హెచ్–1బి వీసా ఫీజు పెంపుపై మంత్రి పొన్నం ఆందోళన

అమెరికా ప్రభుత్వం హెచ్–1బి వీసా ఫీజును సుమారు రూ.90 లక్షలు (సుమారు 1 లక్ష అమెరికన్ డాలర్లు) వరకు పెంచే నిర్ణయంపై రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్–1బి వీసా ఫీజు పెంపుపై మంత్రి పొన్నం ఆందోళన

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విధాత): అమెరికా ప్రభుత్వం హెచ్–1బి వీసా ఫీజును సుమారు రూ.90 లక్షలు (సుమారు 1 లక్ష అమెరికన్ డాలర్లు) వరకు పెంచే నిర్ణయంపై రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. “ఇండో–అమెరికా సంబంధాల బలం ప్రతిభ, సాంకేతికత పరస్పర మార్పిడిలో ఉంది. ఇంత భారీగా ఒక్కసారిగా ఫీజు పెంపు చేయడం మా యువతపై, అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న కంపెనీలపై తీవ్రమైన అనిశ్చితి కలిగిస్తుంది. మన దేశం, ముఖ్యంగా తెలంగాణ ఐటీ వృత్తిదారుల ప్రయోజనాలను కాపాడేలా భారత ప్రభుత్వం వెంటనే దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.

హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని అమెరికాకు వెళ్తున్న వేలాది మంది ఐటీ నిపుణులు ఈ నిర్ణయం వల్ల ఉద్యోగ, వ్యాపార అవకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని మంత్రి పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో ఆర్థిక, వ్యాపార పరమైన దుష్పరిణామాలను అర్థం చేసుకునేలా ఐటీ కంపెనీలు, పరిశ్రమ సంఘాలు, ఎన్‌ఆర్‌ఐ నెట్‌వర్కులు ఒకే వేదికపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

తొలగింపులు లేదా ఇబ్బందులు ఎదుర్కొనే నిపుణుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి రాష్ట్ర ప్రతిభకు తగిన రక్షణ కల్పించడానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.