Ponnam Prabhakar Vs Adluri Lakshman | మంత్రులు పొన్నం, అడ్లూరి మధ్య ముగిసిన వివాదం
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య వివాదం ముగిసింది. పొన్నం ప్రభాకర్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పడంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సయోధ్య కుదిర్చారు.

విధాత, హైదరాబాద్ : మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల పంచాయతీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యంతో ముగిసిపోయింది. ఈ వివాదంపై చర్చించేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు మంత్రులు పొన్నం, అడ్లూరిలు ఇద్దరు కూడా బుధవారం మహేష్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లురి లక్ష్మణ్ కుమార్ ల భేటీయైన మహేష్ కుమార్ గౌడ్ మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చారు. తన వ్యాఖ్యల పట్ల మంత్రి లక్ష్మణ్ కు పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసిపోయిందని సమాచారం. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి ,సంపత్ కుమార్, అనిల్ , వినయ్ కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.
క్షమాపణలు చెప్పాను : మంత్రి పొన్నం
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నాకు , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు అన్నారు. నేను లక్ష్మణ్ ను ఉద్దేశించి అనుచిత మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. నాకు లక్ష్మణ్ ను అవమానించే ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడి లో పెరగలేదని..కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు అని పొన్నం చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుందని గుర్తు చేశారు. మేమంతా ఐక్యంగా భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం అన్నారు. లక్ష్మణ్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నానని. కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గం మేమంతా కలిసి పెరిగాం అని.. కులం పేరుతో అవమానించినట్లుగా అపోహ ఉండవద్ధని విజ్ఞప్తి చేస్తున్నానని పొన్నం స్పష్టం చేశారు. అటు అడ్లూరి లక్ష్మణ్ సైతం పొన్నం వ్యాఖ్యల వివాదం సమసిపోయిందన్నారు. పార్టీ కోసం అంతా కలిపి పనిచేస్తామన్నారు.
మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలి : టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
రాష్ట్ర మంత్రులు అంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని.. ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల మంత్రి లక్ష్మణ్ నోచ్చుకోవడం,యావత్ సమాజం కొంత బాధపడిందన్నారు. మంత్రుల మధ్య జరిగిన సంఘటన కుటుంబ సమస్యగా సమసిపోయిందన్నారు. జరిగిన సంఘటన పట్ల చింతిస్తూ మంత్రి పోన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలు అని, ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ అని, రాహుల్ గాంధీ ఆశయాన్ని ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహాయంతో కుల సర్వే పారదర్శకంగా నిర్వహించాం అని, బీసీలకు 42 శాతం శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మూడు చట్టాలు తీసుకొచ్చాం అని గుర్తు చేశారు.