ఢిల్లీకి కప్పం..రైతులకు టోకరా: మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలకు కప్పం కట్టడంలో శ్రద్ధ చూపిస్తూ..ధాన్యం అమ్మకాల్లో రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా టోకరా చేస్తున్నారని

ఢిల్లీకి కప్పం..రైతులకు టోకరా: మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

మోసాలతో సాగిన కాంగ్రెస్‌ వంద రోజుల పాలన
ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం మాని పార్టీల గేట్లు ఎత్తారు

విధాత : తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలకు కప్పం కట్టడంలో శ్రద్ధ చూపిస్తూ..ధాన్యం అమ్మకాల్లో రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా టోకరా చేస్తున్నారని బీఆరెస్‌ మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండ పార్లమెంటు పరిధిలోని దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం బీఆరెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైసు మిల్లర్ల నుంచి వంద కోట్లు వసూలు చేసి, వారు రైతులకు మద్దతు ధర ఎగవేస్తున్నా కాంగ్రెస్‌ సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ళపై ప్రభుత్వ పర్యవేక్షణ కరవై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలు ఎండిపోతుంటే, ప్రజలు తాగునీటి కోసం గోస పడుతుంటే ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లివ్వాల్సిన కాంగ్రెస్‌ పాలకులు పార్టీ గేట్లు ఎత్తి చేరికల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో మళ్లీ నీళ్ల సమస్యలు, కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్ రాగానే కరవు తీసుకొచ్చి, కృష్ణా నది ప్రాజెక్టులను కేంద్రంలోని కేఆర్‌ఎంబీ చేతిలో పెట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్ నల్లగొండ మీటింగ్ కు వచ్చి గర్జీస్తే కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు ఇవ్వబోమంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టారన్నారు. కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారని బాధ పడ్డారని, ఎండిన పొలాల్ని కేసీఆర్ స్వయంగా చూసారని, వాళ్ళ భాధలు విన్నారని, రైతుల అక్రనందన మేరకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ధాన్యానికి 500/- బోనస్ ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. చనిపోయిన రైతుల వివరాలు సీఎం అడిగితే కేసీఆర్ నాలుగు గంటల్లోనే పంపారని, కానీ దానిపై స్పందించక పోగా కేసీఆర్‌పై దూషణలు మొదలుపెట్టారన్నారు. రైతుల గురించి మాట్లాడితే కేసీఆర్ లాగు ఊడ గొడతా అని సీఎం అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడని తప్పుపట్టారు. కేసీఆర్‌ కరీంనగర్‌కు వెళ్లగానే కాళేశ్వరం నుంచి నీళ్లు విడిచారని, సాగర్‌లోనూ నీళ్లున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ సాగర్‌ నుంంచి నీళ్లిచ్చామని, మూడు లక్షల ఎకరాల పంటలు కాపాడమన్నారు. కానీ పాలేరుకు నీళ్లు పోతున్నా జిల్లాలో రైతులకు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు మన కాంగ్రెస్ నేతలని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

పాలన చేతగాక కేసులతో కాలయాపన
జేబుదొంగలు సీఎం, మంత్రులు అయితే కాంగ్రెస్‌ పాలన మాదిరిగా అధ్వాన్నంగా ఉంటదని, పాలన చేతకాక కేసుల పేరుతో వారు కాలయాపన చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యమకాలంలో మన ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర కాంగ్రెస్ వాళ్లదేనని, నాది కూడా ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాప్ నూ మొదలుపెట్టిన వాళ్ళ నుంచి పట్టుకు రండని, చంద్రబాబు నుంచి మొదలుపెట్టాలని, ఇప్పటి వరకు ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ పై పిర్యాదు చేశారా అని, కేవలం ఆంధ్ర మీడియానూ గుపిట్లో చేతిలో పెట్టుకుని అడ్డమైన రాతలు రాయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే వాటిని వెలుగులోకి రానివ్వడం లేదని విమర్శించారు. ఇక జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంతకు ముందు రేవంత్ రెడ్డి 25 కోట్లు పెట్టి పీసీసీ కొనుకున్నాడు అన్నడని, ఇపుడేమో అందరి కంటే ముందు తానే మంత్రి పదవి కాపాడుకునేందుకు రేవంత్ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నాడని, ఈ మధ్య మిర్యాలగూడకు వచ్చి కోమటిరెడ్డి ఫోన్ లో మాద్దతు ధర ఇవ్వన్ని మిల్లును సీజ్ చేయమని కలెక్టర్ కు చెప్పాడని, యన అటువెళ్లిన వెంటనే ఇంకో వంద ధర తగ్గించారని ఎద్దేవా చేశారు. రైతుల ధాన్యం మద్ధతు ధరతో కొనడం లేదని, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఇక పార్లమెంటు ఎన్నికల తర్వాతా వాటన్నింటిని అమలు చేయడం సందేహామేనన్నారు. మహిళలకు 2500, రైతుభరోసా 15వేల, కౌలురైతులకు 12వేలు, నిరుద్యోగులకు 4వేలు, వృద్దులకు నాలుగువేల పెన్షన్‌, విద్యార్థులకు యువ వికాసం పేరుతూ 5 లక్షల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇస్తామని చెప్పిన హామీలు, బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని చెప్పారని, వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మాట తప్పారన్నారు. కాంగ్రెస్‌ మోసాలపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి బీఆరెస్‌ గెలుపుకు కృషి చేయాలని కోరారు.