Jupalli Krishna Rao | అంతా మంచే జరుగుతుంది..బండ్లను బుజ్జగించిన మంత్రి జూపల్లి
కాంగ్రెస్ పార్టీపై అలకబూనిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు బుజ్జగించారు. గురువారం ఉదయం గద్వాలలోని కృష్ణ మోహన్ రెడ్డి ఇంటికి జూపల్లి వెళ్లి కలిశారు.

ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అల్పాహారం
సరితకు ఇచ్చిన ప్రాధాన్యం నాకేది?
నియోజకవర్గ అభివృద్ధిపై హామీ లేదు
జూపల్లికి ఎమ్మెల్యే బండ్ల ఫిర్యాదు
గద్వాల అభివృద్ధికి సీఎం కృషి చేస్తారు
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి
నచ్చజెప్పిన మంత్రి జూపల్లి కృష్ణారావు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీపై అలకబూనిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు బుజ్జగించారు. గురువారం ఉదయం గద్వాలలోని కృష్ణ మోహన్ రెడ్డి ఇంటికి జూపల్లి వెళ్లి కలిశారు. ఆయనతో పాటు మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే గౌని మధుసూదన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. జూలై 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి అదే నెల 30న అసెంబ్లీ వద్ద కేటీఆర్ను కలవడంతో కాంగ్రెస్లో కలవరం మొదలైంది. నెల రోజులు తిరగకముందే మళ్ళీ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి మాట ముచ్చట పెట్టడంతో కృష్ణ మోహన్ రెడ్డి సొంత గూటికి వెళతారనే వార్తలు వెలువడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన విషయం పలువురు మీడియా ప్రతినిధులు అడగడంతో తాను వేసుకున్నది పార్టీ కండువా కాదని, దేవాలయానికి సంబంధించిన కండువా అని బండ్ల సర్దిచెప్పారు. ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్లో ఇమడలేక మళ్ళీ సొంత పార్టీలోకి వచ్చారని కేటీఆర్ కూడా ప్రకటించారు. కాంగ్రెస్లోకి వెళ్లిన వారంతా తిరిగి వస్తున్నారని కేటీఆర్ ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. బీఆరెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన భాద్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని, వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆయా శాఖల మంత్రులకు సూచించారని సమాచారం. సీఎం సూచన మేరకు గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కలిశారు.
పార్టీలో నాకు ప్రాధాన్యం ఏది?
కాంగ్రెస్ పార్టీలో చేరినా తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంత్రి జూపల్లి ఎదుట కృష్ణమోహన్‌రెడ్డి వాపోయినట్టు సమాచారం. గద్వాల కాంగ్రెస్ నాయకురాలు సరితకు ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వడం లేని చెప్పారని తెలిసింది. ఇటీవల కల్వకుర్తిలో సీఎం సభకు సరితను ఆహ్వానించారని, తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని జూపల్లి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఇంత వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలపై తనకు హామీ లభించలేదని ఎమ్మెల్యే అనడంతో.. ఇక నుంచి అంతా మంచి జరుగుతుందని మంత్రి భరోసా ఇచ్చారని తెలిసింది. ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్లోనే కొనసాగుతారని, మళ్ళీ బీఆరెస్‌లోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని జూపల్లి అనంతరం చెప్పారు. మొన్న అసెంబ్లీలో కేటీఆర్, ఇతర బీఆరెస్ నేతలతో పాత పరిచయంతోనే కృష్ణ మోహన్ రెడ్డి కలిశారని, అంత మాత్రానికే కాంగ్రెస్ను వీడుతున్నారనే మాటలు వచ్చాయని జూపల్లి పేర్కొన్నారు. గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తారని, గట్టు ఎత్తిపోతల పథకంతోపాటు నియోజకవర్గం పెండింగ్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని జూపల్లి వెల్లడించారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ తిరిగి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఇదంతా బీఆరెస్ నేతలు సృష్టిస్తున్న వదంతులు మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చిన వారందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అనంతరం అందరూ కలిసి కృష్ణ మోహన్ రెడ్డి ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు.