Medak | ‘మన ఊరు మనబడి’ పనులు.. మే చివ‌రి వరకు పూర్తి చేయాలి: శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

Medak మండలాల వారీగా పనుల పురోగ‌తిపై సమీక్ష కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులతో సమీక్షా సమావేశం విద్యా సంక్షేమం మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధ‌ర్ రెడ్డి విధాత, మెదక్ బ్యూరో: మన ఊరు మన బడి క్రింద చేపట్టిన పనులు మే నెలాఖరునాటికి పూర్తి చేయవలసినదిగా తెలంగాణ విద్యా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జిల్లా […]

Medak | ‘మన ఊరు మనబడి’ పనులు.. మే చివ‌రి వరకు పూర్తి చేయాలి: శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

Medak

  • మండలాల వారీగా పనుల పురోగ‌తిపై సమీక్ష
  • కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులతో సమీక్షా సమావేశం
  • విద్యా సంక్షేమం మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధ‌ర్ రెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: మన ఊరు మన బడి క్రింద చేపట్టిన పనులు మే నెలాఖరునాటికి పూర్తి చేయవలసినదిగా తెలంగాణ విద్యా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, సంస్థ చీఫ్ ఇంజనీర్ అనిల్ కుమార్‌తో కలిసి మన ఊరు మనబడి క్రింద ఎంపిక చేసిన 313 పాఠశాలలో చేపట్టిన వివిధ కాంపోనెంట్ పనుల ప్రగతిని మండల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా దశాబ్దాలుగా మరమ్మతులకు, మౌలిక వసతుల కల్పనకు నోచుకోని పాఠశాలలను మెరుగుపరచి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది పేదపిల్లలకు చదువు అందించాలని మహాసంకల్పతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా గత జూన్ మాసంలో కొన్ని పాఠ‌శాలలను ఎంపిక చేసి మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని, మీ నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తై పాఠశాలలు తెరిచే నాటికి పండుగా వాతావరణంలో విద్యార్థులు చదువుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు.

జిల్లాలో ఇప్పటి వరకు 311 పాఠశాలలో పనులకు అనుమతులు మంజూరు చేయగా అందులో పనులు 30 లక్షల లోపు కాంపోనెంట్ పనులు గల పాఠశాలలు 256 ఉన్నాయని అన్నారు. కాగా ఇంకా 25 పనులకు ఇంకా మొదలు కాలేదని, వెంటనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఒప్పించి ప్రజాప్రతినిధుల సమక్షంలో శంఖుస్థాపనలు గావించి పనులు వేగవంతం చేయాలన్నారు.

30 లక్షల నుండి కోటి రూపాయల లోపు పనులకు టెండర్లు రాని దగ్గర ఎస్.ఏం.సి. కమిటీ ఆమోదంతో నామినేషన్ పద్ధతిన పనులు చేపట్టాలన్నారు. నిధుల కొరత లేదని, మన ఊరు మన బడి క్రింద 66 కోట్ల 16 లక్షలు, ఉపాధి హామీ పధకం క్రింద 65 కోట్ల నిధులు ఉన్నాయని అన్నారు. చేసిన పనులకు వెంట వెంటనే ఏం.బి.రికార్డు చేసి ఎఫ్.టి.ఓ. లో జనరేట్ చేయాలని అధికారులకు సూచించారు.

పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి పనులు పరుగు పెట్టించే ఎందరో సీనియర్ అధికారులున్నారని, వారంతా ఛాలెంజ్ గా తీసుకొని భాద్యతతో డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, ప్రహారి గోడలు, శౌచాలయాలు వంటి సివిల్ పనులతో పాటు ఎలక్ట్రిఫికేషన్, పెయింటింగ్ వంటి పనులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలకు పెయింటింగ్ పై పరిపాలనా అనుమతుల కనుగుణంగా మే 12 లోగా అంచనా నివేదికలు అందజేయవలసినదిగా కోరారు. త్వరలో రెండవ విడత రాబోతున్నందున అధికారులు కాంట్రాక్టర్ల వెంటపడి పనులు పూర్తి చేయించాలన్నారు. పాత శౌచాలయాలను వాడుకలో వచ్చే విధంగా రేనోవేషన్ చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పధకం క్రింద చేపట్టిన కిచెన్ షెడ్స్, ప్రహారి గోడలు వంటి నిర్మాణాలు కూడా వేగవంతం చేయాలన్నారు.

అంతకుముందు చైర్మన్ శ్రీధర్ రెడ్డి తూప్రాన్ మండలంలోని పోతరాజుపల్లి, యానాపూర్, మాసాయిపేట మండలంలోని కొప్పులపల్లి, మాసాయిపేట, చేగుంట మండలంలోని చందాయ్ పెట్ లోని పాఠశాలలో జరుగుచున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి తగు సూచనలు చేశారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మే నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలో ప్రగతిలో ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. వీటిపై ఇంజనీరింగ్ అధికారులతో తరచూ సమీక్షిస్తూ ఇంజనీరింగ్ అధికారులు, నోడల్ అధికారులు, విద్యా శాఖాధికారులు ఒక బృందంగా వెళ్లి ఏ చిన్న గ్యాప్ లేకుండా పనులు సక్రమంగా, నాణ్యతతో జరిగేలా చూస్తున్నామని అన్నారు. చేస్తున్న పనులకు వెంట వెంటనే ఏం.బి. రికార్డు చేసి ఎఫ్.టి.ఓ. లో అప్ లోడ్ చేసి కలెక్టర్ లాగిన్ ద్వారా 17 కోట్ల పేమెంట్ కూడా చేశామన్నారు. 30 లక్షల నుండి కోటి లోపు పనులకు నామినేషన్ పద్ధతిన చేయుటకు చర్యలు తీసుకున్నామన్నారు.

సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, మండల విద్యాధికారులు, నోడల్ అధికారులు, పంచాయతీ రాజ్ ఈ ఈ సత్యనారాయణ రెడ్డి, నీటి పారుదల, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.