Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్ సాధనకు ఉద్యమం

Kazipet Railway Division | కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా చేయాలనే డిమాండ్ మరోసారి రగులుకుంటోంది. ఎన్నో యేళ్ళుగా ఉన్న ఈ సమస్య తాజాగా తెరపైకి వచ్చింది. తెలంగాణలోని కాజీపేటను రైల్వే డివిజన్చేయకుండా ఆంధ్రా ప్రయోజనాల కోసం కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

  • By: raj |    telangana |    Published on : Apr 05, 2026 6:31 AM IST
Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్ సాధనకు ఉద్యమం

కాజీపేట పట్ల రైల్వే అధికారుల నిర్లక్ష్యం
కేంద్ర నిర్లక్ష్యం పై స్థానికంగా ఆగ్రహం
పెరుగుతున్న రాజకీయ డిమాండ్
ఎన్నో యేళ్ళుగా పెండింగ్ లో సమస్య
అడ్డంకులు కల్పిస్తున్న ఆంధ్ర ఆఫీసర్లు
ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడి: బీఆర్ఎస్

Kazipet Railway Division | విధాత, ప్రత్యేక ప్రతినిధి: కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా చేయాలనే డిమాండ్ మరోసారి రగులుకుంటోంది. ఎన్నో యేళ్ళుగా ఉన్న ఈ సమస్య తాజాగా తెరపైకి వచ్చింది. తెలంగాణలోని కాజీపేటను రైల్వే డివిజన్చేయకుండా ఆంధ్రా ప్రయోజనాల కోసం కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాజీపేట అభివృద్ధికి ఈ ఆంధ్ర అధికారులు ఆటంకం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ కేంద్ డిమాండ్ తో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్ పై ఇప్పటికే నిరసనలు, ఆందోళనలు సాగుతున్నాయి. దీనికి కాజీపేటను డివిజన్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. స్థానికంగా చిరు వ్యాపారులకు సముదాయాలు కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం పై, రైల్వే అధికారుల పై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలు కడియం కావ్య తదితరులు కేంద్ర రైల్వే మంత్రికి, అధికారులకు విన్నవిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే జంక్షన్ డివిజన్ చేయాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే జిఎంకు వినతిపత్రం అందించారు. ఇదిలా ఉండగా ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని పొందుపరిచిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు.

ఆంధ్ర అధికారుల‌ అడ్డంకులు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర అధికారులు పెత్తనం సాగుతోందని రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ డివిజన్ కాకుండా ఆంధ్ర అధికారులు జిఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఇండియన్ రైల్వేకు గుండకాయ లాంటిది ఇక్కడ నుండే అధిక ఆదాయం వస్తున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున కాజీపేట రైల్వే స్టేషన్ డివిజన్ కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. కాజీపేట రైల్వే డివిజన్ అభివృద్ధి, రైల్వే జంక్షన్ ఇప్పటిది కాదని నిజాం కాలం నుంచి ఉంది. రైల్వే పరిధిలో 1500 నుండి 2000 కిలోమీటర్ల ట్రాక్ కు ఒక డివిజన్ ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ కాజీపేటను నిర్లక్ష్యం చేస్తున్నారు. సికింద్రాబాద్ 3,100 కిలోమీటర్లు ఉంది. ఇంత ఎక్కువ గా ట్రాక్ ఉన్నటువంటి సందర్భంలో అధికారులు గానీ, కార్మికులు గానీ ఎంతో మానసిక, శారీరక ఒత్తిడితో పని చేస్తున్నారు. వైజాగ్ లో సౌత్ కొస్టల్ లో ఒక డివిజన్ చేసినప్పుడు,తెలంగాణలో కాజీపేట ను డివిజన్ చేయడానికి అభ్యంతరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. కాజీపేట గుండెకాయ లాంటిదని, సెంట్రల్ రైల్వేలో కాజీపేట జంక్షన్ నుండే అధిక రాబడి వస్తుందని, చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి కాజీపేట జంక్షన్ ను డివిజన్ స్తాయి చేయాలని కోరుతున్నారు.

ఎంపీల ఇండ్లు ముట్టడిస్తాం : వినయ్ భాస్కర్

కాజీపేటను రైల్వే డివిజన్ గా ప్రకటన రాకుంటే జి ఎం కార్యాలయాన్ని, కాంగ్రెస్, బీజేపీ ఎంపీల ఇండ్లను ముట్టిడిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ హమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రకటించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించకపోతే, కాజీపేటలో డివిజన్ గా ప్రకటన చేయకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు.