Minister Konda Surekha | వరంగల్ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ
మంత్రి కొండా సురేఖ సోమవారం ఉదయం వరంగల్ ప్రభుత్వ కంటి వైద్య ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరుకాకపోవడం, కొందరైతే విధులకు హాజరుకాకుండానే రికార్డులలో సంతకాలు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు

సమయ పాలన పాటించిన వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం
శాఖపరమై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశం
విధాత, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ సోమవారం ఉదయం వరంగల్ ప్రభుత్వ కంటి వైద్య ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరుకాకపోవడం, కొందరైతే విధులకు హాజరుకాకుండానే రికార్డులలో సంతకాలు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది పనితీరుపై మండిపడిన మంత్రి కొండా సురేఖ విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న సిబ్బందిని నిలదీశారు. కలెక్టర్ తో కలిసి ఆస్పత్రిలోని వైద్యుల రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుకున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్యశ్రీ సిబ్బందితో పాటు సమయపాలన పాటించని, విధులు సక్రమంగా నిర్వహించనటువంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆసుపత్రిపై సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వాలని ఆసుపత్రి సూపరిండెంట్ కు సూచించారు. ఆస్పత్రి ఆవరణలో నిలిచిన నీటిని చూసి తక్షణమే తొలగించాలని మంత్రి ఆదేశించారు.లీకేజీలను మరమ్మత్తులు జరపాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛదనం.. పచ్చదనం కార్యక్రమాన్ని మంత్రి సురేఖ ప్రారంభించారు. మరోవైపు వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయం నుండి ఎంజీఎం కూడలి వరకు కార్పోరేషన్ సిబ్బంది, మహిళ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రి కొండా సురేఖ, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు మేయర్ సుధారాణి, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు.