Mother Dairy Elections | మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్
మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీఆర్ఎస్ అభ్యర్థులు రెండు స్థానాలు గెలిచి, కాంగ్రెస్ ఓటమితో అంతర్గత తగాదాలు బయటపడ్డాయి.

విధాత : మదర్ డెయిరీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హయత్ నగర్ లో జరిగిన మూడు డైరక్టర్ల ఎన్నికల్లో
రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మి నర్సింహా రెడ్డి 154 ఓట్లు, సందిల భాస్కర్ గౌడ్ 240 ఓట్లు సాధించి విజయం సాధించారు. మరో స్థానంలో కర్నాటి జయశ్రీ 176 ఓట్లు సాధించి గెలుపొందారు. అనూహ్య ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్న చైర్మన్లు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డిలు మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిల తీరుపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వివాదం..రభస చోటుచేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బలపరిచిన ప్రవీణ్ రెడ్డి కేవలం 9 ఓట్లు మాత్రమే సాధించి ఓటమి చెందారు.
రెండు జనరల్, ఒక మహిళ డైరక్టర్ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. తొమ్మిది మంది ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఒక జనరల్, ఒక మహిళా స్థానంలో కాంగ్రెస్, మరో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేలా అధికార పార్టీ అంతర్గత ఒప్పందం చేసుకుంది. తన నియోజకవర్గం పరిధిలో తనకు తెలియకుండా మదర్ డెయిరీ డైరక్టర్ ఎన్నికలపై ఒప్పందం చేసుకోవడం ఏమిటంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సొంత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపైన, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డిపై బహిరంగ విమర్శలు చేశారు. నన్ను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ వ్యక్తిని మదర్ డెయిరీ డైరక్టర్ ఎన్నికల్లో వారు మద్దతు ఇవ్వడం సరికాదంటూ సామేల్ మండిపడ్డారు. ఈ వివాదం ఇలా ఉండగానే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవ్వడం..బీఆర్ఎస్ విజయం సాధించడంతో పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా ఉందని పాడి రైతులు చర్చించుకుంటున్నారు.