అమ్మానాన్న బతికుంటే బాగుండేది: మంత్రి సత్యవతి

అమ్మానాన్న బతికుంటే బాగుండేది: మంత్రి సత్యవతి
  • కంటతడి పెట్టిన మంత్రి సత్యవతి
  • సొంతూరు పెద్దతండాలో అభివృద్ధి పనులు ప్రారంభం


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తాను పుట్టిన ఊరు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం కంటతడి పెట్టారు. తనకన్నా తల్లిదండ్రులను తలుచుకొని కంటనీరు పెట్టారు. ‘నాన్న.. నువ్వు ఎప్పుడూ అడుగుతుండే వాడివి. పొలాలు, చేనుల దగ్గరికి వెళ్లడానికి ఇబ్బంది అవుతుంది బిడ్డ.


నువ్వు రాజకీయాల్లో ఉన్నావుకదా ఎవరైన పెద్దోల్లతో మాట్లాడి అటువైపు రోడ్డు వేస్తే మనవాళ్ళందరికీ బాగుండేదని. అమ్మ..నాన్న మీరు ఎన్నిసార్లు చెప్పారో నాకు గుర్తింది. ఈరోజు ఆ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నాం నాన్న. నీ..బిడ్డనయిన నేనే మంత్రిగా కోట్లాది రూపాయల నిధులను ఇచ్చాను నాన్న. ఇలాంటి సమయంలో నువ్వు అమ్మ బతికుంటే బాగుండేది’ అంటూ దుఃఖం ఆపుకోలేక మంత్రి సత్యవతి రాథోడ్ కంటతడి పెట్టారు.


‘ఏరుదాటుతూ బాబాయ్ కొట్టుకపోయి చనిపోయినప్పుడు నువ్వు..అమ్మ ఏడుస్తుంటే మీతోపాటు మీ..పిల్లలం మీమంతా ఏడ్చాం ఆ..జ్ఞాపకాలు గుర్తున్నాయి నాన్న. నా..ఊరికి, నా వారికి ఉపయోగపడే ఈ..పనులు చేయడం తనకెంతో ఆనందంగా ఉంది’ అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీందర్రావు, జడ్పీ చైర్ పర్సన్ బిందు, సర్పంచ్ వనజ, అధికారులు పాల్గొన్నారు.