నయవంచకుడు రామగుండం ఎమ్మెల్యే: కాంగ్రెస్ నేత ఎల్లయ్య

  • Publish Date - October 17, 2023 / 12:13 PM IST
  • మున్సిపల్ ఎన్నికల్లో బ్రోకర్లకు టిక్కెట్లు ఇచ్చారు
  • కాంగ్రెస్ నేత పాతిపెల్లి ఎల్లయ్య


విధాత, పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో బ్రోకర్లు, మాఫీయా ముఠా, జెండా పట్టనోళ్లు, దోచుకున్నోళ్లకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టిక్కెట్లు ఇచ్చిన నయవంచకుడని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య ఘాటుగా ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడటంతో ఎంతోమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.


రామగుండంలో బీఆరెస్ నాయకత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కు విన్నవించినా అధిష్టానం పట్టించుకో లేదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. కార్మికుడి బిడ్డగా ఆదరించాలని ప్రజలను కోరి, చందాలు వేసుకుని ఎమ్మెల్యేగా గెలిపించామన్నారు.


నిస్వార్థంగా సొంత ఖర్చులతో గెలిపించిన తనపైనే కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు. తన కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులు, రాజకీయ ఒత్తిడిలకు గురి చేస్తూ కేసులు పెట్టడాన్ని తట్టుకోలేక బీఆరెస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. బీఆరెస్ అవినీతిపరులకు టికెట్ ఇచ్చి, బీఫామ్ అందించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అవినీతిపరులను ఓడిస్తారని తెలిపారు.