Inter Exams | 5 నిమిషాలు ఆల‌స్య‌మైనా.. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తి

Inter Exams | ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రేప‌ట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం వార్షిక ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇంట‌ర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • By: raj |    telangana |    Published on : Feb 24, 2026 9:12 AM IST
Inter Exams | 5 నిమిషాలు ఆల‌స్య‌మైనా.. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తి

Inter Exams | ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రేప‌ట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం వార్షిక ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇంట‌ర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్ బోర్డు సెక్ర‌ట‌రీ కృష్ణ ఆదిత్య మీడియాతో మాట్లాడారు.

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు అర గంట ముందే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని సూచించారు. ఐదు నిమిషాలు ఆల‌స్య‌మైనా ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఐదు నిమిషాలు ఆల‌స్య‌మైనా అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

ఈ ఏడాది ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 9,97,075 మంది హాజ‌రు కానున్న‌ట్లు తెలిపారు. ఇందులో 4,89,126 మంది ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం, 5,07,949 మంది ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు హాజ‌రవుతారు. ఈ నెల 25 నుంచి మార్చి 18వ తేదీ వ‌ర‌కు కొన‌సాగే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1495 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. 28,500 మంది ఇన్విజిలేట‌ర్లు విధుల్లో ఉంటార‌ని తెలిపారు. 1495 మంది చొప్పున చీఫ్ సూప‌రింటెండెండ్లు, డిపార్ట్‌మెంట‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియమించిన‌ట్లు పేర్కొన్నారు. 75 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ప‌రీక్ష‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని చెప్పారు.

ప్రిన్సిప‌ల్ సంత‌కం లేకున్నా అనుమ‌తించాలి..

ఇంట‌ర్ పరీక్ష హాల్ టికెట్ల‌పై ప్రిన్సిప‌ల్ సంత‌కం లేకున్నా అనుమ‌తించాల‌ని సెక్ర‌ట‌రీ కృష్ణ ఆదిత్య అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల‌ను ఎలాంటి ఇబ్బందుల‌కు గురి చేయొద్ద‌ని సూచించారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామ‌ని, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో 040-24655027, 9240205555 నంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌న్నారు.

ఫిబ్ర‌వ‌రి 26 నుంచి మూల్యాంక‌నం

ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ నుంచే ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను మూల్యాంక‌నం చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. 20 స్పాట్ ఎవాల్యుయేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. తొలుత సంస్కృత ప్ర‌శ్న‌ప‌త్రాల మూల్యాంక‌నం ప్రారంభిస్తామ‌న్నారు.