చెరుకు రైతులకు శుభవార్త.. త్వ‌ర‌లో తెరుచుకోనున్న నిజాం షుగ‌ర్ ఫ్యాక్ట‌రీలు

రాష్ట్రంలో మూత పడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు త్వరలోనే తెరుచుకోనున్నాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి

చెరుకు రైతులకు శుభవార్త.. త్వ‌ర‌లో తెరుచుకోనున్న నిజాం షుగ‌ర్ ఫ్యాక్ట‌రీలు
  • బ‌కాయిల చెల్లింపుల‌కు రూ. 43 కోట్లు విడుద‌ల‌
  • ఓటీఎస్ కింద చెల్లింపుల‌కు అనుమ‌తించిన బ్యాంకులు
  • సీఎం రేవంత్ హామీ మేర‌కు సెప్టెంబ‌ర్‌17 లోగా ఫ్యాక్ట‌రీల పున‌రుద్ధ‌ర‌ణ‌

విధాత‌: రాష్ట్రంలో మూత పడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు త్వరలోనే తెరుచుకోనున్నాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్ ( ఓటీఎస్‌) కింద చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపింది. అందుకు బ్యాంకర్లు సమ్మతించటంతో ఫ్యాక్టరీల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.43 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర పరిశ్రమలను తెరిపించేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మూతపడ్డ చక్కెర పరిశ్రమల పునరుద్ధరణకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో జనవరిలోనే మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై ఈ కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపింది.

బకాయిల చెల్లింపులకు వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం ఇవ్వాలని బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపింది. సెప్టెంబర్ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్లను విడుదల చేయటంతో త్వరలోనే మూత పడ్డ చక్కెర ఫ్యాక్టరీలు తెరిచేందుకు మార్గం సుగమమైంది.