట్టరాదని..చర్చల సమయంలో క్యాంపులకే పరిమితం కావాలంటూ షరతు పెట్టింది. దీనికి భద్రతా బలగాలు సిద్ధంగా లేవని తెలుస్తుంది. ఆపరేషన్ కగార్ ఆఖరి దశలో ఉందని..మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్న అబూజ్ మడ్ స్థావరాలపై దాడుల సమయంలో చర్చలు అనవసరమని భావిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ చర్చలకు వెళితే అగ్రనేతలు లొంగిపోవాలన్న షరతు పెట్టాలని కగార్ ఆపరేషన్ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండువైపుల పీటముడులు దాటుకుని శాంతిచర్చలు కార్యరూపం దాల్చడం సందేహంగానే కనిపిస్తుంది.
అపరేషన్ కగార్ ఉచ్చులో తెలుగు మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ ఉచ్చులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల వారు ముఖ్యంగా తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలు కూడా ఉన్నారు. చత్తీస్ గఢ్ దండకారణ్యంలో పెరిగిన నిర్భంధంతో కొంతమంది తెలంగాణలోకి ప్రవేశించే క్రమంలో ఏడాది కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. 26మంది వరకు ఏపీ మన్యం జిల్లాల్లో ప్రవేశించినట్లుగా ఇటీవల ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. రాష్ట్రానికి చెందిన 90 మంది కేంద్ర కమిటీతో పాటు అనేక కీలక కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతానికి వీరు సురక్షితమైన ప్రాంతాల్లో, ఉన్నట్లు తెలుస్తుంది. మావోయిస్టు కేంద్ర కమిటీలోని 13 మంది సభ్యుల్లో 11 మంది తెలుగువారే ఉన్నారు. వీరిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు, సుధాకర్‌లు ఏపీకి చెందిన వారు. మిగతా 9 మంది కూడా తెలంగాణ వారే కావటం గమనార్హం. అనేక రాష్ట్ర కమిటీలకు కూడా తెలుగు రాష్ట్రాల మావోయిస్తు నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం.