ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం: కోమటిరెడ్డి
తెలంగాణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రహదారుల నిర్మాణానికి పూనుకున్నామని వెల్లడించారు

- అందులో భాగంగానే హ్యామ్ రహదారుల నిర్మాణానికి శ్రీకారం
- తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యంగ్ స్టేట్
- ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో 17 ప్యాకేజీలో 5190కి. మీ రోడ్లు
విధాత, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రహదారుల నిర్మాణానికి పూనుకున్నామని వెల్లడించారు. మంగళవారం హెచ్ఐసీసీ నాక్ ఆడిటోరియంలో హమ్ ప్రాజెక్టు రోడ్లపై డిప్యూటీ సీఎం, భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కతో కలిసి కోమటిరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను రహదారులతో అనుసంధానించడం, రాష్ట్ర అభివృద్ధిని ప్రోత్సహించడం, తెలంగాణ భవిష్యత్తుకు రూపకల్పన చేయడం అనే ఆశయంతో మేం అవిశ్రాంతంగా కృషిచేస్తున్నామన్నారు. అమెరికా సంపన్న దేశం కాబట్టి అమెరికా రోడ్లు బాగుండటం కాదు.. అమెరికా రోడ్లు బాగుండటం వల్లనే అమెరికా సంపన్న దేశంగా మారిందని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ చెప్పాడని వెంకట్ రెడ్డి అన్నారు.
తెలంగాణ, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి. అయితే గత పదేండ్లలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతి ఎంత ముఖ్యమో.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కూడా మాకు అంతే ముఖ్యమన్నారు. హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్ (HAM) కార్యక్రమం మొదటి దశలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం 17 ప్యాకేజీలలో 7,947 కిలోమీటర్ల రోడ్డు పనులను చేపడుతుందని, రోడ్లు & భవనాల శాఖ అభివృద్ధి చేయాలని తలపెట్టిన 12 వేల కిలోమీటర్ల రహదారుల్లో మొదటి దశలో 6478.33 కోట్ల రూపాయలతో 17 ప్యాకేజీలలో 5,190 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తుందన్నారు. మిగిలిన 6810 కిలోమీటర్ల రహదారులను వచ్చే డిసెంబర్ నాటికి టెండర్లు పిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
HAM నమూనా ఎందుకు..?:
HAM విధానంలో ప్రభుత్వం 40% నిధులు 4% చొప్పున 10 వాయిదాలలో చెల్లిస్తుంది. ఇందులో కేవలం 10% నిధులు మాత్రమే అడ్వాన్స్ గా చెల్లించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని వెల్లడించారు. మిగిలిన 60% పెట్టుబడిని కాంట్రాక్టు సంస్థ పెట్టుబడిగా పెడుతుంది, వారి పనితీరు ఆధారంగా ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందన్నారు. ఈ విధానంలో పెట్టుబడిదారులకు స్థిరత్వం, తక్కువ రిస్క్ ఉంటుంది, ప్రజలకు ప్రమాదరహిత రహదారుల నిర్మాణం జరగడంతో పాటుగా.. 15 సంవత్సరాల పాటు నాణ్యమైన రహదారుల నిర్వాహణ (మెయింటినెన్స్) జరుగుతుందన్నారు. ఈ HAM ప్రాజెక్ట్ గ్రామీణ, ప్రాంతీయ అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతం ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.