Urea Shortage : యూరియా కోసం ముగ్గురు పిల్లలతో తల్లి క్యూలైన్..చంటి బిడ్డకు అక్కడే పాలు
యూరియా కొరతతో యాదాద్రిలో ముగ్గురు పిల్లలతో తల్లి క్యూలో నిలిచి, చంటి బిడ్డకు అక్కడే పాలు ఇచ్చిన ఘటన వైరల్.

విధాత : రాష్ట్రంలో యూరియా కొరత సమస్యతో రైతాంగం సతమతమవుతుంది. యూరియా కోసం ఎక్కడ చూసిన రైతన్నల క్యూలైన్లు కనిపిస్తున్నాయి. తెల్లవారింది మొదలు..పొద్దపోయేదాక క్యూలైన్ల దృశ్యాలు ఇప్పుడు రాష్ట్రం అంతటా నిత్యకృత్యమయ్యాయి. పొలం పనులు వదులుకుని..తిండి తిప్పలు మాని రైతులు యూరియా కోసం క్యూలైన్లలో నిలుచుంటే.. మరికొందరి రైతుల భార్యలు, కుటుంబ సభ్యులు క్యూలైన్లలో గంటల తరబడి నిలుచుని ఎదురుచూపులతో అవస్థలు పడుతున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడురులో యూరియా కోసం ఓ రైతు భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి క్యూలైన్ లో నిలుచున్న ఘటన యూరియా కొరత సమస్య తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. తన పిల్లల్లో ఆకలితో ఏడుస్తున్న తన చంటి బిడ్డకు ఆ తల్లి అక్కడే కూర్చుని పాలు ఇచ్చిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
రాష్ట్రంలో యూరియా కొరతకు అంతర్జాతీయ మార్కెట్…కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వేర్వేరు పార్టీల రాజకీయ ఎత్తులు వంటి కారణాలు ఏమున్నప్పటికి దేశానికి అన్నం పెట్టే రైతన్నలను తిప్పలు పెడుతుండటం సరికాదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో వరి ఎక్కువగా పండిస్తున్న విషయం కేంద్రానికి తెలియంది కాదని..అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి యూరియా డిమాండ్ మేరకు సరఫరా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
అటు క్యూలైన్లలో గంటల తరబడి నిలుచున్నప్పటికి ఒకరికి ఒకే బస్తా ఇస్తుండటంతో..భూ రికార్డుల మేరకు కుటుంబ సభ్యులంతా తమ పొలానికి కావాల్సిన యూరియా కోసం క్యూలైన్లలో నిలుచుంటుండటంతో సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ సొసైటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూరియ కోసం అర్ధరాత్రి నుంచి క్యూ కట్టిన రైతులు.. యూరియా తక్కువ రావడంతో క్యూలైన్లు వదిలి ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లారు. ఏడు గ్రామాలకు 277 బస్తాలు రావడంతో రైతన్నలు ఆగ్రహించారు. యూరియా లేక పంటలు ఆగమవుతున్నాయని రైతుల ఆందోళన వెలిబుచ్చారు.