Sitakka | అది మా నాన్న హ‌క్కు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంట‌రిచ్చిన మంత్రి సీత‌క్క‌

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు ప్ర‌త్యేకంగా ఆదివాసీ, గిరిజ‌నుల‌కు ఎంతో మేలు జ‌రిగింద‌ని, మంత్రి సీత‌క్క త‌ల్లిదండ్రుల‌కు పోడు ప‌ట్టా ఇచ్చామ‌ని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ శాస‌న‌స‌భ‌లో మాట్లాడుతూ గుర్తు చేశారు

Sitakka | అది మా నాన్న హ‌క్కు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంట‌రిచ్చిన మంత్రి సీత‌క్క‌

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు ప్ర‌త్యేకంగా ఆదివాసీ, గిరిజ‌నుల‌కు ఎంతో మేలు జ‌రిగింద‌ని, మంత్రి సీత‌క్క త‌ల్లిదండ్రుల‌కు పోడు ప‌ట్టా ఇచ్చామ‌ని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ శాస‌న‌స‌భ‌లో మాట్లాడుతూ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై మంత్రి సీత‌క్క తీవ్రంగా స్పందించారు. పోడు ప‌ట్టా మా నాన్న హ‌క్కు.. అదేదో దానం ఇచ్చిన‌ట్లు మాట్లాడడం స‌రికాద‌ని సీత‌క్క స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసింది మొత్తం బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్న‌ట్లు చెబుతున్నారు. 1976లో ఇందిర‌మ్మ తీసుకొచ్చి రిజ‌ర్వేష‌న్‌తో అనిల్ జాద‌వ్ ఎమ్మెల్యే అయ్యారు. ఎస్టీల‌కు లోకల్ రిజ‌ర్వేష‌న్లు తీసేసిన‌ట్టు మాట్లాడారు. జీవో నంబ‌ర్ 3 ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వానిది. మీరు ఇచ్చిన 10 శాతం రిజ‌ర్వేష‌న్ కూడా కోర్టులో ఉంది. వంద‌ల ఏండ్లుగా అడవుల్లో బ‌తుకుతున్న ఆదివాసీ, గిరిజ‌న వ‌ర్గాల‌కు పోడు భూముల చ‌ట్టం 2006 ద్వారా సోనియా, నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ వారికి హ‌క్కు క‌ల్పించార‌ని సీత‌క్క గుర్తు చేశారు.

మైనార్టీల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని చెప్పిన బీఆర్ఎస్.. 10 ఏండ్ల‌లో వారికి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌లేదు. ఈ ఏడాదికి గానూ ద‌ళిత‌బంధుకు 2 వేల కోట్లు కేటాయించాం. బ‌డ్జెట్‌ను పూర్తిగా చ‌దివి మాట్లాడితే బాగుంట‌ది. మంచిని మంచి, చెడును చెడు అనండి. ఆదిలాబాద్ జిల్లాలోనే గ‌త ప‌దేండ్లుగా ఎన్ని వేల మంది గిరిజ‌న నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. ఎస్సీ, ఎస్టీల‌కు ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పండి. మైనార్టీల‌కు సంబంధించి రిజ‌ర్వేష‌న్లు, ఇండ్లు, ఉద్యోగాలు ఏం ఇచ్చారో చెప్పాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సీత‌క్క డిమాండ్ చేశారు.

నా త‌ల్లిదండ్రులు.. 2006 అట‌వీ హ‌క్కుల చ‌ట్టానికి అర్హులు. వారు ఎక్క‌డా కూడా పోడు భూమిని దానంగా తీసుకోలేదు. ఒక ఆదివాసీ బిడ్డ‌లుగా పోడు కొట్టుకుంటే ప‌ది ఎక‌రాల‌కు వ‌ర‌కు హ‌క్కు. అది సోనియా తెచ్చిన చ‌ట్టం. ఎవ‌రూ కూడా మాకు దానం రాలేదు. రెక్క‌లు ముక్క‌లు చేసుకుని అడ‌వి కొట్టుకుని బ‌తికే ప‌రిస్థితి మా నాన్న‌ది. నేను ఎమ్మెల్యేను అయినా, మంత్రిని అయినా.. ఇప్ప‌టికీ మా నాన్న‌ అడ‌వికి పోత‌రు. చ‌ట్టం ప్ర‌కారం ఇచ్చిన హ‌క్కు ఇది. ఉచితంగా రాలేదు అది. దానం దానం ఇచ్చామ‌ని మాట్లాడొద్దు. ఆదివాసీ బిడ్డ‌గా మా హ‌క్కు. ప‌దేండ్లుగా పోడు ప‌ట్టాలు ఇవ్వ‌కుండా ఎన్నిక‌ల ముందు మీరు పోడు ప‌ట్టాలు ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా కాక ముందు నుంచి మా త‌ల్లిదండ్రులు అడ‌విని ఆధారంగా చేసుకుని బ‌తికారు. పుణ్యానికి రాలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు రైతుబంధు ఎందుకు తీసుకున్నారు. అడ‌వి బిడ్డ‌లుగా ఆదివాసీ బిడ్డ‌లుగా అది మాకు వ‌చ్చిన హ‌క్కు అని మంత్రి సీత‌క్క స్ప‌ష్టం చేశారు.