మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై సర్కార్ వేటు…తీవ్ర ఆరోపణలతో రేవంత్ సర్కార్ చర్యలు
అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పని చేస్తున్న సుమంత్ టెర్మినేషన్ తో అక్రమ నియామకం గుట్టురట్టు అయ్యింది.

- మంత్రి సురేఖ ఓఎస్డీగా ప్రైవేటు వ్యక్తి
- మంత్రుల పేషీల్లో నిబంధనలకు పాతర
- జీఏడీ ప్రేక్షక పాత్ర…సీఎం ఆదేశంతో గుట్టు రట్టు
హైదరాబాద్, విధాత : కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మంత్రుల పేషీల్లో ఉద్యోగుల నియామకాల్లో నిబంధనలను పాటించడం లేదు. నిబంధనలు అమలు చేయాల్సిన సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) చేష్టలుడిగి చూస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పని చేస్తున్న సుమంత్ టెర్మినేషన్ తో అక్రమ నియామకం గుట్టురట్టు అయ్యింది. అందరూ ఇంతకాలం ఆయన ప్రభుత్వ గెజిటెడ్ అధికారి అని భ్రమపడ్డారు. టెర్మినేషన్‌తో ప్రైవేటు ఉద్యోగి అని తేలడంతో కంగుతిన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ అక్రమాలపై విచారించి, టెర్మినేషన్ చేయాలని ఆదేశించారని సమాచారం. ఈ ఘటనతో మంత్రుల పేషీల్లో ఎంత మంది పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయా లేదా అనే అనుమానాలు తెలంగాణ సచివాలయంలో వ్యక్తమవుతున్నాయి.
అడవులు, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో సుమంత్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ కాలుష్య నియమంత్రణ మండలి (టీజీపీసీబీ) లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2023 డిసెంబర్ నెలలో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులయ్యారు. ఏడాది కాలానికి నియమితులు అయిన ఆయన గడువు తీరడంతో మరో ఏడాది అనగా డిసెంబర్ 2025 వరకు పొడిగించారు. ప్రతి నెలా రూ.1 లక్ష వేతనంతో పాటు వ్యక్తిగత వాహన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మంత్రి సిఫారసు మేరకు కాంట్రాక్టు ఉద్యోగిగా కాలుష్య నియంత్రణ మండలి లో నియమించారంటున్నారు. అయితే అక్కడ పనిచేయకుండా డిప్యుటేషన్ పై సచివాలయంలోని మంత్రి సురేఖ పేషీలో ఓఎస్డీగా విధులు చేపట్టారు.
మంత్రి ఓఎస్డీ కావడంతో అందరూ ఆయన ఆదేశాలకు తలూపడం, పూర్తి చేసినట్లు తిరిగి సమాచారం ఇస్తున్నారు. గడచిన ఏడాది కాలంగా తనకు ఎదురు లేదనే విధంగా పెట్రేగిపోతున్నాడనే విమర్శలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, సమీక్షా సమావేశాలకు హాజరు కావడం, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, సీనియర్ అధికారుల మొబైల్ ఫోన్ కు నేరుగా కాల్ చేసి ఆదేశాలు జారీ చేస్తున్నాడు. మంత్రి ఆమోదం కోసం ఏదైనా ఫైలు పంపించాలంటే కనీసం రూ.1 లక్ష సమర్పించుకోవాలని గుసగుసలున్నాయి. వరంగల్ లో కొందరు క్రషర్ యజమానులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారంటున్నారు. కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు పంపించడంలో తాత్సారం చేస్తున్నాంటూ ఆ మధ్య మంత్రి సమీక్షా సమావేశంలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో అవి నగరంలో ఉండకూడదని, తరలించాల్సిందేనని ఆదేశించారు. అంతే కాకుండా కొన్ని పరిశ్రమలు హానికర వ్యర్థ రసాయనాలు బహిరంగ ప్రదేశాలు, మూసీ లో పారబోస్తున్నారని, నియంత్రించాలని ఆదేశించారు. ఇక నుంచి టీజీ పీసీబీ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ టీమ్ లో మిగతా విభాగాల అధికారులను చేర్చాలని స్పష్టం చేశారు. ఒకే విభాగం అధికారులు ఉండడం మూలంగా నియంత్రించడంలో విఫలం అవుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మంత్రి సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం టెండర్ల పంచాయతీ తో విభేదాలు తారాస్థాయికి చేరుకుని బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం ఆయన మేడారం పర్యటనకు రాగా, వ్యక్తిగత కారణాలతో ఆమె రాలేకపోయారు.
గెజిటెడ్ అధికారి నే ఓఎస్డీగా నియమించాలి
సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రుల పేషీల్లో నియమితులు అయ్యే వారికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే నియామకాలు చేయాల్సి ఉంటుంది. మంత్రి కొండా సురేఖ్ ఓఎస్డీ విషయంలో జీఏడీ ఏమాత్రం నిబంధనలు పాటించలేదంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీఏడీ జీఓఎంఎస్ నెంబర్ 522 (తేదీ 27-08-2011) జారీ చేసింది. వ్యక్తిగత సిబ్బంది నియామకాల్లో మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ అధికారిగా గెజిటెడ్ హోదాలో ఉన్న అధికారిని మాత్రమే ఓఎస్డీగా నియమించాల్సి ఉంటుంది. మంత్రి పేషీలో నియమితులు కావాలంటే గెజిటెడ్ హోదాలో ఐదేళ్ల అనుభవం పూర్తై ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారినే మంత్రి పేషీలో ఓఎస్డీగా నియమించాలి కానీ, కొండా సురేఖ పేషీలో పనిచేస్తున్న ఓఎస్డీ కి ఈ అర్హతల్లో ఒక్కటి కూడా లేదు. నిబంధనలు ఏమాత్రం ఒప్పుకోనప్పుడు, జీఏడీ విభాగం ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారనే చర్చ సచివాలయంలో జరుగుతోంది. అది కూడా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ హోదాలో. ఒక ఉద్యోగి ఏదైనా సమస్య గురించి వస్తే, నిబంధనల పేరుతో కొర్రీలు వేసే జీఏడీ అధికారులు ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారో తెలియాల్సి ఉంది. కొండా సురేఖ పేషీ మాదిరి మిగతా మంత్రుల పేషీల్లో అనర్హులు పనిచేస్తున్నారని, వారిని కూడా తొలగించాలనే వాదన సచివాలయ వర్గాల్లో జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ మంత్రులు దర్జాగా నియమించుకున్నారు.
వీరితోనే రహస్య సమాచారం ప్రతిపక్షపార్టీలకు వెళ్తున్నదని, ఆ నిందలు తమపై పడుతున్నాయని వాపోతున్నారు. మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరుతున్నారు. కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తాము ప్రభుత్వ ఉద్యోగులం అంటూ బిల్డప్ ఇస్తూ అధికారులను దబాయిస్తూ పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతి మంత్రి పేషీలో పనిచేస్తున్న ఉద్యోగి పేరు, హోదా, ప్రభుత్వం లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగా అనేది ఇక నుంచి స్పష్టంగా తెలియచేయాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేస్తే అందరికి అర్థం అవుతుందని, జాగ్రత్త పడతారని ఒక అధికారి వ్యాఖ్యానించారు.