వడదెబ్బ మరణాలకు.. రూ.4లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి

తెలంగాణలో వడదెబ్బ మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి పొంగులేటి.. వచ్చే మూడు రోజులు తీవ్ర ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో వచ్చే మూడు రోజులు అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు. ఎండలు, వడగాలుల అంశంపై మంత్రి శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల వద్ద మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వడదెబ్బతో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు. వడ దెబ్బ మరణాల నమోదులో అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సచించారు. ప్రజల ప్రాణ రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత‌నిస్తుందని, రాష్ట్రంలో జిల్లాల క‌లెక్టర్ల నివేదిక ప్రకారం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో న‌లుగురు, వ‌రంగ‌ల్ అర్బన్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున జోగులాంబ గ‌ద్వాల్‌, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కరు చొప్పున 7 జిల్లాల్లో వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృత్యువాత‌ పడ్డారని వెల్లడించారు.

హీట్ వేవ్‌పై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత‌

ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంటోందని,. తీవ్రస్థాయి ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగిందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావుండకూడదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ హీట్ వేవ్ పరిస్థితులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని మండల స్థాయి అధికారుల నుంచి గ్రామస్థాయి సిబ్బంది వరకు అందరూ ఫీల్డ్‌లో ఉండాలని ఎండదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలని మీడియా, సోషల్ మీడియా, గ్రామస్థాయి ప్రకటనల ద్వారా ఎండలపై అప్రమత్తత కల్పించాలని ప్రజలకు అవసరమైన సమాచారం ప్రతి గంటకు చేరేలా చర్యలు తీసుకోవాలని అని అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఈనెల 26వ‌ర‌కు కరీంనగర్‌, పెద్దప‌ల్లి, జయశంకర్ భూపాలపల్లి,ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత, తీవ్రమైన ఉష్ణోగ్రతలు మరియు వడగాల్పులు కొనసాగుతాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింద‌ని ఈ జిల్లాల క‌లెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

బస్ స్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఒక్క ప్రాణం కూడా ఎండల కారణంగా ప్రమాదంలో పడకూడదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, రోడ్లపై పనిచేసే కార్మికులకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మనుషుల ప్రాణాలతో పాటు జీవరాశుల సంరక్షణ కూడా మన బాధ్యతేనని గ్రామాలు, పట్టణాల్లో నీటి తొట్టెలు, మట్టి కుండల ద్వారా పక్షులు, జంతువులకు తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి :

భూమిలో నుంచి బయటపడిన సింహవాహిని అమ్మవారు
ఆయనకే ఫ్యూచర్ లేదు…ఫ్యూచర్ సిటీని ఏం ఆపుతారు: హరీష్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్

Latest News