సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణను వేగవంతం చెయ్యండి : ఉత్తమ్ కుమార్ రెడ్డి
నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని చట్టపరమైన, పాలనా పరమైన అంశాలను తక్షణమే పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు

- సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణను వేగవంతం చెయ్యండి
- పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చెయ్యండి
- -అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, జూలై12(విధాత): రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణ ను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అలాగే పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చేయలన్నారు. శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని చట్టపరమైన, పాలనా పరమైన అంశాలను తక్షణమే పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జలాశయాలలో పెరుగుతున్న నీటి మట్టాలపై ఆయన ఆరా తీశారు.
నీటి పారుదల శాఖకు మిలటరీ ఇంజనీర్లు
ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాలలో టన్నెల్ నిర్మాణాలు కీలకంగా మరాయని మంత్రి తెలిపారు. టన్నెల్ నిర్మాణాలలో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు నీటిపారుదల శాఖలో భారత సైన్యంలో పని చేస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ నిపుణుల ను చేర్చుకుంటున్నట్లు చెప్పారు. భారత సేన మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ జనరల్ హార్బల్ సింగ్ నీటిపారుదల శాఖలో గౌరవ సలహాదారుగా,అంతర్జాతీయ స్థాయిలో టన్నెల్ ఇంజినీరింగ్ నిపుణుడిగా ప్రసిద్ది చెందిన కల్నల్ పరిక్షిత్ మెహ్రా లు నీటిపారుదల శాఖల్లో చేరుటున్నట్లు ఆయన తెలిపారు. భారతదేశంలో అత్యంత క్లిష్టమైన రోహ్హ్తంగ్ ,జోజిలా టన్నెల్ నిర్మాణంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారన్నారు.
శిక్షణ సంస్థ భూమిలోని కబ్జాలను తొలగించండి
రాజేంద్రనగర్ లోని వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను మరింత బలోపేతం చెసే విధంగా ప్రణాళికలు రూపొందించాలనిఅధికారులకు మంత్రి తెలిపారు. సాగునీటి నిర్వహణలో శిక్షణతో పాటు పరిశోధన కు కీలక కేంద్రంగా ఉందన్నారు.అటువంటి ఇనిస్టిట్యూట్ కు చెందిన భూమి కబ్జాకు గురైందని తక్షణమే సర్వే జరిపి అక్రమ కబ్జాలను తొలగించాలన్నారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ప్రజాధనాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు.