Komatireddy Venkata Reddy : ఉపాధి వేదికలు ఏటీసీలు
నల్గొండలో ఆధునిక ఏటీసీ ప్రారంభం, యువతకు రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ లో ఉపాధి, నైపుణ్య శిక్షణ అవకాశాలు.

విధాత : రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించిన “అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లు యువతకు ఉద్యోగ, ఉపాధి వేదికలు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ ప్రభుత్వ ఐటీఐలో ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న“అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఏటీసీ సెంటర్ ద్వారా యువత ఆధునిక యంత్రాలు, డిజిటల్ నైపుణ్యాలు, ఇండస్ట్రియల్ టెక్నాలజీలు, ఆటోమేషన్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతారన్నారు.
భవిష్యత్తు పరిశ్రమల అవసరాలకు తగిన రీతిలో నైపుణ్యాల అభివృద్ధి ద్వారా గ్లోబల్ స్థాయిలో అవకాశాలను అందుకోవడానికి ఏటీసీలు ప్రగతిశీల వేదికగా నిలుస్తాయని ఆకాంక్షించారు. నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్న విద్యార్థులకే ఉద్యోగ అవకాశలు దక్కుతాయన్నారు. ప్రభుత్వం రూ.2400 కోట్ల వ్యయంతో 65 ఏటీసీలను ఏర్పాటు చేసిందని.. ఒక్కొక్క దాంట్లో సుమారు 200 మంది ప్రవేశాలు పొందుతున్నారని వెల్లడించారు. వీటిలో శిక్షణ పొందుతున్న అందరికీ ఉద్యోగాలు లభిస్తున్నాయని.. ఇదే స్ఫూర్తితో మరో 51 ఏటీసీలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు.