MLA Padi Kaushik Reddy | సిగ్గుంటే దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్‌: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

బీఆరెస్ నాయకత్వంపై విమర్శలు చేసే ముందు సిగ్గుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగందర్‌ బీఆరెస్ నుంచి కేసీఆర్ సహకారంతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు

MLA Padi Kaushik Reddy | సిగ్గుంటే దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్‌: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ నాయకత్వంపై విమర్శలు చేసే ముందు సిగ్గుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగందర్‌ బీఆరెస్ నుంచి కేసీఆర్ సహకారంతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై దానం నాగేందర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లను విమర్శించే స్థాయి దానం నాగేందర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనకు సిగ్గుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు.

గతంలో కాంగ్రెస్‌ తనకు అన్యాయం చేసిందని, కేసీఆర్‌ దయతో గెలిచానని దానం నాగేందర్‌ గతంలో చెప్పారని గుర్తుచేశారు. ప్రజలను వేధించడంలో దానంను మించినోడు లేడని విమర్శించారు. త్వరలోనే దానం ఆక్రమణలు, అక్రమాలు బయటపెడతామన్నారు. పంజాగుట్ట చౌరస్తాలో దానం నాగేందర్ బీడీలు అమ్ముకునే వాడని రేవంత్ రెడ్డి గతంలో చెప్పాడని, బీడీలు అమ్ముకునే నువ్వు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో నువ్వు చేసిన అవినీతి, ల్యాండ్ కబ్జాలు, నువ్వు ఇప్పుడు కట్టే ఇల్లు పక్కన ల్యాండ్.. వాళ్లని ఎంత ఇబ్బంది పెట్టినవో నీ అక్రమాలు త్వరలోనే బయట పెడుతామని, నువ్వు సంపాదించిన అక్రమ సొమ్మును ఖచ్చితంగా బయటకు తీస్తామన్నారు. బీఆరెస్‌ నుంచి పోయిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వారిపై అనర్హత వేటుకు బీఆరెస్ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌లోకి పోతున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. వలసలతో బీఆరెస్‌ కార్యకర్తలు అధైర్యపడొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆరెస్సేనని చెప్పారు. రేవంత్‌ రెడ్డి చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు లేదని విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు కేసీఆర్‌ ఇచ్చారని చెప్పారు. 2 లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు.