- హనుమకొండలోని కొన్ని పంప్ ల్లో ‘ నో స్టాకు’ బోర్డు
- ప్రభుత్వ ప్రకటనలు పట్టించుకోని ప్రజలు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Petrol Rush | ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగ్గిపోయాయనే ప్రచారం హైదరాబాద్ నుంచి వరంగల్ వరంగల్ నగరానికి చేరింది. ఇంకేముంది, రేపు పెట్రోల్, డీజిల్ దొరకకపోతే ఎట్లా? అనే ఆందోళనతో పొలోమంటూ వాహనదారులు పెట్రోల్ బంకులకు చేరుకుని క్యూ కట్టారు. ఒకరి చూసి మరొకరు అన్నట్లు వందల సంఖ్యలో చేరుకున్న వాహనదారులతో పెట్రోల్ పంపులు కిటకిటలాడుతున్నాయి. సాధారణ సమయంలో అర లీటరు పెట్రోల్ కొట్టించుకునేందుకు ఆలోచించేవారుసైతం అప్పోసప్పో చేసి ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటున్నారు. కొందరైతే బండి ట్యాంకు ఫుల్ చేయించుకుంటూనే పనిలోపనిగా క్యాన్లలో నింపుకొని భద్రపరుచుకుంటున్నారు.
రెండు నెలల వరకు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఎవరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదని ఒక వైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పెట్రోల్ పంపు యజమానుల అసోసియేషన్, అయిల్ కంపెనీల డీలర్లు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా జనం పంపుల వద్దకు చేరుకుంటున్నారు. ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా కాసింత ఎక్కువ పెట్రోల్ కొట్టించుకుంటే పోయేదేముందంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
అవసరం ఉన్నా…లేకున్నా ఎక్కువ మొత్తంలో పెట్రోల్ కొట్టించుకోవడంతో పంపుల్లో స్టాక్ తగ్గిపోతోంది. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్దనున్న పంప్లో ఈ తాకిడితో నో స్టాకు బోర్డు పెట్టారు. పోలిస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న పంప్ వద్ద వాహనదారులు బారులు తీరారు. ఈ క్యూలైన్లూ, నో స్టాకులతో వాహనదారుల్లో ఆందోళన పెరిగిపోయి ముందు జాగ్రత్తగా అవసరం ఉన్నాలేకున్నా పెట్రోల్ పోయించుకోవడంతో కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం నెలకొంది. నిజమైన వినియోగదారునికి పెట్రోల్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంటోంది. ప్రచారమైనా అందరిని కలవరపరుస్తోంది.
