నీట్‌పై 24న ఢిల్లీలో నిరసన … కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

నీట్ పరీక్ష నిర్వహించడంలో విఫలమైన ఎన్టీఏను రద్ధు చేసి నీట్ విద్యార్థులకు,తల్లితండ్రులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ డిమాండ్‌ చేశారు

నీట్‌పై 24న ఢిల్లీలో నిరసన … కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

విధాత, హైదరాబాద్‌ : నీట్ పరీక్ష నిర్వహించడంలో విఫలమైన ఎన్టీఏను రద్ధు చేసి నీట్ విద్యార్థులకు,తల్లితండ్రులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. నీట్‌ అక్రమాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో గాంధీ భవన్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బల్మూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ నీట్‌పై 24వ తేదీన ఢిల్లీలో పార్లమెంట్ ఘోరావ్ నిరసన కార్యక్రమం చేపడుతామని తెలిపారు. 24లక్షల మంది నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. నీట్ పరీక్ష నిర్వాహణలో కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ విఫలమయ్యాయని విమర్శించారు. జూన్ 14న విడుదల కావాల్సిన నీట్ ఫలితాలను 10రోజుల ముందే విడుదల చేశారంటేనే అర్థం చేసుకోవచ్చన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజు ఫలితాలిస్తే ఎవరు పట్టించుకోరని నీట్ ఫలితాలు ఇచ్చారని ఆరోపించారు. ఎన్‌డీఏ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్‌ లీకేజీ జరిగిన్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. బీహార్, గుజరాత్, హర్యానలో పేపర్ లీకేజీ జరిగిందని ఆధారాలతో సహా బయటికి వచ్చాయని వెల్లడించారు. ఎక్కడైనా ఎగ్జామ్ 1 లేదా 2 లేదా 5 నిమిషాలు లేట్ అవుతుందని, సుమారు 30 నిమిషాలు లేట్ అయిందని గ్రేస్ మార్క్స్ పేరుతో 60,70,100 మార్కులు ఇవ్వడం దారుణమన్నారు. పేపర్‌ లీకేజీలో అరెస్ట్ కాబడిన వారు సైతం 40 లక్షలకు పేపర్‌ విక్రయించారని చెప్పారన్నారు. నిన్న రాహుల్ గాంధీ గారు 15 మంది నీట్ విద్యార్థులను కలిశారని, అందులో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు కూడా వెళ్లి వారి బాధ చెప్పుకున్నారని తెలిపారు. కేంద్రం వెంటనే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ జరిపించాలని, నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని పేర్కోన్నారు.