Telangana BC Reservations | రిజర్వేషన్లపై అక్టోబర్ 6న సుప్రీంలో విచారణ.. ఢిల్లీకి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి బృందం
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 6, 2025న విచారించనున్న నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది.

హైదరాబాద్, అక్టోబర్ 5 (విధాత ప్రతినిధి):
Telangana BC Reservations | రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరి ఆదివారం సాయంత్రం శంషాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై వంగా మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు అక్టోబర్ 6న విచారించనుంది. ఈ నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. సుప్రీంకోర్టులో వాదించాల్సిన అంశాలపై న్యాయ కోవిదులతో సలహాలు సూచనలు స్వీకరించి ప్రభుత్వం తరఫున కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీలకు 42% రిజర్వేషన్ల నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. ‘పిటిషనర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నష్టం కలిగించేది కాదు’ అని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరుతో చేస్తున్నప్పటికీ అందరూ రెడ్డిలకు సంబంధం ఉందని అనడం లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతే ప్రజల మద్దతు అని న్యాయస్థానాలకు చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ సూచనల మేరకు తాను, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీ వెళ్తున్నామన్నారు. బలహీన వర్గాల సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 9 నెంబర్ జీవోను జారీ చేసింది. దీంతో రిజర్వేషన్లు 67 శాతానికి చేరాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా మాధవరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరపనుంది. ఈ పిటిషన్ విచారణను పురస్కరించుకొని తమ వాదనలను సమర్ధవంతంగా వినిపించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితులు, జీవో జారీ ఎందుకు చేయాల్సి వచ్చింది…ఇతర టెక్నికల్ అంశాలను కూడా ఉన్నత న్యాయస్థానంలో వినిపించాలని భావిస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం నాడు సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే న్యాయవాదులతో భట్టి నేతృత్వంలోని బృందం సంప్రదింపులు జరపనుంది. ఈ జీవో అమలు విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేలా తమ వాదనలు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసింది.
9న నోటిఫికేషన్
సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. రిజర్వేషన్ల అంశంపై కోర్టులో పిటిషన్, ప్రభుత్వ వాదన ఎలా ఉండాలనే దానిపై చర్చించారు. ప్రభుత్వం, పార్టీ పరంగా భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు చేశారు. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఈ నెల 8న విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఈ పిటిషన్లపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తాయోననే ఉత్కంఠ నెలకొంది.
రిజర్వేషన్లు అడ్డుకుంటే అగ్గి రాజేస్తం
తెలంగాణలో బీసీలకు న్యాయబద్ధంగా రావల్సిన 42 శాతం రిజర్వేషన్లను రెడ్డి సంఘం పేరుతో మాధవ రెడ్డి, గోపాల్ రెడ్డిలు అడ్డుకోవాలని చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రిజర్వేషన్లను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా బీసీలంతా అగ్గి రాజేస్తారని ఆయన హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం మూలంగా రాష్ట్రంలో ఏ కులానికి నష్టం లేనప్పటికీ ఎలాగైనా అడ్డుకుని తీరాలని తెరవెనుక ఎంతోమంది అగ్రకుల శక్తులు కుటీల ప్రయత్నాలు మొదలు పెట్టాయన్నారు. అందులో భాగంగానే రెడ్డి జాగృతికి చెందిన మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి లను ముందు పెట్టి గండిగొట్టాలని పథకం పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించినప్పుడు గానీ రాష్ట్రంలో కులగన చేసినప్పుడు గాని అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసినప్పుడు గాని ఎవరూ నోరెత్తలేదన్నారు. రిజర్వేషన్ల పెంపు ఆగితే చరిత్రలో మాధవరెడ్డి, గోపాల్ రెడ్డిలు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని, వారిని చరిత్ర క్షమించదని ఆయన అన్నారు. తమ పక్షాన న్యాయం, ధర్మం ఉన్నదనీ, హైకోర్టులో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను రక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ముందు శాంతియుతంగా నిరసనలు తెలపాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
=====