Warangal | ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి : న్యూ‌డెమొక్రసీ

ఈనెల 18 19 తేదీలలో మారేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూ‌డెమొక్రసీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు శనివారం వరంగల్ కాశిబుగ్గ జంక్షన్ లో ధర్నా చేశారు.

Warangal | ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి : న్యూ‌డెమొక్రసీ

విధాత, వరంగల్ :
ఈనెల 18 19 తేదీలలో మారేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూ‌డెమొక్రసీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు శనివారం వరంగల్ కాశిబుగ్గ జంక్షన్ లో ధర్నా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కేంద్రంలోని మోడీ అమిత్ షా ల ప్రభుత్వం మధ్య భారతంలో హత్యాకాండ చేస్తున్నదని వారు విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం కలిసి నిరాయుధులుగా ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులు హిడ్మా, టెక్ శంకర్ తో పాటు 13 మందిని ఆంధ్రప్రదేశ్లో అరెస్టు చేసి మారేడుమిల్లి అడవుల్లో బూటకపు ఎన్‌కౌంటర్లో చంపివేశారని వారు ఆరోపించారు.

అడవి ప్రాంతంలో ఉన్న ఖనిజ సహజ సంపదలను సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థలకు దేశ బడా కార్పొరేట్లకు అప్పగించడం కోసమే ఈ నరమేధాన్ని చేస్తున్నదని వారన్నారు. రాజ్యాంగం లోని 5,6వ షెడ్యూల్ లను ను ఉల్లంఘించి ఆదివాసి హక్కులను హరించి ఈ దారుణానికి పాల్పడుతున్నదని విమర్శించారు. ఆపరేషన్ కగార్ ను ఆపేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమాక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి గంగుల దయాకర్, గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు, ఐఎఫ్‌టీయూ జిల్లా సహాయ కార్యదర్శి బండి కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేష్, పీవై‌ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు గండ్రతి హరిబాబు, కరుణాకర్, చేరాలు, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.