విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని వరంగల్ జిల్లా కాకతీయుల గడ్డ ములుగు నుంచి పూరించనుంది. ఈనెల 18న కాంగ్రెస్ పార్టీ తొలి విడత బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ కు భారీస్థాయి జన సమీకరణకు స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, శ్రేణులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ తర్వాత తొలిసారి నిర్వహించే సభతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టడంలో ఉన్నారు.
రామప్ప ఆలయ సందర్శన
కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం సాయంత్రం ములుగు చేరుకుంటారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య ములుగు రామప్ప దేవాలయంలో శివుడికి పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ములుగు బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది.
ప్రచార కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ములుగులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క పేరు ఖరారు అయినందున తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా జన సమీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే తొలి సభ కావడంతో అతిరథ, మహారథులంతా పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు రాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, వైస్ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు అంతా పాల్గొనే అవకాశం ఉంది.
ములుగు సెంటిమెంట్ ఫలిస్తుందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరంగల్ జిల్లా ములుగు సెంటిమెంట్ గా మారిందని భావిస్తున్నారు. తాజా ఎన్నికల ప్రచారాన్ని ములుగు నుంచే ప్రారంభించనున్నారు. అయితే ఈ సెంటిమెంట్ ఫలిస్తుందా లేదా అని చర్చ సాగుతోంది. తక్కువ సమయం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సీతక్క జయప్రదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ములుగును కాంగ్రెస్ మూడు రంగుల జెండాలతో అలంకరించే పనిలో ఉన్నారు.
ములుగులో సభ అనంతరం బస్సుయాత్ర ప్రారంభించి భూపాల్ పల్లికి చేరుకుంటారు. భూపాలపల్లిలో రాత్రి ఆరు నుంచి ఏడు గంటల వరకు నిరుద్యోగ యాత్ర నిర్వహించేందుకు కార్యక్రమాన్ని నిర్ణయించారు. ఈ యాత్రలో రాహుల్, ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. రాత్రి అక్కడే బస చేసి ఉదయం రామగుండానికి యాత్ర బయలుదేరి వెళుతుంది. అక్కడి నుంచి పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా నిజామాబాద్ వరకు మూడు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించనున్నారు.