భువనగిరి కోటకు పూర్వ వైభవం : మంత్రి జూపల్లి

భువనగిరి కోటను రోప్‌వే, హోటల్, ఆధునిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

ఏకశిల(గుట్ట)పై నిర్మించబడిన చారిత్రాక భువనగిరి కోటకు పూర్వవైభవంతో కూడిన హంగులతో పాటు పర్యాటకులకు వసతులు కల్పించి అభివృద్ది చేస్తున్నామని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం భువనగిరి కోట పర్యాటక అభివృద్ధి పనులను, రోప్ వే నిర్మాణ పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రోప్ వే, హోటల్ నిర్మాణం,పర్యాటకులకు మౌలిక సదుపాయాలు, కొండ పైన జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతి వివరాలను సమీక్షించి..పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని అసహనం వ్యక్తంచేశారు. కొండ క్రింద(లోయర్ స్టేషన్ లో) రోప్ వే నిర్మాణం,హోటల్, పార్కింగ్,రెస్ట్ రూమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రాక్ గార్డెన్ కు విద్యుత్ దీపాల అలంకరణ, కొండపైన (అప్పర్ స్టేషన్) కోట పునరుద్ధరణ,వాటర్ బాడీస్ బ్యూటిఫికేషన్, కేఫేటెరియా, కోట చరిత్రని తెలియజేయడానికి ఇంటర్ప్రిటేషన్ సెంటర్, మెట్ల పునరుద్ధరణ, ఎంట్రన్స్ ప్లాజా, టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, రెస్ట్రారెంట్, పర్యాటకులకు మౌలిక సదుపాయాలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు.

యాదాద్రి-భువనగిరి కోట‌-కొలనుపాకలను కలుపుతూ టూరిజం సర్క్యూట్

అనంతరం మంత్రి జూపల్లి మీడియాలో మాట్లాడారు. భువనగిరి కోటను అత్యంత ఆధునీకరణ చేస్తున్నాం. కోట పూర్వ వైభవం ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దుతున్నాం అని, అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించామని చెప్పుకొచ్చారు. అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పగలు, రాత్రి పనులు చేపట్టాలని ఆదేశించినట్లుగా తెలిపారు. యాదాద్రి, భువనగిరి కోట‌, కొలనుపాకలను అనుసంధానిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక–వారసత్వ పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గుర్తు చేశారు. స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0 కింద వ్యయం రూ. 56.81 కోట్ల అంచనా వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. వారసత్వ పరిరక్షణ, ఆధునిక సదుపాయాలు, పర్యాటక అనుభవాల మెరుగుదల, రూ.17.91కోట్లతో రోప్‌వే ఏర్పాటు ద్వారా భువనగిరి కోటకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, గత పాలకులు పర్యాటకాన్ని నిర్లక్ష్యం చేశారు. కనీస వసతులు కూడా కల్పించలేదు అని ఆరోపించారు. మా ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని తీసుకువచ్చి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. తెలంగాణను దేశంలోనే అత్యంత ప్రాధాన్య పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడం, ప‌ర్యాట‌కం ద్వారా సంప‌ద సృష్టి, ఉద్యోగ ఉపాధి క‌ల్ప‌న ల‌క్ష్యంగా  సమగ్ర కార్యాచరణతో ముందుకుసాగుతున్నాం అని, 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఆధాత్మిక, వారసత్వ సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా మార్చడమే మా ప్ర‌భుత్వ‌ లక్ష్యం అని తెలిపారు. తెలంగాణలోనే కాకుండా, భారతదేశం మొత్తంలోనే అత్యంత విశిష్టమైన బౌద్ధ వారసత్వ క్షేత్రాల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్ర‌భుత్వం కృషి చేస్తోందని, దేశ, విదేశీ పర్యాటకులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తెలంగాణ ప్రజలు మద్దతు తెలపాలని, కనీసం నెలకు రెండు సార్లు పర్యాటక ప్రాంతాలను సందర్శించి , తెలంగాణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కోరారు. కుటుంబంతో ఆహ్లాదంగా గడపడం వల్ల మానసికోల్లాసం కలుగుతుందని, ఆలోచన విధానం మారుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, పురావస్తు శాఖ డైరెక్టర్ డా. అర్జున రావు, ఆర్డీవో కృష్ణారెడ్డి,అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఫణిగిరిని సందర్శించిన మంత్రి జూపల్లి

అనంతరం మంత్రి సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలోని బౌద్ధ క్షేత్రం, మ్యూజియాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మందుల సామేల్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Latest News