బీఆర్ఎస్ పాలకులు ఫోన్ ట్యాపింగ్ తో తెలంగాణ ప్రజల స్వేచ్చను హరించి చాల పెద్ద తప్పు చేశారని, అటువంటీ దుర్మార్గాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్పడం బంద్ చేయాలని, ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అధికారులు పిలిచారని, జూలై 2023లో నా ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు నాకు తెలిపారని వెల్లడించారు. నేను అప్పుడు టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ గా ఉన్నానని, నాటి పీసీసీ చీఫ్, నేటి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నానని, హార్డ్ డిస్క్ ఆధారంగా నా ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు చెప్పారని తెలిపారు. రేవంత్ రెడ్డి టీమ్ సభ్యునిగా అప్పటి పాలకులు నా ఫోన్ ట్యాప్ చేయించారని, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేశారని చామల ఆరోపించారు.
ఇంట్లో వాళ్ళ ఫోన్లను కూడా బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ చేశారని, హరీష్ రావు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారని, హరీష్ రావు తన డ్రైవర్, పీఏను మార్చుకున్నారని, కవిత తన ఫోన్ ట్యాప్ అయినట్లు ఓపెన్ గా చెప్పారన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు అని,
స్వంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి,ఈటెల రాజేందర్, బండి సంజయ్,చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక లెక్కనా అని చామల అన్నారు. తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా ఇష్టారాజ్యంగా బీఆర్ఎస్ పాలకులు ఫోన్ ట్యాపింగ్ చేశారని, సిట్ అధికారులు చెప్పింది ప్రజలు వింటే ఆశ్చర్యపోతారని, వేల ఫోన్లు ట్యాప్ చేశారని, ప్రయివేటు సంభాషణలను సైతం విన్నారని, వ్యాపారవేత్తలు,మీడియా అధినేతలు,సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని చామల గుర్తు చేశారు.
2018లో 88 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా.. ఫోన్లు ట్యాప్ చేసి వినడంతో చివరకు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో కూడా కేసీఆర్ కు అర్ధం కాలేదని ఆరోపించారు. కేసీఆర్ అన్ని వ్యవస్థలను వాడుకుని ఎప్పటికీ అధికారంలో తానే ఉండాలని అనుకున్నారన్నారు. అధికారం పోయే సరికి ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారని, ఇప్పుడు కేటీఆర్ రోడ్డు ఎక్కారు అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలకులు అధికారంలో ఉండి వేలకోట్లు దోచుకుని.. మిగులు రాష్ట్రాన్ని మాత్రం అప్పుల పాలు చేశారని మండిపడ్డారు.
