కేసీఆర్‌ను కాపాడేందుకే బీజేపీ సీబీఐ విచారణ డిమాండ్‌: ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి

బీజేపీ మిత్ర పక్షమై బీఆరెస్ అధినేత కేసీఆర్‌ను కాపాడేందుకే బీజేపీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి ఆరోపించారు

కేసీఆర్‌ను కాపాడేందుకే బీజేపీ సీబీఐ విచారణ డిమాండ్‌: ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి

విధాత : బీజేపీ మిత్ర పక్షమై బీఆరెస్ అధినేత కేసీఆర్‌ను కాపాడేందుకే బీజేపీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐ అప్పగించండని బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కల్గుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ ఎలా బీజేపీకి కొమ్ముకాసిందో చూశామని, అందుకు ప్రతిఫలంగా కేసిఆర్‌ను కాపాడాలని బీజేపీ చూస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలు పాలనలో కాళేశ్వరం మీద కేంద్ర బృందాలతో నివేదికలు తీసుకుంటున్నామని, కాళేశ్వరం మీద జ్యుడీషియల్ కమిటీ వేసి.. విచారణకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. కేసిఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కాపాడటం ఎవరి తరం కాదన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు పెట్టు వేధించి పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఎల్ సంతోష్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర లో ఇరికించారని చెబుతున్నారు కదా ఎందుకు నిరూపించలేక పోయారని, ఇక్కడే బీజేపీ చిత్తశుద్ధి అర్ధం అవుతుందన్నారు. బీఆరెస్‌ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకున్నారని, ఇప్పటికైనా బీజేపీ, బీఆరెస్‌ డ్రామాలు అపాలని  హితవు పలికారు.