Congress Govt | ఎమ్మెల్యేలూ కళ్ళు తెరవండి! అధికారం ఉన్నా అభివృద్ధి శూన్యం
Congress Govt | అభివృద్ధిలో ఉమ్మడి పాలమూరు జిల్లా దగాకు గురైంది. బీ ఆర్ ఎస్ పదేళ్ల కాలంలో అంతంత మాత్రంగా జరిగిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లా మరింత వెనుకబాటుకు గురవుతోంది. ఎక్కడి ప్రాజెక్టు పనులు అక్కడే నిలిచి పోయాయి. ఎత్తిపోతల పథకాలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ను ప్రభుత్వం విస్మరించింది.

– ఎక్కడ వేసిన గొంగళ్లలా నియోజకవర్గాలు
– నిధుల కేటాయింపులు లేక సమస్యల తిష్ట
– చిన్న పనులకూ చేతిలో చిల్లి గవ్వాలేని ఎమ్మెల్యేలు
– కాంగ్రెస్ ప్రతినిధులపై పెదవి విరుస్తున్న ప్రజలు
– నిధులు లేక మూలనపడ్డ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు
– గ్రహణం వీడని గట్టు ఎత్తిపోతల పథకం.. భూసేకరణకు నోచుకోని నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్
Congress Govt | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : అభివృద్ధిలో ఉమ్మడి పాలమూరు జిల్లా దగాకు గురైంది. బీ ఆర్ ఎస్ పదేళ్ల కాలంలో అంతంత మాత్రంగా జరిగిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లా మరింత వెనుకబాటుకు గురవుతోంది. ఎక్కడి ప్రాజెక్టు పనులు అక్కడే నిలిచి పోయాయి. ఎత్తిపోతల పథకాలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ను ప్రభుత్వం విస్మరించింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో లిఫ్ట్ పనులను చేపట్టి ఎక్కడికక్కడ వదిలేసింది. గులాబీ పార్టీ అధికారంలో ఉంటే పాలమూరు జిల్లా అభివృద్ధి చెందదని అనుకున్న జిల్లా ప్రజలు ఆ పార్టీ నేతలకు కర్రు కాల్చివాతపెట్టారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ నేతలకు రెండు స్థానాలకే పరిమితమయ్యారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే గులాబీ వికసించింది. మిగతా 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారు. 12 మంది కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే గెలుపొందడంతో వెనుకబడిన జిల్లా అభివృద్ధి లో రాకెట్ లా దూసుకు పోతుందని అందరూ భావించారు. జిల్లా కు రేవంత్ రెడ్డి సీఎం కావడం కూడా జిల్లా అభివృద్ధి కి కలిసి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఆశలు తలకిందులయ్యాయి. ఎంతో అభివృద్ధి జరుగుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రజా పాలన అని అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకపాలనగా తయారైంది.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి రెండేళ్లకు దగ్గరవుతోంది. అయినా అభివృద్ధిలో మాత్రం ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో జిల్లాకు చెందిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధిని పట్టించు కోకుండా పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్తున్నారని, అభివృద్ధిలో మాత్రం జిల్లా ను పూర్తి గా పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా ప్రజలు ఎంతో నమ్మకం తో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లను గెలిపిస్తే అభివృద్ధి చేయడం లో గళం ఎత్తడం లేదనే విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రభుత్వం జిల్ ల కు నిధులు కేటాయించడం లేదని, అభివృద్ధి చేయక ప్రజల్లో చులకన భావనతో ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే లు బాహాటంగా తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. జిల్లా కు నిధులు ఇవ్వడంలో పక్షపాతం చూపిస్తున్నారని పార్టీ సొంత ఎమ్మెల్యే లే ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే లు అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావడానికి నెల సమయం మాత్రమే ఉన్నా ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పే పరిస్థితి లో వారు లేరు. నిధుల కోసం పోరాడాల్సిన ఎమ్మెల్యే లు మౌనంగా ఉండడం తో ఉమ్మడి పాలమూరు జిల్లా కరువు ప్రాంతంగా మిగిలిపోయే ప్రమాదం ఎంతో దూరం లో లేదనిపిస్తోంది.
ప్రాజెక్టులు వెక్కిరిస్తున్నాయి
జిల్లా కు సాగునీరందించే ప్రాజెక్టులు ఎక్కడికక్కడే మూలన పడ్డాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నిలిచి పోయాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ అరకొర పనులు చేసి మమ అనిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా ప్రాజెక్టు పెండింగ్ పనులు చేపట్టేందుకు పైసా కూడా విదిలించలేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తాము అధికారం లోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలికారు. వారు గెలిచి ఇంత కాలం అయినా ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి తీయలేదు. దీంతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుతం మరుగున పడిపోయింది. ఈ ప్రాజెక్టు పరిధి లో కొల్లాపూర్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాలు ఉన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గాని కి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం పై ఏనాడు పెదవి విప్పలేదు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే లు కూడా ఈ ప్రాజెక్టు పై దృష్టి పెట్టలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ప్రభుత్వం వద్ద ఎన్నడు తమ గళం విప్పలేదు. ఒక్క జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని నిలదీస్తున్నారు. అయినా ప్రభుత్వం లో చలనం కనిపించడం లేదు.
ఆగిపోయిన నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్
నారాయణ పేట, కొడంగల్ లిఫ్ట్ పనులు భూ సేకరణ వద్దే ఆగిపోయింది. వెంటనే భూసేకరణ చేసి రైతులకు పరిహారం ఇచ్చి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా ఫలితం లేదు. భూములు ఇవ్వమని రైతులు అంటున్నా అధికారులు వారిని సంప్రదించి ఒప్పించే ప్రయత్నం జరగడం లేదనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో మక్తల్, నారాయణ పేట, కొడంగల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొడంగల్ నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఉండగా, మక్తల్ నియోజకవర్గం నుంచి మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. నారాయణ పేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినా ఈ ప్రాజెక్టు పనులు వీరికి పట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదు. గద్వాల నియోజకవర్గంలో గట్టు ఎత్తిపోతల పథకం మరుగున పడిపోయింది. ఇక్కడి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కూడా ఈ ఎత్తిపోతల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా గట్టు ఎత్తిపోతల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు, వీరిద్దరూ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు అయినా ప్రాజెక్టు పనుల పూర్తి కి ప్రభుత్వం పై ఒత్తిడి చేయడంలో పూర్తి గా విఫలం చెందారు. మిగతా దేవరకద్ర, అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యే లు కూడా జిల్లా లో పెండింగ్ ప్రాజెక్టు ల గురించి గళం ఎత్తిన దాఖలాలు లేవు. ఇవే కాక నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని అడిడే దైర్యం కూడా ఎమ్మెల్యేలు చేయడం లేదు. సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ళు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పనులు మాత్రమే చేస్తున్నారు తప్పా శాశ్వత పనులు చేపట్టడం లో విఫలం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గాల అభివృద్ధి కోసం రూ. 25 కోట్లు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని ఒక్క జడ్చర్ల ఎమ్మెల్యే మాత్రమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అధికారం మూడేళ్లు మాత్రమే ఉంది. ఈ రెండేళ్ల కాలంలో చూపెట్టిన పనితీరులా ఉంటే 2027 అసెంబ్లీ ఎన్నికల వరకు పనితీరు మార్చుకోకుంటే….2023 లో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే లకు పట్టిన గతే కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు పట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కు చెందిన ఎమ్మెల్యే లు ఇకనైనా కళ్ళు తెరిచి అభివృద్ధి పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.