మా మున్సిపాలిటీలు ‘గ్రేటర్‌’లో కలపండి!…చుట్టుపక్కల ప్రాంతాల్లో  పెరుగుతున్న డిమాండ్‌

గ్రేటర్ హైదరాబాద్‌ నగర శివారు ప్రజలు నిన్న మొన్నటి వరకు గ్రామ పంచాయతీ లేదంటే మునిసిపాలిటీ పరిధిలో తమ ప్రాంతం ఉంటే చాలు అనుకున్నారు. కానీ నానాటికీ మౌలిక సదుపాయాలు దిగజారుతుండటం, నిర్వహణ లోపించడం, అక్రమ కట్టడాలు లెక్కలేకుండా వెలుస్తుండడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో కలపాలనే డిమాండ్ మొదలు పెట్టారు

మా మున్సిపాలిటీలు ‘గ్రేటర్‌’లో కలపండి!…చుట్టుపక్కల ప్రాంతాల్లో  పెరుగుతున్న డిమాండ్‌
  • మా మున్సిపాలిటీలు ‘గ్రేటర్‌’లో కలపండి
  • అనేక ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్త
  • మురుగునీటి పైపులైన్ల వ్యవస్థ అస్తవ్యస్తం
  • దిగజారుతున్న మౌలిక సదుపాయాలు
  • యథేచ్ఛగా వెలుస్తున్న అక్రమ కట్టడాలు
  • ఇబ్బడిముబ్బడిగా బహుళ అంతస్థులు
  • ఫలితంగా కాలనీల్లో విపరీతంగా రద్దీ
  • తగిన స్థాయిలో లేని సీవరేజీ ఏర్పాట్లు
  • గ్రేటర్‌లో కలిస్తే సమస్యలకు పరిష్కారం
  • పన్నులు పెరిగినా ఫర్లేదంటున్న స్థానికులు
  • అగ్రభాగాన నార్సింగి, మణికొండ ప్రజలు

హైదరాబాద్, సెప్టెంబర్ 19: (విధాత): గ్రేటర్ హైదరాబాద్‌ నగర శివారు ప్రజలు నిన్న మొన్నటి వరకు గ్రామ పంచాయతీ లేదంటే మునిసిపాలిటీ పరిధిలో తమ ప్రాంతం ఉంటే చాలు అనుకున్నారు. కానీ నానాటికీ మౌలిక సదుపాయాలు దిగజారుతుండటం, నిర్వహణ లోపించడం, అక్రమ కట్టడాలు లెక్కలేకుండా వెలుస్తుండడంతో ప్రజల్లో ఇప్పుడిప్పుడే మెలుకువ మొదలైంది. నార్సింగి, మణికొండ ప్రజలు తమ మునిసిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో కలపాలనే డిమాండ్ మొదలు పెట్టారు. పన్నులు పెరుగుతాయని తెలిసినప్పటికీ పౌరులు ఏమాత్రం వెనకంజ వేయకపోవడం గమనార్హం. గ్రేటర్‌లో కలిస్తే.. రోడ్లు, మురుగునీటి పైపులైన్లు, వరదనీటి కాలువలు, వీధి దీపాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలు పరిష్కారం కావడంతో పాటు అక్రమ కట్టడాలపై నియంత్రణ ఉంటుందని వివిధ కాలనీల సంఘాలు అంటున్నాయి. పలు చోట్ల ఇరవై అడుగులు వెడల్పు ఉన్న రోడ్డులో కూడా సెట్ బ్యాక్‌లు ఏమాత్రం వదిలేయకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకు ముగింపు లభిస్తుండడమే విలీన డిమాండ్‌కు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ముందస్తు ఆలోచనతోనే మేజర్ పంచాయతీల స్థాయి పెంపు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019 సంవత్సరంలో జీహెచ్ఎంసీ చూట్టూ ఉన్న మునిసిపాలిటీలను 6 కార్పొరేషన్లుగా స్థాయి పెంచింది. జనాభా తక్కువ ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలను 20 మునిసిపాలిటీలుగా 2018లో మార్చింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకువచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో అదే తీరున ఈ మునిసిపాలిటీలలో ఉండే విధంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజాంపేట, బోడుప్పల్ వంటి మునిసిపాలిటీలలో ఇరుకైన రోడ్ల మూలంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయంటూ స్థానిక ప్రజా ప్రతినిధుల వినతులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నది. ఔటర్ పరిధి లోపల మొత్తం 2,100 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. అప్పట్లో రెండు గ్రేటర్ కార్పొరేషన్లు చేసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రాధమ్యాలు మారిపోయాయి. పాత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ను రెండుగా విభజించారు. ఇంతకు ముందు ఈ రెండింటికీ ఒక్కరే ముఖ్య కార్యదర్శి ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రీజినల్ రింగ్ రోడ్డు వరకు అర్బన్ డెవలప్‌మెంట్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. ట్రిపుల్ ఆర్ దాటి ఉన్న ప్రాంతాలను మునిసిపల్ శాఖలోకి మార్చారు. రెండు విభాగాలకు సంబంధం లేకుండా చేశారు. అర్బన్ డెవలప్‌మెంట్‌ విభాగాన్ని తన వద్ద పెట్టుకుని మునిసిపల్ శాఖను కొత్తగా వచ్చే మంత్రులకు అప్పగించాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తున్నది. అందులో భాగంగానే ఇలంబరితికి అర్బన్ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారని సమాచారం. హెచ్ఎండీఏ, మెట్రో వాటర్ సప్లయి బోర్డు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌తోపాటు నగరం చుట్టూ ఉన్న ఆరు కార్పొరేషన్లు, 20 మునిసిపాలిటీలు ఈయన ఆధ్వర్యంలోకి వస్తాయి. ఈ మునిసిపాలిటీల పాలక వర్గాల గడువు ఈ డిసెంబర్‌తో ముగియనున్నది. ఆరు కార్పొరేషన్ల గడువు దాదాపు ముగియగా, గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం సమయం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనున్నది.

నార్సింగి, మణికొండలో ఊపందుకున్న డిమాండ్
గచ్చిబౌలి, నానక్‌రాం గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటం నార్సింగి, మణికొండ మునిసిపాలిటీలకు కలిసి వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో గత నాలుగైదు సంవత్సరాలుగా బహుళ అంతస్తుల భవనాలు, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. కనీసం ఇరవై అంతస్తులకు తక్కువ కాకుండా నిర్మాణాలు చేపట్టారు. ఐటీ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసే వారికి సమీపంలో ఉండటంతో పలువురు ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వాటిలో అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఫలితంగా విపరీతమైన రద్దీ పెరిగి సమస్యలకు నిలయాలుగా రూపాంతరం చెందాయి ఈ ప్రాంతాలు. అయితే ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు పనిచేయకపోవడం వంటి సమస్యలను ప్రతినిత్యం ఎదుర్కొంటున్నారు. గుంతలు పడిన రోడ్లను కూడా బాగు చేయకపోవడం పలువురిని ఆలోచనలో పడేసింది. మునిసిపాలిటీ కావడంతో సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారిణి మణి హారిక ఎల్ఆర్ఎస్ పని పూర్తి చేసేందుకు ఒక యజమాని నుంచి రూ.4 లక్షలు అడ్వాన్స్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈమె పై స్థానికులకు కూడా ఏమాత్రం సదాభిప్రాయం లేదని తెలుస్తున్నది. డబ్బులు తీసుకోవడం అనుమతులు ఇవ్వడం పనిగా పెట్టుకుందని, కోట్ల రూపాయలు వెనకేసిందని చెబుతున్నారు. మౌలిక సదుపాయాలు ఏమాత్రం బాగాలేకపోవడంతో విసుగు చెందిన నార్సింగి, మణికొండ ప్రజలు తమ ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్‌లో కలపాలంటూ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరైతే స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ను కలిసి గ్రేటర్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తుండం విశేషం.