NPDCL Real Time Feeder Monitoring System | ఎన్పీడీసీఎల్‌ పరిధిలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం

ఎన్పీడీసీఎల్‌లో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు. విద్యుత్ సరఫరా మెరుగుదలకు, సత్వర సేవలకు సాంకేతిక నూతనతతో ముందడుగు.

NPDCL Real Time Feeder Monitoring System | ఎన్పీడీసీఎల్‌ పరిధిలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం

విధాత, ప్రత్యేక ప్రతినిధి: వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి సాంకేతికతను అందిపుచ్చుకొని రియల్ టైం ఫీడర్  మానిటరింగ్ సిస్టం (RTFMS) ను ఎన్పీడీసీఎల్‌లోని 16 సర్కిళ్లలో ఏర్పాటు చేశామని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. దేశములోనే ఆధునాతన టెక్నాలజీ అయిన RTFMS‌ను ఎన్పీడీసీఎల్‌లో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇందులో రియల్ టైంలో కచ్చితమైన సమాచారం పొందగలుగుతామని, తద్వారా వేగవంతంగా చర్యలు చేపట్టవచ్చని, ఫీడర్ల పర్యవేక్షణ, త్వరితగతిన ప్రతిస్పందించడం ద్వారా అంతరాయాలు గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. టెక్నికల్ టీం సభ్యులు ఆరు రాష్ట్రాలలో ఈ సాంకేతికతను అధ్యయనం చేసిన తర్వాత ఎంచుకున్నామని చెప్పారు. ఒడిశా రాష్ట్రంలో ఈ టెక్నాలజీ వాడుతున్నారని తెలిపారు.

ఎన్పీడీసీఎల్‌కు అనుగుణంగా ఈ టెక్నాలజీ సరిపడేలా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ఈ ఆధునాతన టెక్నాలజీ ఎన్పీడీసీఎల్‌కు ఉపయోగకరంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే, ముందుగా ఐదు సబ్‌స్టేషన్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగిందని తెలిపారు. ఈ ఐదు సబ్‌స్టేషన్లు స్కాడాకు అనుసంధానం అయిన తర్వాత, వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మిగతా 133 సబ్‌స్టేషన్లకు అనుసంధానించడం జరిగిందని వివరించారు.

మిగిలిన సబ్‌స్టేషన్ పనులు చురుకుగా సాగుతున్నాయని, లక్ష్యాలను సాధించే దిశగా ఇంజనీర్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని సబ్‌స్టేషన్లకు అవసరానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ప్రభావవంతంగా నిరూపితమైన సమాచార సాంకేతికత రూపొందించామని చెప్పారు.

వరంగల్ హెడ్‌క్వార్టర్స్‌లో స్కాడాకు సబ్‌స్టేషన్ల కొరకు కొత్త సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త సబ్‌స్టేషన్లను దృష్టిలో ఉంచుకొని రాబోయే 15 సంవత్సరాలకు సంబంధించి సాఫ్ట్‌వేర్ పరంగా సర్వర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (RTFMS) ప్రయోజనాలు:

1. ఈ సాంకేతికత వలన స్కాడా కంట్రోల్ రూమ్ నుండి నిర్వహించవచ్చు.
2. రియల్ టైంలో విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్ సిబ్బందికి తెలియజేసి, అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం.
3. ఓవర్‌లోడ్ హెచ్చరికలను ఫీల్డ్ సిబ్బందికి రియల్ టైంలో తెలియజేయడం.
4. విద్యుత్ వినియోగం, వోల్టేజ్ లెవెల్స్ మొదలైన వివరాలను రియల్ టైంలో సేకరించడం.
కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని వేగవంతంగా విద్యుత్ సమస్యలను పరిష్కరించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (RTFMS) ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.

ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు (FPIs):

దీనికి అనుసంధానంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలో 33KV మరియు 11KV సుదూర లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు (FPIs) పెడుతున్నామని చెప్పారు. బ్రేక్‌డౌన్ సమయంలో, ప్రకృతి వైపరీత్యాలు లేదా సాంకేతిక కారణాల వలన లైన్ మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా, విద్యుత్ అంతరాయం ఏర్పడిన భాగాన్ని ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ గుర్తిస్తుంది.
తద్వారా అంతరాయం ఏ భాగంలో జరిగిందో వెంటనే విశ్లేషించి, అక్కడికే వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఫాల్ట్‌ను త్వరగా గుర్తించడంలో, విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించడంలో FPIs ఎంతో దోహదపడుతున్నాయని వివరించారు. 33, 11 కెవి ఫీడర్లలో 2500 ప్రదేశాల్లో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల ప్రయోజనాలు:

i) FPI విద్యుత్ సమస్యను, సమాచారాన్ని, స్థానాన్ని వేగంగా గుర్తించి కంట్రోల్ సెంటర్‌కి తెలియజేస్తుంది.
ii) సంబంధిత ఫీల్డ్ సిబ్బందికి SMS హెచ్చరికలు పంపబడతాయి. అదేవిధంగా, FPI ద్వారా ఆ ప్రదేశంలో ఫ్లాష్ లైట్ సూచన కూడా కనిపిస్తుంది.
iii) ఫీల్డ్ సిబ్బంది మొత్తం లైన్‌లో పెట్రోలింగ్ చేయకుండా నేరుగా సమస్య ఉన్న భాగాన్ని గుర్తించగలరు. దీని వలన ఫాల్ట్ డిటెక్షన్, పునరుద్ధరణ సమయం ఆదా అవుతుంది.

వినియోగదారులకు అందుబాటులో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ (AMR):

హెచ్‌టీ విద్యుత్ వినియోగదారులకు బిల్లుల అందజేతలో వేగం, పారదర్శకత పెంచేందుకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ (AMR) వ్యవస్థను రూపొందించామని తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు మాన్యువల్ బిల్లింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు AMR విధానం ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా సర్కిల్‌లో అధిక సామర్థ్యంతో విద్యుత్ వినియోగించే పరిశ్రమలకు వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

AMR ప్రయోజనాలు:

ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ విధానం వలన తప్పులు జరిగే అవకాశం ఉండదని, విద్యుత్ సరఫరాలో వచ్చే హెచ్చుతగ్గులను త్వరితగతిన గుర్తించవచ్చని తెలిపారు. సిబ్బంది సమయం వృథా కాదని పేర్కొన్నారు.