డిజైనింగ్, నిర్మాణ లోపాలే.. వాటివ‌ల్లే బ‌రాజ్ పిల్ల‌ర్‌ కుంగుబాటు

డిజైనింగ్, నిర్మాణ లోపాలే.. వాటివ‌ల్లే బ‌రాజ్ పిల్ల‌ర్‌ కుంగుబాటు
  • కేంద్ర బృందం ప్రాథమిక నిర్ధారణ?
  • బయటపెట్టని పూర్తిస్థాయి నివేదిక
  • ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ
  • ప్రతిష్ఠ‌ మసకబారుతుందనేనా?
  • కొంప ముంచిన రికార్డు స్థాయి ప‌నులు!
  • కాంక్రీట్ నింపడంలో అత్యధిక వేగం
  • నాణ్యత పర్యవేక్షణకూ అదే అడ్డంకి
  • తీవ్ర‌ ప్రమాదంలో బ‌రాజ్‌ కట్టడం!

విధాత బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ‌రాజ్‌ కుంగిపోవడం వెనుక డిజైనింగ్, నిర్మాణ లోపాలే కారణమని ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర బృందం ప్రాథమికంగా నిర్ధార‌ణ‌కు వచ్చినట్టు తెలుస్తున్న‌ది. వైఫల్యాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక బయటపెడితే, ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ‌ మసకబారనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం వెనువెంటనే నివేదిక బయట పెట్టకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే ఆదేశాలు, ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిళ్లకు లోబడి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే దీనిని పూర్తి చేసింది.

మేడిగడ్డ బ‌రాజ్‌ నిర్మాణంలో మూడు రోజుల వ్యవధిలోనే యుద్ధ ప్రాతిపదికన 25000 ఘనపు మీటర్ల కాంక్రీట్ వేయడం ద్వారా ‘అత్యధిక వేగంగా కాంక్రీట్ వేయ‌టంలో ప్రపంచ స్థాయి రికార్డ్’ నెలకొల్పగలిగారు. ఈ ఘనతను ప్రభుత్వం ప్రసారమాధ్యమాల్లో విరివిగా తమ ప్రచారానికి వాడుకుంది. ఇంత వేగంగా కాంక్రీట్ పనులు జరుగుతున్నప్పుడు నిర్మాణంలో నాణ్యతను పర్యవేక్షించడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంక్రీట్ మొత్తం ఒకేసారి వేసినందున నాణ్యత లోపాలు.. ప్రస్తుతం దెబ్బతిన్న 20వ పిల్లర్‌కు మాత్రమే పరిమితం కావని, అవి మొత్తం కట్టడంలో కనిపించే అవకాశాలున్నాయన్నది వారి వాదన.

భూ సేకరణ సైతం..

ప్రభుత్వాలు ఏదైనా ప్రాజెక్టును చేపడితే తొలుత భూసేకరణ జరిపి, స్వాధీన పరచుకున్న భూమి యజమానులకు పరిహారం చెల్లించిన తరువాతే నిర్మాణ పనులు గుత్తేదారుకు అప్పగించడం రివాజు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ విషయంలో ఈ బాధ్యతను కూడా ప్రభుత్వం నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి అప్పగించినట్లు తెలుస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో భూములకు ఎక్కువ ధర ఉండటం, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భూ సేకరణ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో, ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్న ఎల్ అండ్ టీ.. రైతుల నుండి స్వయంగా భూములు కొనుగోలు చేసి, ప్రభుత్వానికి తక్కువ రేటుకు వాటిని స్వాధీనపరిచినట్లు తెలుస్తోంది. అత్యంత వేగంగా ప్రాజెక్టు నిర్మించాలన్న ప్రభుత్వ ఆలోచనే దీనికి వెనుక కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

కుట్ర కారణం కాదా?

మేడిగడ్డ బ‌రాజ్‌ 16వ పిల్లర్ నుండి 20 వరకు కుంగిపోవడానికి ముందు భారీ శబ్ధం వినిపించిందని, దీనిని కుట్ర కారణంగా భావించి అటు మహారాష్ట్ర సరిహద్దుల్లోని సిరొంచ, ఇటు తెలంగాణ సరిహద్దులోని మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లలో ఇంజినీర్లు ఫిర్యాదు చేశారు. అయితే మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు కుట్ర కారణం కాదని, కొన్ని పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్ల, అవి కుంగిపోయాయని నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. కుంగిపోయిన పిల్లర్ల వరకు తిరిగి నిర్మాణాలు చేపడితే సరిపోతుందనీ అన్నారు. ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర ప్రతినిధి బృందం సైతం నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేదని, కానీ సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. ఈ రెండు ప్రకటనలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని డొల్లతనాన్ని బయట పెట్టేవిగా ఉన్నాయ‌ని నిపుణులు అంటున్నారు.

ఎలా కట్టారంటే..

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ప్రతిపాదిత స్థలంలో నదీగర్భంలో రాతి పొరలు ఎంత లోతులో ఉన్నాయో చూసి, అక్కడి నుండి బరాజ్‌కు పునాదులు తీయాల్సి ఉంటుంద‌ని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. కానీ మేడిగడ్డ బరాజ్ నిర్మాణ ప్రదేశంలో నదిలో రాతి పొరలు చాలా లోతుల్లో ఉండటంతో అక్కడి నుండి కాంక్రీట్ కట్టడాలు చేపట్టాలంటే తడిసి మోపెడౌతుందని భావించి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం కోసం నదిలో ఇసుకపైనే స్లాబ్ (ర్యాప్ట్) వేసి ఆ స్లాబ్ పై పిల్లర్లు నిర్మించారు. మేడిగడ్డ బరాజ్ మొత్తం ఎనిమిది బ్లాకులుగా విభజించి, ఒక్కో బ్లాకులో 10 నుండి 11 పిల్లర్లు కలిపి మొత్తం 85 పిల్లర్లు నిర్మించారు. పునాదుల కింద నుండి ఇసుక కొట్టుకుపోకుండా మొత్తం నది వెడల్పున స్లాబ్‌కు అడ్డంగా నిట్టనిలువు కాంక్రీట్ గోడ నిర్మించారు. వరద నీరు స్లాబ్ కింద నుండి వేగంగా ప్రవహించకుండా ఇది అడ్డుకుంటుంది.

ఇక్కడ జరిగింది వేరు

మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోవడమే కారణమని అధికారులు స్వయంగా చెబుతున్నారు. అంటే ప్రవాహ వేగాన్ని తట్టుకునేందుకు నది పొడవునా నిర్మించిన కాంక్రీట్ గోడ నీటి వేగాన్ని నియంత్రించ లేకపోయిందని స్పష్టమవుతోంది. బరాజ్‌కు ఒక‌ ప్రదేశంలో ఇసుక కొట్టుకుపోయిందంటే, మరోచోట కూడా భవిష్యత్తులో కొట్టుకుపోకుండా ఉంటుందన్న నమ్మకం లేదు. ఇదే జరిగితే బరాజ్‌కు సంబంధించి పిల్లర్లు కుంగడం, కూలడం, తిరిగి మరమ్మతులు చేయాల్సి రావడం నిత్య‌కృత్య‌మ‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని నిపుణులు చెబుతున్నారు.

నాణ్యతపైనా అనుమానాలు

మేడిగడ్డ బరాజ్ నిర్మాణ పనుల్లో నాణ్యతపైనా అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకచోట కేవలం పిల్లర్ కుంగిపోతే, దాని కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం వల్లేనంటూ సమర్థించుకోవచ్చు. కానీ ఇక్కడ పిల్లర్ కే నిట్ట నిలువునా ప‌గుళ్లు వచ్చాయి. అంటే ఇసుక కొట్టుకుపోవడంతో పాటు నిర్మాణ సమయంలో డిజైనింగ్, నాణ్యత లోపాలు ఉన్నట్టే అంటున్నారు.

చేయాల్సింది ఇదే

ప్రభుత్వ మానస పుత్రిక కాళేశ్వరం ప్రారంభించిన నాలుగేళ్ల వ్యవధిలోనే ప్రమాదంలో పడటంతో ఈ ప్రాజెక్టు నాణ్యతపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణానికి ముందు జరిపిన భూ పరీక్షలు, రూపొందించిన డిజైన్లతో పాటు నిర్మాణ పనులు, బరాజ్ పటిష్టతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు.