Ponguleti Srinivas Reddy | అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

విధాత, వరంగల్ ప్రతినిధి:ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో రూ.5కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు, రూ.11.74 కోట్లతో అమృత్ 2.0 పథకానికి సంబంధించిన పనులను ప్రారంభించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మంత్రి చేరుకోగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, శారద ఘన స్వాగతం పలికారు. మున్సిపాలిటీ ఆవరణలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అనంతరం పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పై ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తో ఈ ప్రాంత అభివృద్ధి రూపురేఖలు మారనున్నాయని అన్నారు. రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కొరియా పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి టెక్స్టైల్ పార్క్ కు సంబంధించి పెద్ద కంపెనీలతో చర్చలు జరిపారని, ఆయా సంస్థల ప్రతినిధులు కొద్ది రోజుల్లో ఇక్కడ పర్యటించి టెక్స్టైల్ పార్కులో పరిశ్రమలు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వరంగల్, హనుమకొండ మీదుగా వెళ్తున్న జాతీయ రహదారికి భూ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం విలువైన భూములు అనేది వాస్తవమని, ప్రజలకు, రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా పరిహారం అందిస్తామన్నారు. కొనాయమాకుల వద్ద కాకతీయ కెనాల్ మీద లిఫ్టు ఏర్పాటుకు వై. ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రూ.114 కోట్లకు పెంచారని పేర్కొన్నారు. 14వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు కొంతవరకు పనులను పూర్తి చేశారని , వాటికి మోటార్లను కొన్నారని, కాని వాటిని కనీసం డ్రై రన్ కూడా చేయలేదన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ లిఫ్టు ఇరిగేషన్ను ఈ ప్రభుత్వం ప్రారంభించబోతుందని అన్నారు. ఆసుపత్రిలో భవనం పైపెచ్చులు ఊడిపడుతూ ప్రమాదకరంగా మారిందని స్థానిక ఎమ్మెల్యే, అధికారులు చెబుతున్నారని వెంటనే పాత ఆసుపత్రిని తరలించి వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. రాబోయే నెల రోజుల్లోనే ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ను పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ కు సంబంధించి సర్వే నిర్వహించగా 51శాతం మంచి నీరు రావడం లేదని ఆ సర్వేలో తేలిందన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు, ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని తమ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. దీనిలో భాగంగానే 11 కోట్లకు పైగా నిధులతో పరకాలలో అమృత్ పథకానికి ప్రారంభోత్సవం చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మంజూరైన 11 కోట్ల రూపాయలతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, డ్రైనేజీ, తదితర అభివృద్ధి పనులను పూర్తిస్థాయి వివరాలతో కూడిన ప్రగతి నివేదికతో చేపడితే బాగుంటుందని అన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఇంచార్జ్ మంత్రిగా పొంగులేటి ప్రత్యేక దృష్టిని పెట్టారని అన్నారు. ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య , వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద , పరకాల మున్సిపల్ ఛైర్ పర్సన్ అనిత, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, మున్సిపాలిటీ కమిషనర్ నరసింహ, తహసిల్దార్లు, ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.