Srisailam Reservoir| శ్రీశైలం జలాశయానికి కొత్త క్రస్ట్ గేట్లు పెట్టాలి: గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు

విధాత : శ్రీశైలం జలాశయానికి రానున్న ఐదేళ్లలో కొత్త రేడియల్ క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయాలని..కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు హెచ్చరించారు. ఆదివారం కన్నయ్య నాయుడు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లను పరిశీలించారు. గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేస్తుండాలని..మెయింటెనెన్స్ ప్రస్తుతం బాగుందన్నారు. పదో నెంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఇబ్బంది ఏమీ లేదన్నారు. గేటు నుంచి లీకేజీ 10 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. జలాశయం నుండి 60 మీటర్ల దూరంలో ఫ్లంజ్ పూల్ ల్ ఏర్పడిందని..దీంతో శ్రీశైలం జలాశయానికి ప్రమాదం లేదని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు.
నీటి విడుదలకు అవకాశం
శ్రీశైలం జలశయానికి ఎగువ నుంచి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో రేపో ఎల్లుండో గేట్లు ఎత్తే అవకాశముంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో : 1,71,208 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 67,399 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు. ప్రస్తుతం : 878.40 అడుగులు. పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు గా ఉంది. ప్రస్తుతం : 179.8995 టీఎంసీలు నీటీ మట్టం కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.