Minister Sridhar Babu | ఈస్ట్ సిటీ వైపు కూడా పెట్టుబడులు పెట్టండి: మంత్రి శ్రీధర్‌బాబు
రాబోయే కాలంలో హైదరాబాద్ ఈస్ట్ వైపు ఉన్న వినియోగదారులకు వారి ఆర్థిక శక్తిని దృష్టిలో ఉంచుకుని బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టాలని ఐటీ మంత్రి టి.శ్రీధర్‌బాబు సూచించారు

Minister Sridhar Babu | రాబోయే కాలంలో హైదరాబాద్ ఈస్ట్ వైపు ఉన్న వినియోగదారులకు వారి ఆర్థిక శక్తిని దృష్టిలో ఉంచుకుని బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టాలని ఐటీ మంత్రి టి.శ్రీధర్‌బాబు సూచించారు. శుక్రవారం నాగోల్ (Nagole)లో క్రెడాయ్ (Credai)ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను శ్రీధర్ బాబు ప్రారంభించారు. తమ ప్రభుత్వం సిటీ ఈస్ట్ వైపు పెట్టుబడుల ప్రొత్సాహానికి వీలుగా పాలసీ నిర్ణయాలు కూడా తీసుకుంటుందన్నారు. ఈస్ట్ హైదరాబాద్ వైపు 5 స్టార్ హోటల్‌తో పాటుటు కన్వెన్షన్ సెంటర్‌ల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈస్ట్ హైదరాబాద్ వైపు మంచి ఐటీ పార్క్ ఏర్పాటుపై కూడా త్వరలోనే డెసిషన్ తీసకుంటామని పేర్కొన్నారు. క్రెడాయ్ ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో చాలా మంచిదని, మా ప్రభుత్వం క్రెడాయ్‌కి పూర్తిగా సహకరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అనంతరం ఆయన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ సామాన్యులకు ఎలాంటి ధరలకు ఇళ్లు ఇవ్వాలనేది ఈ ప్రాపర్టీ షోలో క్రెడాయ్ వివరిస్తోందన్నారు. స్కిల్ యూనివర్సిటీ (Skill University)లో క్రీడాయ్ సభ్యులు కూడా శిక్షణ ఇవ్వడం అనేది చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు. గత నెలలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో 270కోట్ల రూపాయల అమ్మకం జరిగిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో అన్ని రకాల వసతులున్నాయని.. డెవలపర్స్ ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లాగా మేం మాట మార్చమని.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు శ్రీధర్ బాబు హామీనిచ్చారు