రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది?: మంత్రి పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే ముందు.. పదేళ్లు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి, మీ నియోజకవర్గాలకు ఏం చేశారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ కుమార్ లను మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు

*ఉపాధి కల్పన ఉట్టి మాటే!
*రాష్ట్ర విభజన హామీలు
పట్టవా?
*వస్త్ర పరిశ్రమపై బీఎస్టీ
వేసిన ఘనత బీజేపీదే…
*తెలంగాణ అభివృద్ధికి
మీరు చేసింది ఏమిటో
చర్చకు సిద్ధమేనా?
విధాత బ్యూరో, కరీంనగర్: కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే ముందు.. పదేళ్లు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి, మీ నియోజకవర్గాలకు ఏం చేశారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ కుమార్ లను మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. బీజేపీ ఇచ్చిన హామీలేవి అమలుకు నోచని విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చేందుకే నిరసన దీక్ష చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. అధికారంలోకి రాగానే స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని బయటకు తెస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న బిజెపి ఏ ఒక్కరి ఖాతాలోనైనా ఆ డబ్బు వేసిందా అని ప్రశ్నించారు.
ఆదివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వ హామీల వైఫల్యాలపై పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలల పాటు కొనసాగిన నిరసనల్లో వెయ్యి మందికి పైగా రైతులు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు గుదిబండలా మారిన నల్ల చట్టాలపై కనీసం స్పందించని రాష్ట్ర బీజేపీ నేతలు ఈరోజు ఏ మొఖం పెట్టుకొని రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
దేశంలో ఉపాధి కల్పన కోసం కాంగ్రెస్ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ పంచవర్ష ప్రణాళికలు అమలు చేస్తే, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన అన్న బీజేపీ హామీ ఆచరణకు నోచలేదన్నారు. తెలంగాణ ఏర్పాటును, అమరుల త్యాగాలను, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అవమానపరిచే విధంగా ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడితే ఆ సభలో ఉండి కూడా బండి సంజయ్ ఎందుకు నోరుమెదపలేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు జరుగుతున్న కేటాయింపుల మాదిరిగానే తెలంగాణకు కేంద్ర నిధులు వస్తున్నాయని, అయితే కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చిన నిధులేమిటని నిలదీశారు. రాష్ట్ర విభజన సమయంలో సీలేరు ప్రాజెక్టు, ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలుపుకున్నారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ఎస్ఐడీపీ పథకం కింద అనేక రాష్ట్రాలకు కేంద్రం నుండి నిధులు విడుదలవుతే, ఆ పథకంలో రాష్ట్రానికి నయా పైసా రాలేదన్నారు. అక్షింతల పేరుతోనో, మతాల పేరుతో కాకుండా కరీంనగర్ అభివృద్ధికి ఎవరు, ఏమి చేశారో చెప్పుకుంటే బాగుంటుందన్నారు. కరీంనగర్లో కేంద్రీయ విద్యాలయం, తిరుపతికి రైలు సర్వీస్, పాస్పోర్ట్ కార్యాలయం, మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల, జాతీయ రహదారుల నిర్మాణం.. ఇలా అన్ని తాను ఎంపీగా ఉన్న సమయంలో తీసుకు వచ్చినవే అని చెప్పారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత పది ఏళ్లలో బిజెపి చేసిన అభివృద్ధి ఏమిటో చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. పదేళ్లు దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి తన ఫోటోతో కాకుండా, రాముడి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని, దీంతోనే ఆయన పరువు, ప్రతిష్ట దిగజారిపోయిందన్నారు. దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారికి చరమగీతం పాడాల్సిన అవసరం ప్రజానీకంపై ఉందన్నారు. ప్రస్తుత లోకసభ ఎన్నికలు అత్యంత కీలకమని, పార్టీ కార్యకర్తలు నెల రోజులపాటు కష్టపడి ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.