Komatireddy Venkat Reddy : నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా

నల్లగొండలో కాంగ్రెస్ బలాన్ని ప్రశంసించిన మంత్రి కోమటిరెడ్డి, స్థానిక అభివృద్ధి, రోడ్లు, విద్య, వైద్యంలో మెరుగుదలకు హామీ ఇచ్చారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Sep 23, 2025, 4:28 pm IST
Read Time: 4 mins
Komatireddy Venkat Reddy : నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా

హైదరాబాద్, సెప్టెంబర్ 23(విధాత): నల్లగొండ గడ్డ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కండువా మోసే నిఖార్సైన కార్యకర్తలే పార్టీకి బలమని, మీరే నా లీడర్లు, మీరే నా క్యాడర్లు, మీరే నా బలం, బలగమని ఆయన తెలిపారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసమయంలోనైనా తోడుగా నా వెన్నంటే ఉంటూ 30 ఏళ్లుగా నన్ను అక్కున చేర్చుకున్నారని, ఏమిచ్చినా మీ రుణం తీర్చలేనిదని కోమటిరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. అభివృద్ధిలో నల్లగొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానని తెలిపారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత మీదేనని అన్నారు.

గ్రామీణ రోడ్లు అన్నింటినీ డబుల్ రోడ్లుగా మారుస్తా.. విద్యా, వైద్యంలో ఇంకా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రోడ్లు, కాలువలు, కాలేజీలు, హాస్పిటల్స్, ప్రాజెక్టులు ఏది చూసినా నల్లగొండ మోడల్ అనేలా చేస్తానని మాటిస్తున్నానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా 100శాతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని కార్యకర్తలకు సూచించారు.

బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు అయింది..అది మునిగిపోయే నావా అని నేను ఎప్పుడో చెప్పానన్నారు. ఈ జిల్లాలో ఓ లిల్లీపుట్ ఉన్నాడు, ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీనేనని ఇక మళ్ళీ గెలవడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డని ఉద్దేశించి మంత్రి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ది సాధ్యమైతుందని మంత్రి వెల్లడించారు.