Konda Surekha | సున్నా నుండి సన్న బియ్యం ఘనత కాంగ్రెస్‌దే

ప్రభుత్వం, పార్టీ నిర్ణయం మేరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ స్థానికంగా సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేశారు.

Konda Surekha | సున్నా నుండి సన్న బియ్యం ఘనత కాంగ్రెస్‌దే
  • దేశ స్థితిని, గతిని మార్చింది కాంగ్రెస్
  • రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
  • సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మంత్రి భోజనం

(విధాత‌, ప్రత్యేక ప్రతినిధి):
Konda Surekha | సున్నా నుండి సన్న బియ్యం దాకా దేశ స్థితిని, గతిని మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని దేశాయిపేటలో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మ‌కంగా అమలు చేస్తున్న సన్న బియ్యం లబ్ధిదారుడు పూర్ణచందర్ ఇంట్లో సహాపంక్తి భోజనం చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి పేదల నుంచి సానుకూల స్పందన లభిస్తున్న‌ది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయం మేరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేస్తున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ స్థానికంగా సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ స్వరాష్ట్రం నుండి సురాష్ట్రం దాకా కాంగ్రెస్ ప్రభుత్వానిదే కృషి అని కొనియాడారు. 2014లో మనకు తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్లనేన‌ని చెప్పారు. నేడు మన తెలంగాణలో సురాష్ట్ర పాలన అందుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్లనే అని అన్నారు.