పొంగులేటి వర్సెస్ కొండా.. మేడారం టెండర్ల లొల్లి మంత్రుల మధ్య ఆధిపత్య పోరు..!

పొంగులేటి వర్సెస్ కొండా.. రేవంత్ మంత్రివర్గంలో విభేదాలు రాష్ట్రానికి దిక్సూచిగా వ్యవహరించాల్సిన మంత్రులు.. ఆధిపత్యం, అదాయం కోసం అన్ని విస్మరించి బజారుకెక్కుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారు.

  • By: Tech |    telangana |    Published on : Oct 11, 2025 10:15 PM IST
పొంగులేటి వర్సెస్ కొండా..  మేడారం టెండర్ల లొల్లి మంత్రుల మధ్య ఆధిపత్య పోరు..!
  • పొంగులేటి వర్సెస్ కొండా
  • ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు
  • అధిష్ఠానానికి సురేఖ ఫిర్యాదు
  • మంత్రుల మధ్య కోల్డ్ వార్
  • మేడారం టెండర్ పై పంచాయితీ
  • టెండర్ పై మూడు ముక్కలాట
  • మంత్రి సీతక్క కింకర్తవ్యం?

విధాత, ప్రత్యేక ప్రతినిధి:  రాష్ట్రానికి దిక్సూచిగా వ్యవహరించాల్సిన మంత్రులు.. ఆధిపత్యం, అదాయం కోసం అన్ని విస్మరించి బజారుకెక్కుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. మంత్రుల మధ్య, శాఖల మధ్య, జిల్లాల మధ్య పెత్తనం కోసం చేస్తున్న చర్యలతో ఉన్న కాస్తా పరువును కోల్పోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖకు మధ్య కొంతకాలంగా నెలకొన్న విభేదాలు మేడారం టెండర్ల సాక్షిగా మరింత తీవ్రమయ్యాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటిపై కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. మంత్రివర్గ సహచరుల్లో ప్రారంభమైన ఈ రగడ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందంటున్నారు. మరో మంత్రి సీతక్క మాత్రం ఈ వ్యవహారంలో మౌనప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు సమాచారం.

రేవంత్ మంత్రివర్గంలో విభేదాలు

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల మధ్య నెలకున్న అనైక్యత, సమన్వయలోపం మరోసారి భగ్గుమన్నది. జిల్లా మంత్రులు, జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, శాఖల మంత్రుల మధ్య పొసగకపోవడంతో ప్రారంభమైన కోల్డ్‌వార్ ఇప్పుడు నిప్పురాజేస్తోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో బహిరంగంగానే సాగుతున్నది. ఎడమొఖం, పెడముఖంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కల్చర్‌ను మరోసారి రుజువుచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిగా రెండేళ్లు కూడా నిండకముందే మంత్రుల మధ్య నెలకొన్న పంచాయతీలతో సీఎం రేవంత్ తో పాటు, కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిన్నమొన్నటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు మంత్రులు, మంత్రులు పోటీపడే స్థాయికి చేరిందంటున్నారు. ఇటీవలనే మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య తలెత్తిన నోటి దురుసుతనం పంచాయితీ వేడి చల్లారకముందే తాజాగా పొంగులేటి, కొండా సురేఖ మధ్య విభేదాలు తీవ్రం కావడం ఇప్పుడు పరిస్థితి తీవ్రరూపం దాల్చిందంటున్నారు. సీఎం అంటే భయం, భక్తి లేకపోవడం, అధిష్ఠానం అంటే ఆషామాషీగా తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ లోనే చర్చించుకుంటున్నారు.

మేడారం టెండర్లతో లొల్లి..

వచ్చే జనవరిలో జరుగే మేడారం జాతర పనుల కోసం నిర్వహించిన టెండర్లు ఇద్దరు మంత్రులు పొంగులేటి, కొండా సురేఖల మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలను ఇంకొంత తీవ్రం చేసిందంటున్నారు. ములుగు జిల్లాలోని మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. రెండు దశలుగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి దశలో రూ.71 కోట్లతో చేపట్టిన పనులకు టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్ ప్రక్రియే ఇప్పుడు ఇద్దరు మంత్రులు పొంగులేటి, కొండాకు మధ్య పంచాయితీకి కారణమని చెబుతున్నారు. టెండరు నిర్వహించాల్సింది దేవాదాయ శాఖ కావడంతో ఇక్కడ కిరికిరి నెలకొంది. సంబంధిత టెండరు నిర్వహించాల్సిన మంత్రి కొండా సురేఖ కాకుండా.. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి నిర్వహించడం గమనార్హం. ఇన్‌చార్జ్ మంత్రి.. సంబంధిత శాఖ మంత్రులు సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖకు సంబంధం లేకుండా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి ఈ టెండర్ ను తనకు అనుకూలమైన వ్యక్తికి వచ్చే విధంగా చేశారనేది ఆరోపణ. ఇక్కడే ఇద్దరి మంత్రుల మధ్య పంచాయితీ ప్రారంభమైంది.

తన శాఖలో పొంగులేటి పెత్తనమేమిటని కొండా సురేఖ ప్రశ్నిస్తుండగా, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా తనకు ఆ బాధ్యత ఉందనే వాదన పొంగులేటి చేస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఇద్దరు మంత్రులు సమన్వయంతో ఈ పనిచేస్తే అసలు పంచాయితీ ఉండేది కాదంటున్నారు. కానీ, ఆధిపత్యం, రావాల్సిన కమీషన్, తమకు అనుకూలమైన వ్యక్తులకు టెండర్ దక్కాలనే పట్టుదల వెరసి ఇద్దరి మధ్య లొల్లికి దారితీసిందంటున్నారు. శాఖ మంత్రిగా తనకున్న హక్కులను ఇన్‌చార్జ్ మంత్రి పేరుతో కాలరాయడాన్ని సహించలేక కొండా ఫైరవుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మేడారం పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ఆదేశించిన అంశాలను పొంగులేటి సానుకూలంగా వినియోగించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేడారం పనులను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో వారం వారం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇదే అదునుగా టెండర్లలో జోక్యం చేసుకుని తనకు అనుకూలమైన వ్యక్తికి కట్టబెట్టడంతో కొండా సురేఖ జీర్ణించుకోలేక పోయారని చెబుతున్నారు. సీఎం ఆదేశాల పేరుతో తన శాఖలో కూడా పొంగులేటి చక్రం తిప్పడాన్ని సహించలేక రగిలిపోతున్నారు. ఈ అంశాన్ని తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

మంత్రుల మధ్య పాత పంచాయితీ

తాజా మేడారం టెండర్ల వ్యవహారంతో మంత్రులు పొంగులేటి, కొండా మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమైనప్పటికీ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా పంచాయతీ సాగుతోంది. పైకి కలిసి ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ ఒకరి పొడ, మరొకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి కొద్ది రోజుల క్రితం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై బహిరంగంగా పరుషపదజాలాన్ని వినియోగించిన విషయం పెద్ద పంచాయితీకి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఒక వైపు కొండా సురేఖ, మురళి మరొకవైపుగా గ్రూపులుగా మారిపోయారు. ఈ పంచాయితీ క్రమశిక్షణ కమిటీ ముందు ఎటూ తేలకుండా ఉన్నది. మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాయిని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రకాళికి బోనం సమర్పించాలనే అంశం వివాదస్పదమై ఆ కార్యక్రమం ప్రారంభం రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి మంత్రి కొండా సురేఖ దంపతులు ఒంటరయ్యారు. ఈ ఎపిసోడ్లో కొండా మురళి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డిని ఈ గొడవలోకిలాగి ఆయనతో పొంగులేటికి ఉన్న బంధుత్వం కారణంగా తమకు ఆయన సహకరించడంలేదని ఆరోపించారు. అప్పటి నుంచి ఒకరంటే ఒకరు పడని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యేలు ఆహ్వానించడం లేదు. ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి మాత్రం హాజరవుతున్నారు. తనను కాదని పొంగులేటిని ఎమ్మెల్యేలు ఆహ్వానించడం, ఆయన రావడంతో సురేఖ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల భద్రకాళి దేవస్థానం పాలకమండలి సభ్యుల అంశంలో కూడా ఎమ్మెల్యే నాయిని, మంత్రి సురేఖ మధ్య బహిరంగ విమర్శలు సాగాయి. ఈ మొత్తం వ్యవహారంలో పొంగులేటి తనకు కాకుండా ఎదుటి పక్షానికి మద్ధతునందిస్తున్నారని కొండా సురేఖ భావించి ఆయన పై అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మేడారం టెండర్ల వ్యవహారంలో పొంగులేటి తనను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని సురేఖ ఇప్పుడు తీవ్ర విషయంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు.

పొంగులేటిపై సురేఖ ఫిర్యాదు

తన శాఖలో పొంగులేటి పెత్తనం పై సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పేరుతో తమ ఆత్మగౌరవాన్ని పొంగులేటి దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే అంశాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జన్ ఖర్గే, ఇతర అధిష్ఠానం పెద్దలకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అధిష్ఠానం పెద్దలను కలిసేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లు కొండా వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పొంగులేటి మాత్రం జిల్లా ఇన్ చార్జ్ మంత్రి హోదాలో తాను ముందుకు సాగుతున్నట్లు, సీఎం ఆదేశాలున్నందున మేడారం పనులపై శ్రద్ధవహించినట్లు చెబుతున్నట్లు సమాచారం. మేడారం టెండర్ల అంశాన్ని వినియోగించుకుని కొండా దంపతులు మొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని గత తప్పులు చర్చకు రాకుండా పావులు కదుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొండా దంపతుల వెనుక ‘అదృశ్య’ హస్తాల తోడ్పాటు ఉన్నట్లు మరో చర్చ ప్రారంభం కావడం గమనార్హం.

మంత్రి సీతక్క కింకర్తవ్యం!?

ఇప్పటికే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాల పై మంత్రి సీతక్క మౌనం వహించిన విషయం విదితమే. మంత్రి కొండా సురేఖ దంపతులపై పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలో కూడా మౌనంగా ఉన్నారు. అధిష్ఠానం, పార్టీ దీనిపై నిర్ణయం తీసుకుంటోందని ఆమె ఒక సందర్భంలో మీడియాతో చెప్పారు. తాజాగా మేడారం జాతర టెండర్ వ్యవహారం పై కూడా సీతక్క అదే మౌనాన్ని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. అంతర్గతంగా మాత్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా, నియోజకవర్గం పరిధిలోని మేడారం జాతర టెండర్లు ఇతరత్ర వ్యవహారంలో తనకు ప్రాధాన్యత లేకపోవడం పట్ల కినుక వహించినట్లు చెబుతున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి, దేవాదాయ శాఖ మంత్రి హోదాలో సురేఖలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండుగా మంత్రిగా ఉన్నప్పటికీ తనను పట్టించుకోవడంలేదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత జాతర సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క మధ్య విభేదాలు నెలకొన్నట్లు ప్రచారం సాగింది. దేవాదాయ శాఖ మంత్రికి సంబంధం లేకుండా మంత్రి సీతక్క మేడారం జాతర పై పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కూడా ఇద్దరి మధ్య విభేదాలున్నట్లు వచ్చిన వార్తలను ఇద్దరు మంత్రులు ఖండించారు. తాము సమ్మక్క, సారలమ్మ తీరు కలిసి ఉంటున్నామని ప్రకటించారు. గత జాతర సందర్భంగా తాను అనారోగ్యంతో హాజరుకాలేదని సురేఖ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పొంగులేటి, సురేఖ మధ్య నెలకొన్న ఈ రగడ ఇప్పట్లో సమసిపోయేదిగా లేదంటున్నారు.