Minister Adluri Laxman | బీఆర్ఎస్‌వి చిల్లర రాజకీయాలు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు
గత ప్రభుత్వ హయాంలో విద్య, సంక్షేమం రెండూ వ్యవస్థలు భ్రష్టు పట్టాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.

- బీఆర్ఎస్‌వి చిల్లర రాజకీయాలు
- విద్య, సంక్షేమాన్ని భ్రష్టు పట్టించారు
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు
విధాత, హైదరాబాద్ : గత ప్రభుత్వ హయాంలో విద్య, సంక్షేమం రెండూ వ్యవస్థలు భ్రష్టు పట్టాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.
మేమే రాజులం, మేమే మంత్రులం అంటూ దశాబ్దం పాటు వారు ఈ రెండు శాఖలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌లో 62,334 మంది, డిగ్రీలో 8,710 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వెల్లడించారు.
విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతో ప్రభుత్వానికి అదనంగా రూ.46,438.84 లక్షలు భారం పడుతుందన్నారు. సంక్షేమంపై ఎంత భారం పడ్డ ఆ కుటుంబాలకు భరోసా, అండగా నిలిచేది తమ ప్రభుత్వమేనని అన్నారు.
కానీ బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలతో విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అడ్లూరి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బాచుపల్లి, గొల్లపల్లి (జగిత్యాల) ప్రాంతాల్లో కొత్త భవనాల నిర్మాణం ప్రారంభమైందన్నారు.
విద్యార్థుల భోజనం, వసతి, పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గత ప్రభుత్వ పాలనలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆహారం నాణ్యతలేమిపై రాత్రంతా మెస్‌లో జాగారం చేశారు. అప్పుడు ఒక్క మంత్రి కూడా అక్కడకు వెళ్లలేదు.
ఇప్పుడు మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మంత్రి వ్యాఖ్యానించారు. 2022లో జరిగిన ఆందోళనల్లో విద్యార్థులు అన్నం తినకుండా నిరసన వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
‘2024 సివిల్స్ ప్రిలిమ్స్‌లో 24 మంది, మెయిన్స్‌లో 3 మంది సెలెక్ట్ అయ్యారు. 2025లో 26 మంది విద్యార్థులు సివిల్స్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ప్రిలిమినరీలో 5 మంది విద్యార్థులు విజయం సాధించారు.
గ్రూప్–1 (2024–25) లో 33 మంది, గ్రూప్–4లో 145 మంది, DSC లో 123 మంది, మొత్తం 186 మంది రాష్ట్ర–కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారని మంత్రి అడ్లూరి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో గురుకులాల్లో అత్యవసర ఇబ్బందుల పరిష్కారం కోసం రూ.60 కోట్లు అత్యవసర నిధులు విడుదల చేశారన్నారు.
ఈ నిధులతో హాస్టళ్లలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలకు కలిపి నిధులు కేటాయించడం సీఎం విద్యార్థుల సంక్షేమంపై ఉన్న అంకితభావానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.