Suryapet : 5నెలలుగా జీతాలు అందక..మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యా యత్నం
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి 5 నెలల జీతాల లేక ఆత్మహత్య యత్నం, పరిస్థితి విషమంగా ఉంది.

విధాత, సూర్యాపేట: సూర్యాపేట జనరల్ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బచ్చలకూరి మధుసూదన్ లైజల్ రసాయనం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. 5 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది బిక్షాటన తో నిరసన నిర్వహించిన రోజునే మధుసూధన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడటం గమనార్హం. అతని కుటుంబానికి ఖర్చుల కోసం డబ్బులు లేవని..నలుగురు పిల్లలని, తిండికి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు కన్నీళ్లతో మీడియాకు వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ జీతాలను చెల్లిస్తే పండుగను ప్రశాంతంగా జరుపుకుంటామని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించడంతో దవాఖానలో రోగులకు వైద్య సేవల నిలిచిపోయాయి.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల విషయమై కొత్త ఏజెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేయాలా లేక పాత ఏజెన్సీనే ఉంచాలా…? అనే విషయంపై జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోకపోవడంతో జీతాలు అందక ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని సహచర సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలంటూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రోడ్డుమీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇటీవలే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క శాఖ పరిధిలోని పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రతి నెలా జీతాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలు వెంటాడటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సోమిరెడ్డి రైలుకు ఎదురెళ్లి చనిపోయాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సోమిరెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. బలవన్మరణానికి పాల్పడిన సోమిరెడ్డి వాట్సప్ మెస్సేజ్ ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింప చేస్తోంది. ఈ ఘటన మరువకముందే ఇదే జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మధుసూధన్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది.