Operation Kagar | మావోయిస్టు చీఫ్ దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్ట ఆపరేషన్?
మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం విధించుకున్న మార్చి 31వ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పరిపూర్తికి ఉధృతంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ అటవీ సరిహద్దుల్లోని కర్రెగుట్టల ప్రాంతాన్ని వేల మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టారు. ఇప్పటికే ఒక భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ఆదివాసీ గూడేలు వణికిపోతున్నాయి.
- మిగిలిన మావోయిస్టులే టార్గెట్‌గా ఆపరేషన్ కగార్ ఉధృతం
- కర్రెగుట్టను చుట్టుముట్టిన ఐదువేల మంది సాయుధ బలగాలు
- భారీ ఎన్ కౌంటర్, ఐదుగురు మావోయిస్టుల మృతి?
- మావోయిస్టు నేతలు దామోదర్, పాపారావు మకాం ఇదే?
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Operation Kagar | మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి టార్గెట్‌గా కర్రెగుట్టల్లో మరోసారి వేల మంది సాయుధ బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దాదాపు ఐదువేల మంది భద్రతబలగాలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్జీ బృందాలు కర్రెగుట్టలను ఆధునిక ఆయుధాలు, పరికరాలతో చుట్టుముట్టారని తెలుస్తున్నది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అటవీ సరిహద్దులో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టు ముఖ్యనేతలు మకాం వేశారనే సమాచారం మేరకు వారిని మట్టుబెట్టడమే లక్ష్యంగా ఆదివాసీ గూడాలను, కర్రెగుట్టలను వేలాది మంది సాయుధ బలగాలు చుట్టివేసి బుధవారం సాయంత్రం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నదని సమాచారం.
మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్ జీతో పాటు పాపారావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కర్రెగుట్టల్లో మకాం వేశారనే వార్తలు వెలువడుతున్నాయి. గత వారం రోజుల నుంచి దామోదర్ ఆధ్వర్యంలో కొందరు మావోయిస్టు నేతలు మంథని, మేడారం చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో సరిహద్ధుల్లోని కర్రెగుట్టలపై భద్రతబలగాలు విరుచుకుపడడమే కాకుండా ఇప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ముఖ్యనేతలు ఇప్పటికే అక్కడి నుంచి తప్పించుకున్నట్లు ఒక వార్త ప్రచారం సాగుతుండగా, ఈ నేతలు కర్రెగుట్టల్లో లేరనే ప్రచారం మరోవైపు సాగుతోంది. ఏది ఏమైనా ముఖ్యనాయకులున్నారనే కారణంగానే భారీ ఎత్తున సాయుధ బలగాలను మోహరించి దాడికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టులను పూర్తిగా మట్టుబెట్టే వరకు కర్రెగుట్టల్లో ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధమై భారీగా బలగాలను మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే కర్రెగుట్టల్లో భద్రతాబలగాల క్యాంపు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులను పూర్తిగా తుడిచివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కగార్ ఆపరేషన్ లో భాగంగా 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులను పూర్తిగా తుడిచివేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే పలు పర్యయాలు ప్రకటించారు. ఈ డెడ్ లైన్ దగ్గరపడుతున్నందున ఇంకా మిగిలిన ఉన్న మావోయిస్టు ప్రధాన నేతలే లక్ష్యంగా ఈ కర్రెగుట్టల ఆపరేషన్ తో పాటు కగార్ ఆపరేషన్ ను తీవ్రతరం చేసినట్లు భావిస్తున్నారు. ఈ గడువుకు మరో 40 రోజులు మాత్రమే ఉన్నందున అన్నివైపులా ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు చర్చసాగుతోంది. కగార్ ఆపరేషన్ లో బాగంగా ఆపరేషన్ కర్రెగుట్టల్లో కూంబింగ్ తో చుట్టూ ఉన్న ఆదివాసీ గూడేలు బిక్కుబిక్కుమంటున్నాయి.

గత ఏడాది ఏప్రిల్ లో కర్రెగుట్టలపై దాడి
గత ఏడాది ఏప్రిల్ 22 వతేదీ నుంచి 21 రోజుల పాటు ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్టలను వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి నిర్వహించిన కూంబింగులో ఆధునిక యుద్దపరికరాలు, హెలికాప్టర్లను వినియోగించి నిర్వహించిన సామూహిక దాడిలో ఇరువర్గాలకు మధ్య పలుమార్లు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. వాటిల్లో 18 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా 16 రోజుల పాటు భద్రతబలగాలు, మావోయిస్టులకు మధ్య అనేక పర్యాయాలు ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు నేత హిడ్మా లక్ష్యంగా మొదటి సారి కర్రెగుట్టల ఆపరేషన్ జరిగినట్లు చర్చ జరిగింది. రెండవ దఫా జరుగుతున్న ఈ ఆపరేషన్ మాత్రం దేవ్ జీతో పాటు దామోదర్ లక్ష్యంగా చెబుతున్నారు.
గతంలో ఏపీలో దేవ్ జీ సెక్యూరిటీ సభ్యుల అరెస్టు
గత ఏడాది నవంబర్ 18న మావోయిస్టు పార్టీ నేత, పీఎల్జీఎ మొదటి బెటాలియన్ కమాండర్ హిడ్మా, ఆయన భార్య హేమ, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ నాయకుడితోపాటు ఆరుగురు మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా అప్పట్లో ప్రకటించారు. అదే విధంగా ఏపీలోని ఐదు జిల్లాల్లో మావోయిస్టుల కోసం వేట నిర్వహించామని, ఇందులో విజయవాడ ఆటోనగర్, కాకినాడ, ఏలూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడిచేసి 31 మందిని అరెస్టు చేసినట్లు, వారి నుంచి డంప్ లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అరెస్టైన వారిలో 9 మంది మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ దేవ్‌జీ సెక్యూరిటీ టీం మెంబర్లు ఉన్నారని చెప్పారు. మిగిలిన వారంతా హిడ్మా టీమ్ మెంబర్లుగా వివరించారు. ఆ తర్వాత దేవ్ జీ గురించి పూర్తి సమాచారం బయటికి తెలియనప్పటికీ పార్టీకి చెందిన అనేక మంది పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ నాయకులు ఎన్ కౌంటర్ లో చనిపోతున్నారు. కొందరు లొంగిపోతున్నారు. అయినప్పటికీ దేవ్ జీ జాడ మాత్రం తెలియడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి దేవ్ జీ కర్రెగుట్టల్లో మకాం వేశారని, ఆయన వెంట దామోదర్, పాపారావుతో పాటు ముఖ్యనేతలున్నారనే సమాచారంతో ఎప్పుడేం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram