Mattaiah Comments On Vote For Note Case | ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య సంచలన వ్యాఖ్యలు

ఓటుకు నోటు కేసులో మత్తయ్య సంచలన వ్యాఖ్యలు, రేవంత్, చంద్రబాబు, లోకేష్ నిందితులుగా పేర్కొని సుప్రీంకోర్టు దర్యాప్తు డిమాండ్.

Mattaiah Comments On Vote For Note Case | ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య సంచలన వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించిన టీడీపీ, అందుకు పరోక్షంగా సహకరించిన కాంగ్రెస్ పార్టీ రెండు కూడా శిక్షార్హమైనవేనని.. ఆ రెండు పార్టీల ప్రభుత్వాలను తక్షణమే రద్దు చేసి, ఆ పార్టీలను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని ఈ కేసులోని ఏ 4 నిందితుడు జెరూసలేం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు విషయంలో తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసిన మత్తయ్య గురువారం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీని కూల్చడానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఓటుకు నోటు కేసుతో భారీ కుట్ర చేశారని మత్తయ్య ఆరోపించారు. అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలవడానికి ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే, వీరికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు.

రేవంత్ రెడ్డి ఆత్మహత్య బెదిరింపుతోనే లొంగిపోలేదు

ఓటుకు నోటు కేసులో అప్పటికే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారని..నేను సరెండర్ అయితే ఆయనను టీడీపీ పార్టీలో నుండి సస్పెండ్ చేస్తారని.. అప్పుడు తన రాజకీయ జీవితం సమాప్తం అవుతుందని రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని…ఆయన భార్య గీతా రెడ్డి నాకు ఫోన్ చేసింది అని సంచలన విషయాలు బయటపెట్టాడు. రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో..తన ప్రాణం ఎందుకు తీయాలని నేను సరెండర్ అవ్వలేదు అని స్పష్టం చేశాడు. అంతేకాదు.. ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్న చంద్రబాబు నాయుడుకు క్లీన్‌చిట్ ఇచ్చిన శివశంకర్ ఇప్పుడు తెలంగాణ పోలీస్ విజిలెన్స్ కమిషనర్‌గా ఎలా ఉన్నాడు అని ప్రశ్నించాడు. చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్‌లో పదవులు ఇవ్వాలి కానీ తెలంగాణలో పదవులు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యాడు.

నన్ను రహస్యంగా బంధించారు

ఓటుకు నోటు కేసులో నన్ను అరెస్టు చేస్తారని తెలుసుకున్న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయిపోయి, నా దగ్గరికి లోకేష్ అనుచరులు కిలారి రాజేష్, జిమ్మీ బాబులను పంపించారని..లోకేష్ టీడీపీ ఆఫీసుకి రమ్మన్నారని చెప్పి.. మల్కాజిగిరి మీదుగా తెలంగాణ పోలీసులకు దొరకకుండా నా కాళ్లు చేతులు కట్టేసి, కళ్ళకు గంతలు కట్టి, కారు డిక్కీలో విజయవాడకి తరలించారని మత్తయ్య ఆరోపించారు. భార్య పిల్లలకు, తల్లిదండ్రులకు చూపించకుండా నన్ను పలు ప్రదేశాల్లో రహస్యంగా చీకటి గదిలో బంధించి వేధించారని మత్తయ్య వాపోయాడు.

సీజేఐకి మత్తయ్య లేఖ

మత్తయ్య నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కి రాసిన లేఖలో ఓటుకు నోటు కేసులో తనతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లను, వీరికి సహకరించిన అందరిని నిందితులుగా చేర్చి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అతని సహచరులు వేం నరేందర్ రెడ్డి, వేం కీర్తన్ రెడ్డి, ఉదయ్ సింహలను అధికార పదవుల నుండి తొలగించి, అరెస్ట్ చేసి విచారించాలి అని కోరాడు. 2016లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు టీడీపీ మహానాడుకు తనని పిలిచి ఓటుకు నోటు గురించి వివరించి చెప్పారు అని లేఖలో ప్రస్తావించాడు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు సూత్రధారి అని.. నన్ను స్టీఫెన్సన్ దగ్గరికి రేవంత్ రెడ్డినే పంపాడని.. స్టీఫెన్సన్ కు రూ.5 కోట్లు ఆశ చూపాలని రేవంత్ చెప్పాడని మత్తయ్య లేఖలో పేర్కొన్నాడు.

కేసు నుంచి చంద్రబాబు పేరు తొలగించుకోవడం కోసం నా చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారని.. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ టాపింగ్ చేశారని నా చేత బలవంతపు వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు. నన్ను ఏడు నెలల అజ్ఞాతంలో ఉంచారని..నేను అప్పటినుంచి కొట్లాడుతూనే ఉన్నానన్నారు. సుప్రీంకోర్టులో కూడా నా పిటిషన్ విచారణకు రాకుండా చంద్రబాబు ఆయన మనుషులను పెట్టి అడ్డుకున్నారని మత్తయ్య ఆరోపించాడు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందని..చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలను రద్దుచేసి మళ్లీ ఈ కేసు దర్యాప్తు చేసేలా తీర్పు ఇవ్వండని లేఖలో కోరాడు.