Minister Vakiti | ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ : మంత్రి వాకిటి
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
విధాత, వరంగల్ :
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం ఉదయం నాయిని విశాల్ ఫౌండేషన్, క్రెడాయి వరంగల్, తెలంగాణ రన్నర్స్, కియాన్ ఇన్ ఫ్రా సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ ట్రై సిటీ హాఫ్ మారథాన్-2025ను మంత్రి వాకిటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
హనుమకొండలో నిర్వహిస్తున్న మారథాన్ పోటీలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించాలని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలోనే 4వ క్రీడా పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు కేటాయించారని తెలిపారు. యువత, విద్యార్థులు చిన్నచిన్న సమస్యలకే ఒత్తిడి, న్యూనతకు లోనవుతున్నారని అన్నారు. మత్తు వదిలి మైదానాలకు చేరాలని సూచించారు. ముఖ్యమంత్రి సంకల్పంతో క్రీడా పాలసీని అమలు చేస్తున్నారని, దీంతో రాష్ట్రంలోని వేలాది మైదానాలను క్లీన్ చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దే విధంగా అంతర్జాతీయ కోచ్ లను తీసుకువచ్చి క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడినుండే దేశానికి, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా చేస్తామన్నారు.
మారథాన్ లో పాల్గొంటున్న క్రీడాకారులు నీలిరంగు టీ షర్టులు ధరించి పరిగెడుతుంటే వరంగల్ కు బ్లూ పెయింట్ వేసినట్టు ఉందన్నారు. మారథాన్ నిర్వహణతో మంచి వాతావరణాన్ని జిల్లా నుండి రాష్ట్రానికి తద్వారా దేశానికి పరిచయం చేసినట్లయిందని అన్నారు. తాను రంజీ గేమ్స్ ఆడుతున్న సమయంలో తన తల్లిదండ్రులు ఎందుకు ఆటలాడుతున్నావని తిట్టేవారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పిల్లలు ఎందుకు ఆటలు ఆడడం లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు. తమ పిల్లలను క్రీడల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. దాదాపు 35 కోట్ల రూపాయలతో విజయ డెయిరీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram