మోదీ రాక సందర్భంగా బీసీల నిరసన జెండా!

రాష్ట్ర బీజేపీ నాయకులు సమరోత్సాహంతో మోదీకి ఘన స్వాగతం పలుకాలని భావిస్తుండగా అఖిలపక్ష నేతలు, బీసీ సంఘాలు నిరసనకు సిద్ధం కావడం గమనార్హం. బీసీ ప్రధాని, బీసీ సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందంటూ ఆ పార్టీ నేతలు పదేపదే చేస్తున్న ప్రకటనలు, మాటలను నిలదీస్తూ రాజకీయ పక్షాలు నిరసనకు సిద్ధమవుతున్నారు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో నిరసన జెండాలెత్తేందుకు అఖిలపక్ష రాజకీయ నేతలు, బీసీ సంఘాల జేఏసీ ప్రతినిధులు సమరశంఖాన్ని పూరించారు. 10వ తేదీన తెలంగాణ అంతటా ఎక్కడికక్కడ నిరసన జెండాలు ఆవిష్కరించి, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు 9వ తేదీన కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు అమరణ నిరహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ లో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు, బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బీసీ సంఘాలు, బీసీ విద్యార్ధి, మహిళా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. తీసుకున్న ఈ నిర్ణయాల అమలుకు అన్ని జిల్లాల్లో కార్యాచరణ చేపట్టారు.

బీసీలకు బీజేపీ వ్యతిరేకం

రాష్ట్ర బీజేపీ నాయకులు సమరోత్సాహంతో మోదీకి ఘన స్వాగతం పలుకాలని భావిస్తుండగా అఖిలపక్ష నేతలు, బీసీ సంఘాలు నిరసనకు సిద్ధం కావడం గమనార్హం. బీసీ ప్రధాని, బీసీ సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందంటూ ఆ పార్టీ నేతలు పదేపదే చేస్తున్న ప్రకటనలు, మాటలను నిలదీస్తూ రాజకీయ పక్షాలు నిరసనకు సిద్ధమవుతున్నారు. బీజేపీ అధికారం కోసం బీసీలను వంచింస్తోందని మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను బీజేపీ గుర్తించడంలేదని నాయకులు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు బీసీ కుల గణన చేపట్టకుండా నాటకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను నమ్మించి దగా చేస్తున్న బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచే వరకు బీజేపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తామని నాయకులు ప్రకటించారు. సకల జనుల సమ్మె స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపు నిచ్చారు.

మోదీ స్పందన పై సర్వత్రా ఆసక్తి

బీసీ సంఘాలు తమ డిమాండ్లు ముందు పెట్టిన నేపథ్యంలో మోదీ ఈ పర్యటనలో ఏ విధంగా స్పందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణాలో బీజేపీ పట్టుసాధించాలనుకుంటున్న నేపథ్యంలో బీసీల ఓట్లు సాధించకుండా సాధ్యం కాదని,ఈ స్థితిలో బీజేపీ బీసీల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకు జాప్యం చేస్తుందనే చర్చ ఆ పార్టీలో కూడా సాగుతోంది. అధికారంలోకి వచ్చే సానుకూల పరిస్థితులు ఏర్పడితే తప్ప బీజేపీ అంత ఆషామాషీగా తన వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధం కాదని, కొందరు రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. తెలంగాణలో ఇంకా బీజేపీకి సానుకూల పరిస్థితలు లేవని, ఇక్కడి బీజేపీ నాయకత్వంలోని విభేదాలు, అనైక్యతతో పాటు పలు రాజకీయ కారణాలతో తమ పట్టుబిగించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టడం లేదంటున్నారు .ఈ కారణంగానే బీజేపీ నాయకత్వం , మోదీ బీసీల సమస్యలు, తెలంగాణ అభివృద్ధి తదితర అనేక అంశాల పై సానుకూలంగా స్పందించడంలేదంటున్నారు. సాదాసీదాగా, మొక్కుబడిగా కేంద్ర బీజేపీ నాయకులు, ఆ ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్నారంటూ మరో అభిప్రాయం కూడా ఉంది.

Latest News